హార్మూజ్‌.. ఆనాటి హురుమాంజియే.. | sakshi special story on strait of hormuz | Sakshi
Sakshi News home page

హార్మూజ్‌.. ఆనాటి హురుమాంజియే..

Apr 13 2026 5:49 AM | Updated on Apr 13 2026 5:49 AM

sakshi special story on strait of hormuz

శతాబ్దాలుగా ఆ జలసంధితో అనుబంధం

మేలైన గుర్రాలు, ఎండుఫలాల దిగుమతి 

ఆముక్తమాల్యదలో ప్రత్యేకంగా ప్రస్తావించిన శ్రీకృష్ణదేవరాయలు  

శ్రీనాథుడి హరవిలాసంలోనూ హురుమాంజి ప్రస్తావన 

వందల ఏళ్లుగా ఇరాన్‌తో సాంస్కృతిక అనుబంధం

సాక్షి, హైదరాబాద్‌: హార్మూజ్‌ జలసంధి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ యుద్ధం కారణంగా ప్రపంచాన్ని చమురు సంక్షోభంలోకి నెట్టిన ఈ జలసంధి ఒకప్పుడు ఇదే ప్రపంచానికి నాగరికతను పరిచయం చేసింది. వ్యాపార, వాణిజ్య కా­ర్యకలాపాల రవాణాకు కేంద్రబిందువుగా నిలి­చింది. ప్రత్యేకించి మన దక్షిణాది రాష్ట్రాలకు సాంస్కృతిక వారధిగా కొనసాగింది. కాకతీయులు, రాయల కాలంలో విశేష ప్రాచుర్యంలో ఉంది. వందల ఏళ్ల క్రితమే ఈ జలసంధికి తెలుగుసాహిత్యంలో సముచితమైన స్థానం లభించింది. శ్రీకృష్ణదేవరాయలు, శ్రీనాథ కవిసార్వభౌముడు తమ సాహిత్యంలో ఈ జలసంధిని ‘హు­రుమాంజి’గా అభివర్ణించారు. హు­రుమాంజి జ­ల­సంధి నుంచే అనేక రకాల వ్యా­పారాలు కొనసాగినట్లు శ్రీనాథుడు ‘హరవిలాసం’లో ప్రస్తావించారు.

తిప్పయ్యశెట్టి అనే వ్యాపారి హురుమాంజి నుంచి అనేక రకాల విలువైన వస్తువులను తెచ్చి విక్రయించేవాడని ప్రస్తావించాడు. ఖర్జూర, బా­దం, వాల్‌నట్స్‌ వంటి ఎండుఫలాలు అక్కడినుంచి దిగుమతి అయ్యేవని ఆ గ్రంధంలో పేర్కొ­న్నారు. మరోవైపు మేలైన గుర్రాలు ‘హురుమాంజి’ నుంచి తెప్పించినట్లు శ్రీకృష్ణదేవరాయ­లు తన ‘ఆముక్తమాల్యద’లో చెప్పారు. ‘విజయనగర సామ్రాజ్యానికి సైనిక శక్తి చాలా ముఖ్యం, అందులోనూ గుర్రపు దళం ఎంతో కీలకం. అరేబి­యా, పర్షియా దేశాల్లోని ‘హురుమాజి’ రేవు నుంచి వచ్చే ఉత్తమ జాతి గుర్రాలను వెనుకాడకుండా ఎక్కువ ధర ఇచ్చి అయినా సరే కొనుగోలు చే­యా­లి’ అని ఆముక్తమాల్యదలో ప్రస్తావించారు. ఆ హురుమాంజియే ఇప్పటి హార్మూజ్‌ జలసంధి అని చరిత్రకారులు పేర్కొంటున్నారు. కాకతీయుల కాలంలో, ఆ తరువాత రాయలకాలంలో హురుమాంజి నుంచి మోటుపల్లి, మచిలీపట్నం ఓడరేవులకు సరుకులు రవాణా అయ్యేవి.  

తెలుగు సాహిత్యంలో ‘పర్షియా’.. 
ఈ ఒక్క జలసంధి మాత్రమే కాదు. పర్షియన్‌ సంస్కృతిని ప్రతిబింబించే అనేక పదాలు 15వ శతాబ్దం నుంచే తెలుగు సాహిత్యంలో కనిపిస్తాయని ప్రముఖ రచయిత వసుధేంద్ర తెలిపారు .‘గ్రీస్, పర్షియన్‌ రెండూ అత్యంత ప్రాచీనమైన నాగరికతలే అయినా పర్షియన్‌ సంస్కృతి మాత్రమే అనేక దేశాలకు విస్తరించింది’ అని చెప్పారు. బిర్యానీలు, రకరకాల మాంసాహార వంటకాలు, డబల్‌కామీటా, బాదుషా, జిలేబీ వంటి మిఠాయిలు కూడా అక్కడి నుంచి దిగమతి అయి మన ఆహారపు అలవాట్లలో భాగమయ్యాయి.

కుంకుమపువ్వు, రోజ్‌వాటర్‌ దిగుమతి 
‘ఇరాన్‌ సంస్కృతి అప్పటి రా­జులను బా­గా ప్ర­భా­వితం చేసింది. ఆ నాటి రాచ­రిక వ్యవస్థను రాయలకాలంలో అనుకరించారు. అందుకే పర్షియాకు చెందిన అనేక పదాలకు సమానమైన అర్ధాన్నిచ్చే పదాలను సంస్కృతంలో ప్రస్తుతించారు’ అని వసుధేంద్ర వివరించారు. ఈ క్రమంలో ‘అమీర్‌’ను ఇక్కడ ‘అమరనాయకుడు’ అని, ‘సుల్తాన్‌’ అనే పదానికి సమానమైన అర్ధాన్నిచ్చేవిధంగా ‘సురత్రానా’ అనే పదాన్ని వాడుకలోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రెండు వైపులా రాకపోకలు విస్తృతంగా కొనసాగాయి. చాలామంది వ్యాపారులు పర్షియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇక్కడి నుంచి సుగంధద్రవ్యాలు వంటివి అక్కడికి ఎగుమతి చేశారు. ఆనాటి పర్షియన్‌ సంస్కృతి రాజులనే కాకుండా సమాజంలోని ఉన్నతవర్గాలను విశేషంగా ఆకట్టుకుంది. బాదం, పిస్తా, కుంకుమపువ్వు, రోజ్‌వాటర్‌ వంటివి అక్కడి నుంచి దిగుమతి చేసుకొనేవారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement