చంద్రబాబు నిర్వాకంతోనే పెట్రోల్‌ ధరలు పెరిగాయి

Sajjala RamaKrishna Reddy Fires On Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు టీడీపీకి లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్వాకంతోనే పెట్రోల్‌ ధరలు పెరిగాయని చెప్పారు. 2015లోనే చంద్రబాబు పెట్రోల్‌, డీజిల్‌పై రూ.4 అదనంగా పెంచారని వివరించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై టీడీపీ విమర్శలు హాస్యాస్పదమని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచారని గుర్తుచేశారు. ఆయన హయాంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు లేవు అని పేర్కొన్నారు. తాడేపల్లిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. ‘బాబు హయాంలో ధరలు పెరిగినప్పుడు ఎల్లో మీడియా ఏం చేసింది? బాబు హయాంలో రోడ్ల మరమ్మతులను పట్టించుకోలేదు. బాబు అడ్డంగా దోచుకోవడం వల్లే ఈ పరిస్థితి. రెవెన్యూ తగ్గినా సీఎం జగన్ ప్రజలపై భారం మోపలేదు’ అని స్పష్టం చేశారు.

ప్రజా ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు
ఈ సమయంలో అమర్‌రాజా కంపెనీ వ్యవహారంపై స్పందించారు. ‘అమర్‌రాజ్‌ కంపెనీ విషపూరితమైన కాలుష్యం వెదజల్లుతోంది. ప్రజల ఆరోగ్యం కంటే ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని కోర్టు హెచ్చరించింది. అమర్‌రాజా వ్యవహారంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది. ప్రజలకు హాని కలిగించని పరిశ్రమలు ఉండాలన్నదే సీఎం ఉద్దేశం. ప్రజలకు ఇబ్బంది కలిగించే అన్ని పరిశ్రమలపై చర్యలు ఉంటాయి’.

రాష్ట్రంలో తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఉందని సజ్జల తెలిపారు. చంద్రబాబు అప్పులు, కరోనా వల్ల ఆర్ధిక సంక్షోభం ఏర్పడిందని వివరించారు. పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వొద్దని చెప్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి రూపాయి దుబారా అవుతుందా? అని ప్రశ్నించారు. కేంద్రం అప్పులు చేస్తుంది రాష్ట్ర బీజేపీ నేతలకు తెలియదా? అని మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top