
సోషల్ మీడియా కట్టడికి.. మంత్రులతో ఉపసంఘం
మొత్తానికి చంద్రబాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇంకా తటస్థ సోషల్ మీడియా కార్యకర్తలను చూసి బాగానే భయపడుతున్నారు. ఆయనకు సొంతానికి.. ఆయన్ను మోయడానికి ఐదారు చానెళ్లు.. పలు పత్రికలూ ఉన్నాసరే అవేమీ ఆయన్ను బయటి సోషల్ మీడియా దాడుల నుంచి కాపాడలేకపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలు.. తప్పుడు ప్రచారాలను యువత ఎప్పటికప్పుడు వీడియోలు.. పోస్టుల ద్వారా ఎండగడుతూ వస్తున్నారు.
మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం చంద్రబాబుకు వంత పాడుతున్నప్పటికీ ఇటు సోషల్ మీడియా ప్రభావము మాత్రం చాలా ఎక్కువగా ఉంది.. దీంతో చంద్రబాబు ఎన్ని రకాలుగా నమ్మించాలని చూస్తున్నా కుదరడం లేదు.. మొన్నటికి మొన్న కుప్పానికి నీళ్లు అంటూ కాలువకు భారీగా ప్రారంభోత్సవం చేసారు.. ఒకరోజు నీళ్లు ఇచ్చారు.. దాన్ని తమ సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నారు.. మర్నాడు ఆ కాలువకు నీళ్లు రాక ఎండిపోయింది.. ఇదే విషయాన్నీ స్థానిక యువత .. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి వేదికల మీద ఫోటోలు.. వీడియోలతో సహా ఎండగట్టింది.
అమరావతి అంతర్జాతీయ నగరం అని చెప్పుకున్న చంద్రబాబును వెక్కిరిస్తూ అది మునిగిపోతున్న నగరం.. ఇవిగో ఐకానిక్ టవర్స్, అదిగో మునిగిపోయిన హైకోర్టు అంటూ వీడియోలు వెల్లువలా సోషల్ మీడియాను ముంచెత్తాయి. ఈ తాకిడిని తెలుగు దేశం తట్టుకోలేక తెల్లమొహం వేసింది. స్టీల్ ప్లాంట్ మీద.. పరిశ్రమల మీద ఇలా అన్ని అంశాలమీదా సోషల్ మీడియా ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తుండడంతో తట్టుకోలేక ఇక సోషల్ మీడియాను నియంత్రించడానికి ఏకంగా నలుగురు మంత్రులతో ఉపసంఘాన్ని వేశారు.
మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథితో ఈ కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్‌లను అరికట్టేందుకు, వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ ఈ కమిటీ విధివిధానాలు నిర్ణయిస్తుందన్నమాట.. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. ఎరువుల్లేక రైతులు అల్లాడిపోతున్నారు.. ధరల్లేక మిర్చి, మామిడి, చీనీ నిమ్మ రైతులు అవస్థలు పడ్డారు.. ఇలా అన్ని వర్గాలవాళ్ళూ ఇబ్బందులు పడిన ఏనాడూ చంద్రబాబు ఉపసంఘాన్ని వేయలేదు.
స్టీల్ ప్లాంటును కేంద్రం ప్రయివేటుకు అప్పగిస్తున్న పరిస్థితి పైనా ఉపసంఘం వేయలేదు.. కేంద్ర నిర్ణయాన్ని ఆపడానికి ప్రయత్నించలేదు.. కానీ తన అసమర్థతను ఎప్పటికప్పుడు బయటకు తెలియజేస్తున్న సోషల్ మీడియాను కట్టడి చేసి ప్రజల కళ్ళకు గంతలు కట్టడానికి మాత్రం ఉపసంఘం వేశారని .. సోషల్ మీడియా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అరచేత్తో సూర్యుణ్ణి.. దొంగచట్టాలతో మీ అసమర్థతను కప్పిపుచ్చలేరని యువత అంటోంది.
-సిమ్మాదిరప్పన్న