అయ్యో పోలీస్‌! | - | Sakshi
Sakshi News home page

అయ్యో పోలీస్‌!

Apr 13 2026 7:44 AM | Updated on Apr 13 2026 7:44 AM

● వరుస దాడుల కలవరం ● ఎందుకిలా జరుగుతోంది కఠిన చర్యలు తప్పవు

కోరుట్ల: సాధారణంగా పోలీసులు వస్తున్నారంటే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎక్కడికక్కడే తప్పుకునే పరిస్థితులు ఉండటం సహజం. దీనికి విరుద్ధంగా ఏకంగా పోలీసులపైనే దాడులకు దిగడంతో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానం అనుసరిస్తున్న పోలీసులు చాలా సందర్భాల్లో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిని ఎదుర్కొంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు కింది స్థాయిలో కొంత మంది పోలీసులు కొన్ని విషయాల్లో అసాంఘిక శక్తులు, ఇతరత్రా అక్రమ దందాలు కొనసాగించే వారితో సాన్నిహిత్యం, సత్సంబంధాలు కొనసాగించడంతో కొంత మేర చులకన భావన ఏర్పడుతుందన్న వాదనలు ఉన్నాయి. దీనికి తోడు పోలీసులపై దాడులు జరుగుతున్న చాలా ఘటనల్లో నిందితులు ప్రతీసారి మద్యం సేవించి మత్తులో ఏమి చేస్తున్నారో తెలియని స్థితిలో ఉండటం గమనార్హం.

యూత్‌ గ్యాంగ్‌ల ఆగడాలు

పోలీసులపై దాడులు జరుగుతున్న సంఘటనల్లో ఎక్కువ మంది యువకులు ఉంటున్నారు. వీరు గంజాయి, మద్యం సేవించడానికి అలవాటు పడి సినిమా ఫక్కీలో గ్యాంగ్‌లు ఏర్పాటు చేసుకుని ఆగడాలకు పాల్పడుతున్నారు. కోరుట్ల పట్టణంలో ఈ రీతిలో లెక్కలేని యూత్‌ గ్యాంగ్‌లు రాత్రి వేళల్లో అడ్డాలు వేయడం..అక్కడే మద్యం సేవించి విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారన్న అపవాదు ఉంది. ఇలాంటి యూత్‌ గ్యాంగ్‌లపై పోలీసులు సరైన రీతిలో దృష్టి సారించకపోవడం, ఫలితంగా చిన్నచితకా అనైతిక చర్యలకు పాల్పడుతున్న యూత్‌ గ్యాంగ్‌లు తమకు అడ్డులేదన్న రీతిలో రెచ్చిపోయి ముదిరిపోతున్నాయి. కోరుట్లలో ఇలా ముదిరిన యూత్‌ గ్యాంగ్‌లు ఏకంగా పెద్ద పెద్ద నేరాలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. ఇలా నేరాలకు పాల్పడుతున్న యూత్‌ గ్యాంగ్‌లకు రాజకీయ అండదండలు ఉండడంతో నేరాలకు పాల్పడిన సందర్భాల్లో పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరించలేకపోతోందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ముదిరిపోతున్న యూత్‌ గ్యాంగ్‌లు పోలీసులపైనే దాడులకు తెగబడటం గమనార్హం. యూత్‌ గ్యాంగ్‌ల అడ్డాలపై తరచూ తనిఖీలు చేసి నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫలితంగా అవాంచనీయ ఘటనలు జరగకుండా అడ్డుకట్ట వేయచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పట్టణంలోని పలు చోట్ల గ్యాంగ్‌లుగా ఏర్పడి అడ్డాలు వేస్తున్న యువకుల సమాచారం మా వద్ద ఉంది. వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఇప్పటికే కొంత మందిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించాం. ఎలాంటి అనైతిక సంఘటనలను ఉపేక్షించేది లేదు.

– సురేశ్‌బాబు, సీఐ, కోరుట్ల

‘శుక్రవారం రాత్రి గంజాయి తీసుకెళుతున్న వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా అతను కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు’.

‘పదిహేను రోజుల క్రితం పట్టణంలోని సాయి జీనియస్‌ స్కూల్‌ సమీపంలో ఓ ఫ్లెక్సీ వివాదంలో కత్తిపోట్ల ఘటన చోటుచేసుకోగా ఆపే యత్నంలో నిందితుడు, కానిస్టేబుల్‌ను గాయపరిచాడు’.

‘ఇరవైరోజుల క్రితం కోరుట్ల పట్టణం భీమునిదుబ్బలో డీజే వద్ద గొడవ జరుగుతుందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులను తోసేసిన ఘటన చోటు చేసుకుంది’.. ఇలా నెల రోజుల వ్యవధిలో కోరుట్ల పట్టణంలో వరుసగా మూడు ఘటనల్లో పోలీసులపైనే దాడులు జరిగిన తీరు కలవరపెడుతోంది. ఈ సంఘటనల్లో నిందితులపై పోలీసులు కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేశారు. అయితే ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయన్న విషయంలో సరైన స్పష్టత రావడం లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఫలితంగానే ఈ దుస్థితి ఏర్పడిందన్న అభిప్రాయాలు కొంత మేర వ్యక్తమవుతుండగా, రాజకీయ ఒత్తిళ్లు ఓ కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement