
తెలంగాణ భవన్‌లో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయాలి. రైతు రుణమాఫీ, కరెంటు బిల్లుల చెల్లింపు, రైతుబంధు రూ.15 వేలకు పెంపు, రూ.4 వేల ఆసరా పింఛన్‌ను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామనే హామీని గుర్తు చేస్తున్నాం. నిరుద్యోగ భృతిపై ప్రియాంక గాంధీ హామీ ఇస్తే, అమలు సాధ్యం కాదని డిప్యూటీ సీఎం అసెంబ్లీ వేదికగా చెప్తున్నారు.
రుణమాఫీ హామీని దశల వా రీగా అమలు చేస్తామంటూ రేవంత్ మాట మార్చా రు. గతంలో వారం రోజుల్లో 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలన్నర దాటినా రైతుల ఖాతాల్లోకి డబ్బులు రావడం లేదు. ఎరువుల కోసం మళ్లీ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే కేవలం ఆరు నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం బీఆర్‌ఎస్ నేతల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
గెలుపు బాట కష్టం కాదు
‘ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా, హైదరాబాద్‌లోనూ వేల కోట్ల రూపాయల ఆస్తులు సృష్టించి బంగారు పళ్లెంలో తెలంగాణను కాంగ్రెస్‌కు అప్పగించినా.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం విస్తృతంగా జరిగింది. ఇలాంటి వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలు, నాయకులపై ఉంది. కార్యకర్తల అభిప్రాయం మేరకే ఇకపై పార్టీ కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతుంది. పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి గెలుపుబాట పట్టడం కష్టమేమీ కాదు’అని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ వైఖరి ఎందుకు మారింది?
దావోస్ సాక్షిగా అదానీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అలయ్ బలయ్ చేసుకున్నారని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీలో అదానీతో కొట్లాడుతున్న కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం ఎందుకు కలిసి పనిచేస్తోందని ప్రశ్నించారు. ‘మోదీ, అదానీ ఒకటే అని రాహుల్‌గాంధీ అంటుండగా, ఇటీవలి కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో రేవంత్ కూడా వారు ఒకటేనంటూ మాట్లాడారు. రూ.13 లక్షల కోట్లు దోచిన అదానీ డబ్బులు ప్రధానికి, బీజేపీ ఖాతాలోకి వెళ్తాయని ఎన్నికల సమయంలో విమర్శించడంతో పాటు అదానీని దొంగ అంటూ సంబోధించారు.
అధికారంలో లేనప్పుడు అదానీని దేశానికి శత్రువుగా పోచ్చిన రేవంత్.. ఇప్పుడు అతనితో ఎందుకు కలిసి పనిచేస్తున్నారో చెప్పాలి. అదానీ పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎందుకు మారిందో చెప్పాలి. బీజేపీ ఆదేశాల మేరకే తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ అదానీతో కలిసి పని చేస్తున్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్, బీజేపీ కలిసి బొంద పెట్టాలంటూ బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి బండి సంజయ్ పిలుపునిస్తారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలి’అని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు.
ఎమ్మెల్సీలకు సమన్వయ బాధ్యతలు!
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీలకు కీలక బాధ్యతలు అప్పగించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ ఓడిపోయిన నియోజక వర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్సీలకు సమన్వయ బాధ్యతలు అప్పజెప్పాలని పార్టీ భావిస్తున్నట్లు కూడా కేటీఆర్ చెప్పినట్లు తెలిసింది. అవసరమైతే వారినే ఎంపీలుగా పోటీకి నిలిపే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా నిజామాబాద్ స్థానానికి కల్వకుంట్ల కవిత, మల్కాజిగిరికి శంభీపూర్ రాజు, మెదక్‌కు పి.వెంకట్ రాంంరెడ్డి, మహబూబాబాద్‌కు సత్యవతి రాథోడ్, నల్లగొండకు గుత్తా తనయుడు అమిత్ రెడ్డి పేర్లను సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది.
ఎమ్మెల్సీలు కీలకంగా వ్యవహరించాలి
గ్రామ స్థాయి నుంచి పొలిట్‌బ్యూరో వరకు బీఆర్‌ఎస్‌ను పునర్వ్యవస్థీకరించాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తదనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని, చురుకైన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని చెప్పారు. కేటీఆర్ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలతో సమావేశమై మాట్లాడారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని, తదనుగుణంగా ఎన్నికల ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఎమ్మెల్సీలు కీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వారం తరువాత కేసీఆర్‌తో ఎమ్మెల్సీల సమావేశం ఉంటుందని తెలిపారు. ఆ భేటీలోనే శాసన మండలికి సంబంధించి పార్టీ నేతలను ఎన్నుకుంటారని పేర్కొన్నారు.