
సాక్షి, తాడేపల్లి: భీమ్ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదని.. బ్యాంక్ అకౌంట్ లేని కంపెనీ ద్వారా డబ్బులు ఎలా ట్రాన్సాక్షన్ జరుగుతాయంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మా హయాంలో పేపర్ల కోసం కథలు సృష్టించలేదన్నారు. లేని స్కాం మీద ప్రజల్లో విషం నింపాలని చంద్రబాబు చూస్తున్నారని.. అందులో భాగంగానే రోజువారి విషపు కథలు ప్రచురిస్తున్నారంటూ సజ్జల దుయ్యబట్టారు.
‘‘యాక్టివిటి లేని కంపెనీని అక్రమ లిక్కర్ స్కాంలో ఇరికించాలని చూస్తున్నారు. డబ్బులతో పట్టుబడిన వ్యక్తికి చెవిరెడ్డికి లింక్ పెట్టారు. ఈనాడు, ఆంధ్రజ్యోతికి సిట్ బ్యానర్ ఐటమ్స్ అందిస్తుంది. గతంలో ప్రద్యుమ్న స్టూడియో-ఎన్‌లో యాక్టివ్ డైరెక్టర్. స్టూడియో-ఎన్‌ను నారా లోకేష్ ప్రమోట్ చేశారు. లోకేష్‌తోనే ప్రద్యుమ్నకు సంబంధాలున్నాయి. రోజుకో కథ రాసి బురద అంటించాలని చూస్తున్నారు. సజ్జల భార్గవ్‌రెడ్డికి సంబంధించి ప్రచురించిన కథనాలు అవాస్తవం.లిక్కర్ స్కాంలో సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఆరోపణలు అవాస్తవం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
‘‘సిట్ పేరు చెప్పి ఎల్లోమీడియా మాపై విష ప్రచారం చేస్తోంది. సజ్జల భార్గవ్ కంపెనీగా చెప్తున్న భీమ్ అసలు ఎలాంటి యాక్టివిటీ చేయటం లేదు. ఆ సంస్థకు కనీసం బ్యాంకు ఎకౌంట్ కూడా లేదు. మరి లిక్కర్ స్కాంలోని నిధులను భీమ్ సంస్థ ఎకౌంట్ ద్వారా ఎలా వెళ్తాయి?. సిట్ విచారణ ఎలా జరుగుతుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. మా హయాంలో మద్యం పాలసీ పారదర్శకంగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్టు తన మనుషులకు లాభం చేకూర్చేలాగ జరగలేదు
..డిస్టలరీల్లో ఏదైనా తప్పు జరిగి వాటి ద్వారా మేమైనా లబ్ధి పొందినట్టు ఆధారాలు ఉంటే ఏదైనా జరిగిందనుకోవచ్చు. కానీ ఏమీ జరగనిది జరిగినట్టు చూపించటానికి తెగ తాపత్రయ పడుతున్నారు. లేని స్కాం ఉన్నట్టుగా చెప్పి ప్రజల్లో విషం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఏడాదిగా ఇలా కట్టుకథలతో విచారణ జరుపుతున్నారు. సజ్జల భార్గవరెడ్డిని కూడా లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరికో లింకులు కలుపుతూ స్కాం జరిగిందని ప్రచారం చేస్తున్నారు.
..ఎల్లోమీడియా ఆఫీసుల్లో కూర్చుని సిట్ అధికారులు పని చేస్తున్నారా?. లేకపోతే ఎల్లో మీడియా, సిట్ అందరూ కలిసి టీడీపీ ఆఫీసులో కూర్చుని పని చేస్తున్నారా?. ప్రద్యుమ్న స్టూడియో ఎన్ డైరెక్టర్. ప్రద్యుమ్న, నారా లోకేష్ మధ్య సంబంధాలు ఉన్నాయి. దానిని బట్టి నారా లోకేష్‌ను కూడా కేసులో ఇరికించవచ్చా?. చంద్రబాబు చిల్లర వార్తలతో రాజకీయాలు చేయటం, పరిపాలన చేయటం సిగ్గుచేటు. రాష్ట్రంలో సమస్యలను పక్కన పెట్టి నిత్యం ప్రజల మీద విషం చిమ్మే వార్తలు రాయిస్తున్నారు.
..కళ్లముందు కనిపిస్తున్న నిజాలను కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిజాలు మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తున్నారు. యూరియా కష్టాలు గురించి జగన్ ట్వీట్ చేస్తే అది ఫేక్ అంటూ ప్రచారం చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారు. మరి ఇవన్నీ ఫేక్ అని చంద్రబాబు చెప్పగలరా?. చినముత్తేవి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న యూరియాను రైతులు అడ్డుకున్నారు. ఇందులో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నారు. కానీ వైఎస్సార్‌సీపీ వారు లారీని అడ్డుకున్నారంటూ చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు.

..అసలు సమస్యను పరిష్కరించకుండా రైతులను దూషించటం ఎందుకు?. యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందుల పాల్జేస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్ల విషయంలో కూడా సమస్యలు సృష్టించి వారి నుండి లంచాలు మెక్కుతున్నారు. యూరియా కూడా సమృద్ధిగా ఉంటే మరి ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి?. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఇందుకేనా?. ఫేక్ వార్తలు సృష్టిస్తున్నదే టీడీపీ.
..టీడీపీ ఆఫీసులోనే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టారు. తండ్రీ కొడుకులు వీకెండ్‌లో హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. వారికి జనం సమస్యలు పట్టటం లేదు. వీటన్నిటి నుంచి డైవర్షన్ చేయటానికి లేని లిక్కర్ స్కాంని సృష్టించారు. సీఎం స్థాయి వ్యక్తే జనాన్ని బెదిరిస్తుంటే ఇంకేం అనాలి. అంత దిగజారి వ్యవహరించాలా చంద్రబాబూ?. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరయినా ఇంకా జగన్ మీద పడి ఏడవాలా?. విష ప్రచారం చేయటంలో లోకేష్ తండ్రిని మించి పోయారు. లోకేష్ ఆఫీసే సీఎంవోగా మారిపోయింది. తండ్రి నిర్ణయాల కంటే లోకేష్ నిర్ణయాలే అమలవుతున్నాయి.
..వైఎస్ జగన్, విజయమ్మ విషయంలో కూడా లోకేష్ దిక్కు మాలిన రాజకీయం చేస్తోంది. ఫేక్ వీడియోలు, ఫోటోలతో శునకానందం పొందుతున్నారు. చంద్రబాబుకు అసలు కుటుంబ బంధాల గురించి తెలుసా?. చంద్రబాబు చెల్లెళ్లు ఎవరో ఈ ప్రపంచానికి తెలుసా?. కనీసం లోకేషైనా వారి మేనత్తలను గుర్తు పట్టగలడా?. చంద్రబాబు తన తమ్ముడు, చెల్లెళ్లుకు ఏం న్యాయం చేశారు?. అత్యధిక ధనవంతుల సీఎంలలో చంద్రబాబే దేశంలో నంబర్ వన్. అలాంటి వ్యక్తి తన తమ్ముడు, చెల్లెళ్లకు ఏం న్యాయం చేశారు?. రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టించుకోని ఫేక్ సీఎం చంద్రబాబు.
..యూరియా సమస్యపై ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీవో ఆఫీసుల ఎదుట నిరసన చేపడతాం. రాష్ట్రంలో పరిపాలన సాగటం లేదు. జరుగుతున్నదల్లా దోపిడీలు, కుంభకోణాలే.. ప్రశ్నిస్తే ఎంతమందిని అరెస్టు చేయగలరు?. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల నుంచి ఇప్పుడు సామాన్య ప్రజల మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. చంద్రబాబుకు ప్రజలు ఈస్టమన్ కలర్‌లో సినిమా చూపించే టైం దగ్గర పడింది. లోకేష్ ఢిల్లీ పర్యటన వలన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు. తమ పైరవీలు చేసుకోవటానికే పదేపదే ఢిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. ఆయనపై ఉన్న కేసులు కొట్టేయించుకునేందుకు వెళ్తున్నారు’’ అంటూ సజ్జల మండిపడ్డారు.