సాక్షి, తాడేపల్లి: జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తి నారా లోకేష్.. అలాంటి వ్యక్తి రెడ్‌బుక్ పేరుతో ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటికొచ్చినట్టు మాట్లాడవద్దంటూ మంత్రి పార్థసారథిని హెచ్చరించారు. అమరావతి కోసం వేలకోట్లు అప్పులు చేస్తారా?. నీళ్లు ఎత్తిపోసే రాజధాని ప్రపంచంలో అమరావతి మాత్రమే. రెండు లక్షల కోట్లు ఎక్కడ్నుంచి తెస్తారు?’’ అంటూ మార్గాని భరత్ ప్రశ్నించారు.
‘‘అది అసాధ్యం కాబట్టే వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. మంత్రులకు సింగపూర్‌లో శిక్షణా తరగతులు అంట. అవినీతి చేసి జైలు పాలయిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో శిక్షణ ఇప్పిస్తారా?. గతంలో అమరావతి రైతులను కూడా ఇలాగే సింగపూర్ తీసుకెళ్లారు. ఆ తర్వాత అమరావతిలో గ్రాఫిక్స్ చూపించి నట్టేట ముంచారు. రాధాకృష్ణ ఉన్మాదాన్ని సమర్థించిన వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్. వీళ్లు మరింత ఉన్మాదంతో వ్యవహరిస్తూ వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల మీద ట్రోల్స్ చేస్తున్నారు’’ అంటూ మార్గాని భరత్ దుయ్యబట్టారు.
‘‘కొన్ని ఫేక్ ఛానల్స్‌తో ఉన్మాదపు ట్రోల్స్ చేస్తున్నారు. నారా లోకేష్.. అధికారం శాశ్వతం కాదు. మీరు చేసే ఆర్గనైజ్డ్ క్రైం మీకే ఇబ్బంది పెడుతుందని గుర్తించాలి. డైవర్షన్ రాజకీయాల కోసం ఏం చేసినా సహిస్తామనుకోవద్దు. మావిగన్ ప్రతిపాదనపై అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసేకంటే మావిగన్ బెటర్ అన్న చర్చ జరుగుతోంది.
..అమరావతిలో రాజధాని కడితే నయా రాయపూర్, గాంధీనగర్ లాగ అవుతుంది. సాయంత్రం అయితే అధికారులు విజయవాడ, గుంటూరు వెళ్తారేగానీ అమరావతిలో ఎవరూ ఉండరు. జనంలేని అమరావతిలో రాజధాని కడతారా?. జనం ఉన్న మావిగన్‌లో రాజధాని నిర్మిస్తారా?. అమరావతి ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. అసలు ఇప్పటితరం అమరావతిని చూడలేదు’’ అంటూ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు.


