అవినీతిమయ పార్టీలు: ఆప్, కాంగ్రెస్‌లపై మోదీ విసుర్లు

PM Narendra modi slam aap and congress party - Sakshi

సోలన్‌ (హిమాచల్‌ప్రదేశ్‌): ‘‘కరడుగట్టిన నిజాయతీపరుమని చెప్పుకునే ఆమ్‌ ఆద్మీ పార్టీ నిజానికి అత్యంత అవినీతిమయం. ఇకకాంగ్రెసైతే అవినీతికి, స్వార్థ రాజకీయాలకు, ఆశ్రిత పక్షపాతానికి తిరుగులేని గ్యారెంటీ’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ రెండు పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కపెట్టారు. శనివారం హిమాచల్‌ప్రదేశ్‌లోని సుందర్‌ నగర్‌లో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. స్థిరత్వానికి, అభివృద్ధికే ఓటేయాల్సిందిగా ప్రజలను కోరారు. ఈ హిమాలయ రాష్ట్రంతో తనకు సుదీర్ఘ అనుబంధముందని చెప్పారు. అధికార బీజేపీకి వేసే ప్రతి ఓటూ తనకు ఆశీర్వాదమని భావిస్తానన్నారు. ‘‘మీరు వేసే ప్రతి ఓటూ వచ్చే పాతికేళ్ల కాలానికి రాష్ట్ర భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది.

నేను కమలం పువ్వు గుర్తు చేపట్టి మీ ముందుకొచ్చాను. మా అభ్యర్థులను చూడకండి. కమలం గుర్తును చూసి ఓటేయండి’’ అని విజ్ఞప్తి చేశారు. ‘‘కాంగ్రెస్‌ హయాంలో స్థిరత్వం లేని పాలన వల్ల చిన్న రాష్ట్రాలు ఎంతగానో నష్టపోయాయి. చిన్న రాష్ట్రమని హిమాచల్‌ను కాంగ్రెస్‌ ఏళ్ల తరబడి చిన్నచూపు చూసింది. అందుకే 21వ శతాబ్దంలో మనకు కావాల్సింది స్థిరమైన, బలమైన ప్రభుత్వాలు. అది బీజేపీకి మాత్రమే సాధ్యం’’ అన్నారు. ‘‘మందులను మాటిమాటికీ మారిస్తే రోగం తగ్గదు. ఎవరికీ మేలు జరగదు. అందుకే అధికార బీజేపీని మళ్లీ గెలిపించండి’’ అని కోరారు. హిమాచల్‌లో ప్రతిసారీ అధికార పార్టీ ఓడటం ఆనవాయితీగా వస్తోంది. 68 స్థానాలున్న అసెంబ్లీకి నవంబర్‌ 12న పోలింగ్‌ జరగనుంది. ఓట్ల లెక్కింపు గుజరాత్‌తో పాటుగా డిసెంబర్‌ 8న జరుగుతుంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top