సాగర్‌ బరిలో జానారెడ్డి

Postponement Of Appointment Of TPCC Chief - Sakshi

ఉప ఎన్నిక తర్వాతే టీపీసీసీ అధ్యక్షుడిపై నిర్ణయం 

ఏఐసీసీ అధికారిక ప్రకటన

తెలంగాణ కాంగ్రెస్‌ నేతల అభిప్రాయానికి సోనియా ఆమోదముద్ర

సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక విషయంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్‌ అధిష్టానం కాస్త బ్రేక్‌ ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల విజ్ఞప్తి మేరకు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక పూర్తయ్యేదాకా పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. గురువారం ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి అధిష్టాన నిర్ణయాన్ని తెలియచేశారు. సాగర్‌ ఉప ఎన్నికల్లో బరిలో జానారెడ్డి దిగుతున్నట్లు ప్రకటించారు. జానా  మొదట తటపటా యించినప్పటికీ, సంప్రదింపుల తర్వాత బరిలో దిగేందుకు అంగీకరించారని  మాణిక్యం ఠాగూర్‌ తెలిపారు. టీíపీసీసీ అధ్యక్ష ప్రకటన నిర్ణయం వాయిదా వేయాలన్న సీనియర్‌ నేత జానారెడ్డి విజ్ఞప్తిని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆమోదించారని, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక తర్వాతే పీసీసీ నూతన అధ్యక్షుడితో పాటు పూర్తి కార్యవర్గం ప్రకటిస్తామని ఠాగూర్‌ పేర్కొన్నారు.

బుధవారం పార్టీ నాయకులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పీసీసీ ప్రకటనను వాయిదా వేయాలన్న జానారెడ్డి అభిప్రాయంతో దాదాపు అందరూ ఏకీభవించారన్నారు. రాష్ట్ర నాయకుల అభిప్రాయాన్ని అధినేత్రి దృష్టికి తీసుకెళ్ళగా ఆమె అంగీకరించారని ఠాగూర్‌ తెలిపారు. సాగర్‌ ఉపఎన్నిక పూర్తయ్యే వరకు ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీ పూర్తి స్థాయిలో కొనసాగుతుందని ఠాగూర్‌ స్పష్టత ఇచ్చారు. 

అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే..
నూతన పీసీసీ ఎంపికకు సంబంధించి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో గెలవడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని, అందుకే నూతన కమిటీల ప్రకటన వాయిదా వేశామని తెలిపారు. పార్టీలోని నాయకుల మధ్య పోటీ సహజమే అన్న ఠాగూర్, కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని చెప్పారు. బీసీల పట్ల కాంగ్రెస్‌ పార్టీ వివక్ష చూపిస్తోందన్నది కేవలం అసత్య ప్రచారమేనని, గత 20 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు బీసీ నాయకులే పీసీసీకి సారథ్యం వహించారన్న విషయం గుర్తు తెచ్చుకోవాలని అన్నారు.

ఇతర పార్టీల్లో మాదిరిగా కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికీ రబ్బర్‌ స్టాంప్‌ నియామ కాలు చేయదని, తెలంగాణ శ్రేయస్సు కోసం సోనియాగాంధీ అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటారని ఆయన వ్యాఖ్యానిం చారు. నూతన పీసీసీ కమిటీల ఎంపిక విషయంలో పార్టీని వీడతానని ఏ నేతా బెదిరించలేదని, సీనియర్‌ నేతగా వి.హనుమంతరావు తమ అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశారని ఠాగూర్‌ పేర్కొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top