జగిత్యాల కాంగ్రెస్‌లో ట్విస్ట్‌.. మంత్రి అడ్లూరికి కొత్త టెన్షన్!‌ | Political Twist In Jagtial Congress And Minister Adluri Laxman | Sakshi
Sakshi News home page

జగిత్యాల కాంగ్రెస్‌లో ట్విస్ట్‌.. మంత్రి అడ్లూరికి కొత్త టెన్షన్!‌

Apr 13 2026 11:54 AM | Updated on Apr 13 2026 12:02 PM

Political Twist In Jagtial Congress And Minister Adluri Laxman

సాక్షి, జగిత్యాల: తెలంగాణలో జగిత్యాల జిల్లా రాజకీయం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి వెళ్లిపోయినప్పటికీ హస్త​ం పార్టీలో వర్గ విభేదాలు ఆగలేదు. మంత్రి అడ్లూరి వర్గం వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ వర్గం అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చక్రం తిప్పుతున్నట్టు మంత్రి అనుచరులు బహిరంగంగానే కామెంట్స్‌ చేయడం చర్చనీయాంశమైంది.

వివరాల మేరకు జగిత్యాలలో జీవన్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్స్ ఎంపిక వ్యవహారం తెరపైకి వచ్చింది. మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్స్ మూడు పదవులనూ ఎమ్మెల్యే వర్గీయులకే అప్పగించడంతో మంత్రి అడ్లూరి వర్గం ఖంగుతిన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌ కాంగ్రెస్‌లో చక్రం తిప్పుతున్నారని ఆరోపిస్తూ అడ్లూరి వర్గం మంత్రిని నిలదీశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తే మీరేం చేస్తున్నారంటూ మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. తమ పదవుల మాటేంటని ప్రశ్నించినట్టు తెలిసింది.

జీవన్ రెడ్డిని కాదని మంత్రితో ఉంటే ఎమ్మెల్యే అనుచరులు, మాజీ బీఆర్ఎస్ నేతలకే ప్రాధాన్యం ఇవ్వడంతో వారంతా మండిపడుతున్నారు. దీంతో, దిద్దుబాటు చర్యలకు దిగిన మంత్రి అడ్లూరి.. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుని సీనియర్లతో చర్చించడానికి సిద్దమైనట్టు తెలిసింది. అయితే, పార్టీ అంతర్గత విభేదాలు బట్టబయలు కావడంతో మంత్రి అడ్లూరికి కొత్త తిప్పలు మొదలైనట్టు సమాచారం.

ఇదిలా ఉండగా.. జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పైచేయి సాధించినట్టు పలువురు చర్చించుకుంటున్నారు. మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులుగా సంజయ్ వర్గీయులు బీఆర్ఎస్ నుంచి వచ్చిన జగిత్యాల బీఆర్ఎస్ మాజీ పట్టణాధ్యక్షుడు గట్టు సతీష్, మైనార్టీశాఖ అధ్యక్షుడిగా పనిచేసిన అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, మాజీ కౌన్సిలర్ జంబర్తి లక్ష్మికి అవకాశం కల్పించడంతో విభేదాలు బయటకు వచ్చాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement