
సాక్షి, అమరావతి: రాజకీయ శక్తుల ప్రోద్బలంతోనే రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రచారం రాకుండా, దారి మళ్లించడమే కొన్ని రాజకీయ శక్తుల లక్ష్యమని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం, వైఎస్ జగన్ లక్ష్యంగా కుట్రలు చేసిన శక్తులే ఇప్పుడు మళ్లీ విజృంభిస్తున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. దేవాలయాలపై దాడులు, వెనువెంటనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ పేరుతో నిమ్మగడ్డ రమేష్ సృష్టించిన రగడ ఈ అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. నిమ్మగడ్డ ఓ ఫ్యాక్షనిస్టులా వ్యవహరించడం దారుణమని దుయ్యబట్టారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సజ్జల ఏమన్నారంటే..
ప్రజల దృష్టి మరల్చడానికే కుట్రపూరిత ఎత్తుగడలు
ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ప్రతిసారీ, ప్రజల దృష్టి మరల్చడానికి కొన్ని శక్తులు కుట్రపూరిత ఎత్తుగడలు వేస్తున్నాయి. దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 31 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వడం, 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి పునాది వేస్తున్న నేపథ్యంలో వెల్లువెత్తిన అక్కచెల్లెమ్మల ఆనందాన్ని, ప్రజా స్పందనను టీడీపీ ఓర్వలేకపోయింది. ఈ నేపథ్యంలోనే.. టీడీపీ, దానికి ఏజెంట్లుగా ఉండే మరికొన్ని పార్టీలూ కలసి కుట్రపన్నాయి. ఆ కుట్రలో భాగంగానే.. ప్రజల సున్నితమైన మనోభావాలను దెబ్బతీసేలా దేవాలయాల్లో అపచారాలకు పాల్పడటం, విగ్రహాలను ధ్వంసం చేయడం, నష్టం కల్గించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. పట్టాల పంపిణీ జరిగినంత కాలం ఇవి కొనసాగడం గమనించవలసిన విషయం.
నిమ్మగడ్డను అడ్డుపెట్టుకుని అమ్మ ఒడిపై కుట్ర
పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం రెండో ఏడాది అమ్మ ఒడి అమలు చేస్తున్న తరుణంలో.. దేవాలయాలపై దాడులు ఆగిపోయాయి. ‘నిమ్మగడ్డ’ను అడ్డం పెట్టుకుని కొత్త ఎపిసోడ్‌ను తెరమీదకు తెచ్చారు. గతంలో జేడీ లక్ష్మీనారాయణ మాదిరి ఇప్పుడు ఎల్లో మీడియా నిమ్మగడ్డను నెత్తికెత్తుకుంది. సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం దక్కకుండా చేయడమే వీరి లక్ష్యం. నిమ్మగడ్డ రమేష్ ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడం దురుద్దేశపూరితమే. మా ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధపడితే... మండల ఎన్నికలు రద్దు చేయడం, తిరిగి మధ్యలో ఎక్కడ ఆగాయో అక్కడి నుంచి కాకుండా.. పంచాయతీ ఎన్నికలకు కొత్తగా తేదీలు ప్రకటించడం ఎవరి ప్రయోజనం కోసం? కోవిడ్ వ్యాక్సిన్‌కు యావత్ దేశంతో పాటు రాష్ట్రం సన్నద్ధమవుతుంటే, ఉద్యోగులూ భయంతో ఎన్నికలు వద్దంటుంటే నిమ్మగడ్డకు ఎందుకీ పంతం? బాబు కోసం రాజ్యాంగ పదవిని దిగజార్చాలా?
ప్రజా సంక్షేమమే జగన్ లక్ష్యం
ప్రజా సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యం. దేవుడిపై ఆయనకు అత్యంత విశ్వాసం ఉంది. మతం వ్యక్తిగతం.. రాజకీయం ప్రజా సంక్షేమాన్ని కోరేదై ఉండాలన్న మా నేత మార్గదర్శకత్వంలో పార్టీ ముందుకెళ్తోంది. మతాలను రాజకీయాల్లోకి తీసుకురావద్దు. ఈ దిశగా కుయుక్తులకు దిగే శక్తులను ఉపేక్షించబోం. 2024 ఎన్నికల నాటికి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తేవాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. వచ్చే నాలుగైదు నెలల్లో పరిపాలనను విశాఖకు తరలించే వీలుంది. అధికార వికేంద్రీకరణలో భాగంగా విశాఖ పాలన రాజధాని అనే నిర్ణయం ఎప్పుడో జరిగింది. కోర్టు కేసుల వల్లే ఆలస్యమవుతోంది. ఎన్నికల సంఘం ఉద్యోగులు కొందరిని నిమ్మగడ్డ తొలగించడం సమంజసం కాదు.