
సాక్షి, తాడేపల్లి: ఎమర్జెన్సీ కాలంలోనే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేశంలో ఎమర్జెన్సీ కారణమైన వ్యక్తులకు ప్రధాన అనుచరుడుగా అప్పట్లో చంద్రబాబు ఉన్నారు.. కానీ ఇప్పుడేమో అసలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రవచనాలు వినిపిస్తున్నారు’’ అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు దుయ్యబట్టారు.
‘‘కాంగ్రెస్ పార్టీలో సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా పని చేశారు. అప్పట్లోని ఎమర్జెన్సీలాగే ఏపీలో ఇప్పటి పరిస్థితి ఉంది. అప్పట్లో అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ప్రకటించలేదు.. అంతే తేడా. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఒక పిచ్చి మంత్రి మాట్లాడుతున్నాడు. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ కాదా?. పోలీసులు పోలీసు చట్టాన్ని అనుసరిస్తున్నారా?. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలను తయారు చేస్తున్నారు. ఈ ఏడాది కాలంలో వేలాది తప్పుడు కేసులు, చిత్రహింసలకు పాల్పడుతున్నారు’’ అని అప్పలరాజు మండిపడ్డారు.
‘‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టటం ఎమర్జన్సీ కిందకు రాదా?. లోకేష్ చేతిలో అధికారాన్ని పెట్టి, నీఇష్టం వచ్చినట్టు చేయమని సలహా ఇచ్చారు, అందుకే ఇలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. జగన్‌ని భూతం అంటూ ఫిక్కీ సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. అసలు పారిశ్రామిక వేత్తలను భయపెట్టి పారిపోయేలా చేసిందెవరు?. తమ పరిశ్రమకు రక్షణ కల్పించమని హైకోర్టుకు వెళ్లారంటే ఎవరి పాలనలో అరాచకం జరుగుతున్నట్టు?.
..జిందాల్‌ను రాష్ట్రం నుండి తరిమేసిందెవరు?. ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ మీద ఆదినారాయణ రెడ్డి దాడులు చేయిస్తే ఈ ప్రభుత్వం ఏం చేసింది?. పల్నాడులో భవ్య సిమెంట్స్‌పై టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని దాడి చేయిస్తే ఫ్యాక్టరీకి తాళం వేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బ్రూవరీస్ మీద లంచాల కోసం వేధించలేదా?. మై హోం సిమెంట్స్ గనులపై ఆంక్షలు పెట్టి వేధించిందెవరు?. చికెన్ టాక్స్ వేసి, కేజీకి రూ.10లు వసూలు చేస్తున్నదెవరు?, కృష్ణపట్నం పోర్టు మీద దాడులకు దిగింది టీడీపీ నేతలు కాదా?’’ అంటూ అప్పలరాజు ప్రశ్నలు సంధించారు.
..ఇలాంటి దాడులు చేస్తూ పారిశ్రామిక వేత్తలను తరిమేస్తున్నది చంద్రబాబు ముఠానే. అలాంటి చంద్రబాబు ఇప్పుడు జగన్‌ని భూతం అంటూ ఎలా మాట్లాడతారు?. యోగాంధ్ర విఫలం కావడంతో జగన్ పల్నాడు పర్యటనపై ఆరోపణలు చేశారు. ఒక మార్ఫింగ్ వీడియోని తెర మీదకు తెచ్చి ఏకంగా జగన్‌పై కేసు నమోదు చేశారు. చివరికి కారులో కూర్చున్నారంటూ మిగతా వారి మీద కూడా కేసు పెట్టటం ఏంటి?. జగన్ స్పీడుగా వెళ్లి జనాన్ని గుద్దించమని డ్రైవర్‌కి చెప్పినట్టు దిక్కుమాలిన రిపోర్టు రాశారు. ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ కారు ఢీకొని వృద్దుడు చనిపోతే డ్రైవర్ మీదనే ఎందుకు కేసు పెట్టారు?. టీడీపీ ఎమ్మెల్యే మీద ఎందుకు కేసు పెట్టలేదు?

..2015లో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని ఒక మహిళ చనిపోతే ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదు?. 2016లో విజయవాడలో మళ్లీ చంద్రబాబు కారు ఢీకొని ఒక యువకుడు చనిపోతే చంద్రబాబు మీద ఎందుకు కేసు పెట్టలేదు?. తెలంగాణలో పవన్ కళ్యాణ్ కారు ఢీకొని ఒకరు చనిపోతే ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదు?. చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. వారి సొంత సర్వేలో ఈ వ్యతిరేకత తెలియడంతో డైవర్షన్ రాజకీయాలు మొదలు పెట్టారు. మేధావులు సైతం ఈ పాలనను మెచ్చుకోవటం లేదు. పెద్ద పెద్ద నియంతలే రాజ్యాలను కోల్పోయిన సంగతి తెలుసుకుంటే మంచిది’’ అని సీదిరి అప్పలరాజు హెచ్చరించారు.