
చెన్నై: తమిళనాట రాజకీయం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న నేపథ్యంలో పొలిటికల్ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా టీవీకే అధినేత విజయ్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విజయ్‌ను టార్గెట్ చేసిన ఉదయనిధి.. తాను వీకెండ్ పొలిటీషియన్ కాదంటూ ఘాటు విమర్శలు చేశారు.
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కొత్తగా ఏర్పడిన కొన్ని పార్టీలకు సిద్ధాంతం ఏమిటో తెలియదు. వారికి సిద్ధాంతం గురించి అవగాహన లేదని కనిపిస్తోంది. డీఎంకే ఎన్నికల కోసం మాత్రమే పుట్టిన పార్టీ కాదు, ప్రజల హక్కుల కోసం ఏర్పడిన పార్టీ. సీఎం ఎంకే స్టాలిన్‌కు సుమారు 60 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. అనేక పోరాటాలతో ఆయన ప్రజా జీవితం నిండి ఉంది. మన సిద్ధాంతాన్ని యువతలోకి తీసుకెళ్లాలి. విద్యార్థులు, యువతతో మాట్లాడాలన్నారు.
ఇదే సమయంలో తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, నటుడు విజయ్‌పై సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఉదయనిధి మాట్లాడుతూ.. ‘నేను వారంలో 4-5 రోజులు అధికారిక పర్యటనలతో బిజీగా ఉంటాను. ఆదివారాల్లో కూడా పర్యటిస్తాను. కేవలం ప్రతీ శనివారం మాత్రమే బయటకు రాను. రాబోయే రోజుల్లో కొన్ని ఆదివారాలను కూడా ప్రచార కార్యక్రమానికి చేర్చుకోవాలని భావిస్తున్నా. నేను వారంలో ఏ రోజు అని చూడకుండా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తా. కార్యకర్తలు మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి కలిసి ఉండాలి' అని చెప్పుకొచ్చారు.
అలాగే, ఏఐఏడీఎంకే అధినేత పళనిస్వామిని ఉద్దేశించి.. ఆయనకు ఎప్పుడు బీజేపీ నేత, హోంశాఖ మంత్రి అమిత్ షానే ముఖ్యమని అన్నారు. తన సొంత పార్టీ అధినేత ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్)ను కూడా మరచిపోయారని ఎద్దేవా చేశారు. ఇక, టీవీకే విజయ్.. ప్రతి శనివారం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం రోజునే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో స్టాలిన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.