
సాక్షి,హైదరాబాద్: బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు, మాజీ మంత్రి హరీష్‌రావుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు వేశారు. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ బద్నాం కావడానికి బీఆర్‌ఎస్ కీలక నేతలే ముఖ్యకారణమని ఆరోపించారామే. సోమవారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..
‘‘కేసీఆర్‌కు,పార్టీకి నష్టం చేస్తున్న వాళ్ల పేర్లను మొదటిసారి బయటపెడ్తున్నా. కేసీఆర్‌పై నిందలు ఎవరి వల్ల వస్తున్నాయి. హరీష్‌రావుది మేజర్ పాత్ర లేదా? హరీష్ రావు,సంతోష్ వెనక సీఎం రేవంత్ ఉన్నారు. హరీష్ రావు, సంతోష్ రావులు నా మీద పెద్ద ఎత్తున కుట్రలు చేశారు. మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వేశారు. నా కడుపు రగిలిపోతుంది. మానాన్నకు తిండి మీద,డబ్బు మీద యావ ఉండదు. తరతతరాల తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్లలో ఉన్న కొంతమంది వల్లే ఇలా జరిగింది.
ఇదంతా హరీష్ వల్లే జరిగింది. కేసీఆర్‌కు అవినీతి మరక ఎలా వచ్చిందో చూడాలి. కేసీఆర్ మీద విచారణ తర్వాత బీఆర్‌ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ వ్యాఖ్యానించారు. నేను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగొచ్చు. నష్టం జరిగినా సరే నేను ఇలాగే మాట్లాడతా. మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్‌లో కేసీఆర్‌కు మరక అంటడానికి ఇద్దరు, ముగ్గురే కారణం.
హరీష్‌రావు,సంతోష్‌రావు వల్లే కేసీఆర్‌పై అవినీతి మరక. ఇలాంటి వారిని ఎందుకు భరించాలి. కేసీఆర్‌కు అవినీతి మరక ఇలాంటివాళ్ల వల్లనే వచ్చింది. కేసీఆర్ మీద విచారణ అంటే తెలంగాణ బంద్‌కు పార్టీ ఎందుకు పిలుపునివ్వలేదు?.ఈ సమయంలో తెలంగాణ భగ్గుమనాలి. కానీ పార్టీ ఇలా ఉండటం ఏంటి?.కేసీఆర్‌పై విచారణ వేసిన తర్వాత పార్టీ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత?.కేసీఆర్‌కు ఈ వయసులో సీబీఐ ఎంక్వైరీ ఎందుకండి?’.
వీళ్లు సొంత వనరులు,ఆస్తులు పెంచుకోవడం కోసం ఇలా చేశారు. దమ్ముంటే హరీష్‌రావు,సంతోష్‌రావులపై చర్యలు తీసుకోండి.ఇరిగేషన్ శాఖ అధికారుల వద్ద వందలకోట్లు దొరికాయి. ఆ అధికారుల వెనుక ఎవరున్నారో దర్యాప్తు చేయండి. ఎవరో ఆడిస్తే ఆడే ఆటబొమ్మను కాదు. పిచ్చివాగుడు వాగితే తోలుతీస్తా. కాంప్రమైజ్ అయ్యే ప్రస్తక్తిలేదు. పార్టీ ఓటమికి కారణం కేసీఆర్ వెంట ఉన్నవాళ్లే’ అని ఆవేశంతో మాట్లాడారు.
