
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోరు వేళ.. తెలుగు దేశం పార్టీ రౌడీలు రాజ్యమేలుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులే టార్గెట్‌గా దాడులకు తెగబడిన పచ్చదండు.. ఇప్పుడు పోలీసుల సాయంతో గాయపడినవాళ్లపైనే తిరిగి కేసులు పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.
బుధవారం.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వేల్పుల రాము, హేమాద్రిలతో పాటు 52 మందిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడం కొసమెరుపు.
మంగళవారం బీటెక్ రవీ అనుచరులు వీరంగం సృష్టించడం, తదనంతరం బుధవారం నల్లగొండువారి పల్లె ఘటనల్లో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే రెండు రోజులుగా జరుగుతున్న పరిణమాల్లో దాడికి పాల్పడిన ఒక్కరినీ పోలీసులు అరెస్ట్ చేయలేదు. పైగా ఒంటిపై గాయాలే కనపడకపోతే ఎలా అరెస్ట్ చేస్తాం? అంటూ డీఐజీ కోయ ప్రవీణ్ వెటకారంగా మాట్లాడడమూ చర్చనీయాంశంగా మారింది.
పులివెందులలో వైఎస్సార్‌సీపీ నేతలపై జరిగిన దాడులకు సంబంధించి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలను అవమానించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. పైగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిపై ఎదురు కేసులు పెడుతున్నారు. మరో వైపు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులపై కొనసాగుతున్న బైండోవర్ కేసులు పెడుతున్నారు.

రక్తమొడుతున్నట్లు తలలు పగులగొట్టినా.. ఒంటిపై గాయాలు లేవంటూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రచారం చేసే పల్లెల్లో కాకుండా వేరే చోటికి వెళ్లి పత్తి వేపారం చేస్తే రక్షణ కల్పించలేమని, తాము లేకపోతే తలకాయలే ఎగిరి పోయేయంటూ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పోలీసులు దాడులకు తెగబడిన వాళ్ల జోలికి వెళ్లడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది.