AP Political News: Pawan Kalyan says Three options with Janasena TDP BJP alliance - Sakshi
Sakshi News home page

పొత్తుల విషయంలో మూడు ఆప్షన్లు

Jun 5 2022 4:06 AM | Updated on Jun 5 2022 9:52 AM

Pawan Kalyan says Three options with Janasena TDP BJP alliances - Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంలో తమ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. శనివారం మంగళగిరిలోని కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వాటిలో మొదటి ఆప్షన్‌ బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమన్నారు. రెండోది జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం, మూడోది జనసేన ఒక్కటే ప్రభుత్వాన్ని స్థాపించడమని అన్నారు.

బీజేపీతో పొత్తులో ఉండగానే ఆ పార్టీతో సంబంధం లేకుండా పవన్‌ టీడీపీనీ నేరుగా పొత్తుకు ఆహ్వానించడం గమనార్హం. అంతేకాదు టీడీపీ కొంచెం తగ్గితే ఈ పొత్తు ముందుకు వెళుతుందని పవన్‌ వ్యాఖ్యానించడం చూస్తే ఆయన టీడీపీతో పొత్తును ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్ధమౌతుందని విశ్లేషకులంటున్నారు. అలాగే ఒంటరిగా పోటీ చేస్తానన్న విషయం మూడో ఆప్షన్‌గా చెప్పడం చూస్తే తనమీద తనకు నమ్మకం లేదన్న విషయం తేటతెల్లమవుతోందని కూడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

వచ్చే ఎన్నికలో పార్టీ నేతల ఐక్యతపైనే జనసేన పార్టీ గెలుపు ఆధారపడి ఉందని పవన్‌ వ్యాఖ్యానించారు. అవసరం మేరకు ఒక్కోసారి తాను తగ్గుతానని, 2014లో తాను తగ్గి ఈ రాష్ట్రాన్ని గెలిపించానని అన్నారు. ‘తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును’ అని బైబిల్‌ చెబుతోందని, అవసరమైతే తాను రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గుతానని చెప్పారు.

2014లో తగ్గానని, 2019లో ఒక ప్రకటన ఇవ్వడానికి తగ్గానని, 2024లో మాత్రం తగ్గడానికి సిద్ధంగా లేనని అన్నారు. ‘టీడీపీ నాయకులకు ఒకటే చెబుతున్నా. బైబిల్‌ సూక్తిని మీరు పాటించండి. ఈసారి ప్రజలు గెలవాలని కోరుకుంటున్నా’ అని వ్యాఖ్యానించారు. పొత్తులపై తానిప్పుడు మాట్లాడిన మాటలను తేలిగ్గానే తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు.

చంద్రబాబు చెప్పినట్టు ఒకప్పుడు వన్‌ సైడ్‌ లవ్‌ అయిందని, ఇప్పుడు వార్‌ వన్‌సైడ్‌ అయిందని, వాళ్లు ఏ మాటమీద నిలబడతారో వారికి క్లారిటీ వచ్చాక అన్ని విషయాలపై మాట్లాడుకుందామన్నారు.  పొత్తులనేవి ఒక్క జనసేన చేతిలోనే లేవని, మిగతా పార్టీల చేతిలో కూడా ఉంటాయని, ఎలా జరుగుతాయో చూద్దామని అన్నారు. జనసేన, బీజేపీ మధ్య సంబంధాలు చాలా బాగున్నాయని చెప్పారు. బీజేపీ, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా తన పేరు ప్రకటించబోతున్నట్టు బీజేపీ నాయకులెవరూ తనకు చెప్పలేదని, ఆ పార్టీ జాతీయ నాయకులు చెబితే జనసేన నాయకులందరికీ తెలియజేస్తానన్నారు.

గోదావరి జిల్లాలను వైఎస్సార్‌సీపీ మర్చిపోవచ్చు
ఉభయ గోదావరి జిల్లాలను ఇక నుంచి వైఎస్సార్‌సీపీ మరిచిపోవచ్చని పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విచ్ఛిన్నకర ధోరణితో వ్యవహరిస్తోందని, అమలాపురం ఘటన బహుజనుల ఐక్యత మీద జరిగిన దాడిగా జనసేన చూస్తోందని అన్నారు.

కోనసీమలో శాంతి పరిరక్షణ కమిటీలు వేసి శెట్టిబలిజ, ఇతర బీసీల కులాల వారితో పాటు మాల, మాదిగలను సమన్వయం చేయాలని సూచించారు.  తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement