
హైదరాబాద్: బీజేపీకి గుడ్‌బై చెప్పిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీకి మాత్రమే రాజీనామా చేశానని, ఎమ్మెల్యే పదవికి కాదని.. కాబట్టి మూడేళ్లు ఎమ్మెల్యే తానేనని అంటున్నారాయన. మంగళవారం ఓ మీడియా చానెల్‌తో ఆయన మాట్లాడుతూ..
నేను పార్టీకి రాజీనామా చేశాను. ఎమ్మెల్యే పదవికి కాదు. గోషామహల్‌లో ఉప ఎన్నిక రాదు. కాబట్టి నన్ను బీజేపీ ఎమ్మెల్యే అని చెప్పొచ్చు అని అన్నారాయన. అలాగే.. పార్టీ పరిణామాలపైనా ఆయన స్పందించారు. మా పార్టీలో మిత్రులు, శత్రువులు ఉంటారు. నా తప్పులు కూడా ఉన్నాయి.. అలాగే సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసింది.
మోదీ, అమిత్ షా ఫోన్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.అలాగే మీడియా లీకులు ఇస్తున్నారని మా వాళ్లే ఢిల్లీకి పిర్యాదు చేశారు. ఫిర్యాదులు, సోషల్ మీడియా వార్తలతో నా రాజీనామాకు ఆమోదం తెలిపారు. బీజేపీ నా ఇల్లు. రాజాసింగ్ రా అంటే మళ్లీ వెళ్తా’’ అని రాజాసింగ్ అన్నారు. అంతకుముందు..
తాను తిరిగి బీజేపీ చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలంటూ వచ్చిన ప్రచారాన్ని సోమవారం ఆయన ఖండించారు. నా రాజీనామా వెనుక ఏ కుట్రా లేదు. ఎవరితో పార్టీకి నష్టం జరిగిందో అధిష్ఠానానికి చెప్పాలనుకున్నా. లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు పార్టీ కోసం జీవితాలను త్యాగం చేశారు. కేంద్రహోంమంత్రి అమిత్‌షా నాకు ఫోన్ చేయలేదు. ఆయన ఫోన్ చేసేంత పెద్దవాడిని నేను కాదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాంటే ఒక ఫైటర్ కావాలి అని రాజాసింగ్ అన్నారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపికపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ జూన్ 30వ తేదీన రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.