
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ పబ్లిసిటీ వింగ్ ఆకాశమే హద్దుగా పనిచేయాలని.. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని.. ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీది ఎప్పటికీ ప్రజల పక్షమేనన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, అన్ని జిల్లాల ప్రచార విభాగం అధ్యక్షులతో సమావేశం ఇవాళ(శుక్రవారం) జరిగింది.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం కీలకమైన విభాగం. అన్ని అనుబంధ విభాగాలలో కూడా ఈ విభాగం సభ్యులు చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడానికి మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పబ్లిసిటీ వింగ్‌లో మనకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని ఎంత ఉత్సాహంగా పనిచేయగలిగితే అంత గుర్తింపు వస్తుంది. ఆకాశమే హద్దుగా మనం పనిచేసే అవకాశం ఈ విభాగంలో ఉంటుంది’’ అని సజ్జల పేర్కొన్నారు.

‘‘ఈ వింగ్‌లో కష్టపడి పనిచేసి తగిన గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా ఉంటాయి. పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ విభాగం ఎంతవరకు ఉపయోగపడుతుందనేది మీరు అంచనాలు వేసుకుని తగిన విధంగా పనిచేయగలిగేలా ఉండాలి. ఇందుకు తగిన విధంగా కమిటీల నియామకం జరగాలి. పార్టీ లైన్‌కి తగ్గట్లుగా ముందుకెళుతూ విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచడంలో ముందుండి ఉత్సాహంగా పనిచేయాలి. క్రియాశీలకంగా పనిచేసే సైన్యంలో మీరు భాగస్వాములవ్వాలి.

..చంద్రబాబు తప్పుడు ప్రచారంతో, అబద్దాలను నిజమని నమ్మించడంలో ముందుంటారు. మన పార్టీ ప్రజల పక్షంగా ఉంటుంది కానీ ఎప్పుడూ తప్పుడు ప్రచారాలను నమ్ముకోలేదు. ప్రజల అభిప్రాయలకు అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి. రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత జగన్‌ది. చంద్రబాబు అబద్ధపు మాయా ప్రపంచాన్ని ప్రజల ముందు తేటతెల్లం చేయాలి. పార్టీ అనుబంధ విభాగాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి పార్టీని, అధినేతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్ళాలి. నిర్మాణాత్మకంగా కమిటీల నియామకం చేసుకుని ముందుకెళదాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్ధేశం చేశారు.