వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా

Nitish Kumar Said To Give Special Status To All Backward States - Sakshi

కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం వస్తే ఇచ్చేస్తాం

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ హామీ  

ఇన్నాళ్లూ బీజేపీతో కలిసి ఉండడం తప్పేనని వెల్లడి 

పట్నా:  కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకివస్తే దేశంలో వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా (స్పెషల్‌ కేటగిరీ స్టేటస్‌) కల్పిస్తామని జేడీ(యూ) నేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ హామీ ఇచ్చారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తమకు వస్తే వెనుకబడిన రాష్ట్రాలకు ఈ హోదా దక్కుతుందని, అలా జరగకపోవడానికి కారణమేదీ తనకు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. నితీశ్‌ గురువారం పాట్నాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గోవాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనేయడం దారుణమని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను దూరం చేయడం తగదని అన్నారు. బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు సుశీల్‌కుమార్‌ మోదీ, కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌పై నితీశ్‌ విమర్శలు గుప్పించారు. బీజేపీ పెద్దల ఆదేశాలతో వారిద్దరూ తనపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.

బీజేపీతో తాము చాలాకాలం కలిసి ఉండడం తప్పేనని నితీశ్‌ అంగీకరించారు. ప్రత్యేక హోదా కోసం బిహార్‌ చాలా ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. బిహార్‌ను విభజించడం వల్ల రెవెన్యూ, గనుల ఆదాయం మొత్తం జార్ఖండ్‌కే వెళ్తోందని నితీశ్‌ కుమార్‌ చెబుతున్నారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే చాలు కేంద్రంలో ఏ ప్రభుత్వానికైనా మద్దతిస్తామని వివిధ సందర్భాల్లో ప్రకటించారు. బిహార్‌లో నెల రోజుల క్రితమే బీజేపీ కూటమి నుంచి బయటకువచ్చి, ప్రతిపక్షాలతో చేతులు కలిపి మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్‌ కేంద్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలో వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీశ్‌ కుమార్‌ బరిలోకి దిగుతారని జేడీ(యూ) నాయకులు ఉద్ఘాటిస్తున్నారు. 

ఇదీ చదవండి: సర్వం అధినాయకత్వం కనుసన్నల్లోనే!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top