బిహార్‌ ముఖ్యమంత్రిగా ఏడోసారి

Nitish Kumar takes oath as Bihar Chief Minister for the 7th time - Sakshi

ప్రమాణం చేసిన నితీశ్‌కుమార్‌

బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు

మొత్తం 14 మందితో ఎన్డీయే కేబినెట్‌

బీజేపీకి 7, జేడీయూకి 5 బెర్త్‌లు; హెచ్‌ఏఎం, వీఐపీలకు ఒక్కొక్కటి

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రిగా జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం నితీశ్‌కు ఇది ఏడోసారి. 2005 నవంబర్‌ నుంచి, మధ్యలో స్వల్పకాలం మినహాయించి, నితీశ్‌ బిహార్‌ సీఎంగా కొనసాగుతున్నారు. 2014 మే నుంచి 2015 ఫిబ్రవరి వరకు జితన్‌ రామ్‌ మాంఝీ రాష్ట్ర సీఎంగా ఉన్నారు. బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఎన్డీయే మిత్రపక్ష నాయకుల సమక్షంలో రాజ్‌భవన్‌లో నితీశ్‌తో గవర్నర్‌ ఫగు చౌహాన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించిన విషయం తెలిసిందే. నితీశ్‌తో పాటు 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో బీజేపీకి చెందిన తార్‌కిషోర్‌ ప్రసాద్, రేణుదేవి ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. బీజేపీ నుంచి ఏడుగురు, జేడీయూ నుంచి ఐదుగురు, హెచ్‌ఏఎం, వీఐపీల నుంచి ఒక్కొక్కరు చొప్పున తాజా మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. హెచ్‌ఏఎం నుంచి మాజీ సీఎం జితన్‌రామ్‌ మాంఝీ కుమారుడు సంతోష్‌ కుమార్‌ సుమన్‌(ఎంఎల్సీ), వికాస్‌శీల్‌ ఇన్‌సాన్‌ పార్టీ(వీఐపీ) నుంచి ఆ పార్టీ చీఫ్‌ ముకేశ్‌ సాహ్నీ మంత్రులుగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ స్పీకర్‌గా ఈసారి బీజేపీ నేత నందకిషోర్‌ యాదవ్‌కు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.  

2000లో తొలిసారి
నితీశ్‌కుమార్‌ బిహార్‌ సీఎంగా తొలిసారి 2000లో బాధ్యతలు చేపట్టారు. మెజారిటీ నిరూపించుకోలేక వారం రోజుల్లోపే రాజీనామా చేశారు. ఐదేళ్ల తరువాత, జేడీయూ– బీజేపీ కూటమి మెజారిటీ సాధించడంతో రెండోసారి సీఎం అయ్యారు. 2010లో అదే కూటమి ఘన విజయంతో మూడో సారి సీఎం పీఠం అధిష్టించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ  సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత, 2015 ఫిబ్రవరిలో మళ్లీ సీఎం అయ్యారు. 2015 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో  ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి జేడీయూ పోటీ చేసి విజయం సాధించడంతో నితీశ్‌  మరోసారి సీఎం అయ్యారు. అయితే, ఆర్జేడీతో విభేదాల కారణంగా 2017లో సీఎం పదవికి రాజీనామా చేశారు.

అనంతరం,  24 గంటల్లోపే బీజేపీతో మరోసారి జట్టు కట్టి ఆరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. బిహార్‌ సీఎంగా అత్యధిక కాలం కొనసాగిన ఘనత శ్రీకృష్ణ సింగ్‌ పేరిట ఉంది. స్వాతంత్య్ర పూర్వం నుంచి 1961లో చనిపోయేవరకు ఆయన సీఎంగా ఉన్నారు. ఇలా ఉండగా, కొత్త సీఎం నితీశ్‌కు అభినందనలు తెలుపుతూనే.. ఐదేళ్లు ఎన్డీయే ముఖ్యమంత్రిగానే నితీశ్‌ కొనసాగుతారని ఆశిస్తున్నట్లు లోక్‌జనశక్తి పార్టీ ప్రెసిడెంట్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. నితీశ్‌కుమార్‌ బీజేపీ నామినేట్‌ చేసిన ముఖ్యమంత్రి అని కొత్త సీఎం నితీశ్‌కు మాజీ సహచరుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ చురకలంటించారు. రాజకీయంగా అలసి పోయిన నేత ముఖ్యమంత్రిత్వంలో ప్రజలు నీరసపాలన అనుభవించక తప్పదన్నారు.

ప్రధాని అభినందనలు
న్యూఢిల్లీ: బిహార్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జేడీయూ చీఫ్‌ నితీశ్‌ కుమార్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీయే కుటుంబం కలసికట్టుగా కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం కేంద్రం తరఫున సాధ్యమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రులుగా ప్రమాణం చేసిన నాయకులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top