సమస్తిపూర్: వచ్చే నెలలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే అన్ని రికార్డులు బద్దలుకొడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం ఆయన బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్‌లో ఎన్డీయే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. "ఫిర్ ఏక్ బార్ ఎన్డీఏ సర్కార్... ఫిర్ ఏక్ బార్ సుశాసన్ సర్కార్" అని బిహార్ ప్రజలు అంటున్నారన్నారు.
నితీశ్ కుమార్‌ను 'సుశాసన్ బాబు' అనే ప్రజాదరణ పొందిన బిరుదు పేరుతో మోదీ ప్రస్తావించారు. మొదటిసారి నితీశ్ కుమార్‌ను ఎన్డీయే ప్రచార ముఖంగా ప్రస్తావించారు. అయితే, ఎన్నికల తర్వాత ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? అనే విషయం స్పష్టంగా చెప్పలేదు. ఎక్కడా కూడా సీఎం అభ్యర్థి అనే మాట ప్రస్తావించకుండానే.. ఈసారి కూడా సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ తేజస్వి సవాల్‌పై ప్రధాని మోదీ స్పందించినట్లయింది.
కాగా, బీజేపీ.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడంలో వెనుకడుగు వేస్తోందంటూ మహాఘట్‌బంధన్ విమర్శించింది. సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీ(యూ)ని ఖతం చేయడానికి బీజేపీ కుట్రలు సాగిస్తోందంటూ తేజస్వీ యాదవ్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో నితీశ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ ఈసారి ఎందుకు ప్రకటించడం లేదు? దీని వెనుక అసలు కారణం ఏమిటి?’’ అంటూ తేజస్వీ ధ్వజమెత్తారు.


