‘అధికారంలో మేమే ఉంటాం..అందుకే ప్రజా సమస్యలపై చర్చ’

Sajjala And Vijaya Sai Visit YSRCP Plenary Campus At Guntur - Sakshi

గుంటూరు: వచ్చే నెల 8వ తేదీన నిర్వహించబోయే తమ పార్టీ ప్లీనరీకి ప్రతి ఒక వార్డు స్థాయి కార్యకర్తకు పార్టీ అధ్యక్షుడి సంతకంతో ఆహ్వానం ఉంటుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్టారెడ్డి తెలిపారు. నవరత్నాల ఎజెండా అనేది ఇక్కడ నుంచే వచ్చిందని, అదే వేద మంత్రంలా 95 శాతం హామీలను అమలు చేశామన్నారు. గుంటూరులో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ ప్రాంగణం ఏర్పాట్లను పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి సుచరిత, పలువురు ముఖ్యనేతలతో  కలిసి పరిశీలించిన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ..

‘ఇదే స్థలంలో మరో ప్లీనరీ నిర్వహించబోతున్నాం. రాష్ట్ర భవిష్యత్తు చిత్ర పటాన్ని మళ్లీ చర్చిస్తాం. వరుసగా అధికారంలో మేమే ఉంటాం..అందుకే ప్రజల సమస్యలపై చర్చ. ఇది ఒక పార్టీ ప్లీనరీ కాదు...ప్రజల ఎజెండాతో ముందుకు వెళ్తున్నాం. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించిన పార్టీ మాది. 8వ తేదీ మాకు పవిత్రమైన రోజు...వైఎస్సార్ పుట్టినరోజు. అందుకే ఆ రోజు వైఎస్సార్‌సీపీ ప్లీనరీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం’ అని తెలిపారు.

కిక్‌ బాబు ఔట్‌ నినాదంతో ఎ‍న్నికలకు వెళ్తాం
వచ్చే ఎన్నికల్లో కిక్‌ బాబు ఔట్‌ నినాదంతో ముందుకు వెళ్తామని  విజయసాయి రెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ప్లీనరీ నిర్వహిస్తున్నామని, మళ్లీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్లీనరీ నిర్వహిస్తామన్నారు. తమ ప్లీనరీ సమావేశాలు మిగతా వాటికి భిన్నంగా ఉంటాయన్నారు. క్షేత్ర స్థాయి నుంచి వార్డు సభ్యుని వరకూ ఈ ప్లీనరీలో పాల్గొంటారని, వచ్చే నెల 8వ తేదీన అధ్యక్షుడు ప్రారంభ ఉపన్యాసం చేస్తారని, 9వ తేదీన ముగింపు స్పీచ్‌ ఉంటుందన్నారు విజయసాయి రెడ్డి. 

పార్టీ అధ్యక్షులు అందరికీ దిశా నిర్దేశం చేస్తారు
వచ్చే నెల 8, 9 తేదీల్లో రాష్ట్ర స్థాయి వైఎ‍స్సార్‌సీపీ ప్లీనరీ జరుగుతుందని, 8వ తేదీన ప్లీనరీ ప్రారంభ కార్యక్రమం 9వ తేదీన ముగింపు కార్యక్రమంలోనూ పార్టీ అధ్యక్షులు పాల్గొంటారని మాజీ మంత్రి సుచరిత తెలిపారు. ఈ  ప్లీనరీ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు అందరికీ దిశా నిర్దేశం చేస్తారని సుచరిత స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top