
పట్నా: బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ సందడి నెలకొంది. తాజాగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో ఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చల తర్వాత, బీహార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపును ఖరారు చేసింది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఎన్డీఏలో కుదిరిన ఏకాభిప్రాయం ప్రకారం నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) 102 నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 101 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టనుంది. చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 20 సీట్లలో పోటీ చేయనుంది. హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏ ఎం), రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం)10 సీట్లలో పోటీ చేయనున్నాయి. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) కు 20 సీట్లు కేటాయించడం గమనార్హం.
పెద్దన్న పాత్రలో జేడీయూ
సీట్ల పంపకంలో ఎన్డీఏ ఒక వ్యూహాన్ని అనుసరించింది. దానిలో భాగంగా జేడీయూ కూటమికి పెద్దన్నయ్య పాత్ర అప్పగించింది. నితీష్ కుమార్ నాయకత్వంలోని కూటమి ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. ఈసారి చిన్న పార్టీలకు కూడా తగినన్ని సీట్లు కేటాయించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలో సమతుల్యతను కాపాడుకునేందుకు, ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఎన్డీఏ ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తోంది.
చిరాగ్ పాశ్వాన్‌కు పెద్దపీట
ఈ అసెంబ్లీ లోక్ జనశక్తి పార్టీ (చిరాగ్ పాశ్వాన్) 40కి మించిన ఎక్కువ సీట్లు డిమాండ్ చేసింది. కానీ జేడీయూ ఆ పార్టీకి 20 సీట్లు కేటాయించింది. కూటమిలో ఆ పార్టీ ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో, చిరాగ్ పాశ్వాన్ ఎన్డీఏతో పొత్తు లేకుండా 134 స్థానాల్లో పోటీ చేశారు. అయితే అతని పార్టీ ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించగలిగింది. నాటి ఎన్నికల్లో చిరాగ్ వ్యూహం జేడీయూకి దాదాపు 30 స్థానాల్లో ఓటమి అందించిందనే వాదన ఉంది. ఈసారి చిరాగ్ పాశ్వాన్ ఎన్‌న్డీఏలో భాగస్వామి.
నితీష్ కుమార్ నాయకత్వం
రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నితీష్ కుమార్ నాయకత్వంలో జరగనున్నాయని ఎన్డీఏ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో కూటమి గెలిస్తే, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భవిష్యత్తు వ్యూహాన్ని నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. నితీష్ కుమార్ నాయకత్వం ఎన్నికల్లో ఎన్డీఏకి బలాన్ని అందిస్తుందని కూటమిలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా చెబుతున్నారు.
మహా కూటమి సన్నాహాలు
మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ వామపక్ష పార్టీలతో కూడిన మహా కూటమి కూడా తన ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేసింది. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ‘ఓటర్ అధికార్ యాత్ర’తో ఓటర్ల జాబితాలలో జరిగిన అవకతవకలను, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కు వ్యతిరేకంగా ప్రజా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచార లక్ష్యం ఓటర్లకు అవగాహన కల్పించడం, అసెంబ్లీ ఎన్నికల్లో వారు చురుకుగా పాల్గొనేలా చూడటమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.