
నీ చిల్లర వ్యాఖ్యలను వెనక్కి తీసుకో..
48 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి
బండి సంజయ్‌కి కేటీఆర్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తనపై చేసిన అడ్డ గోలు, చిల్లర వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ 48 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయనను కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరైన అనంతరం దిల్‌కుషా అతిథిగృహం వద్ద బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
దీనిపై కేటీఆర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఫోన్ ట్యాపింగ్‌పై బండి సంజయ్ చేసిన ఆరోపణల్లో ఒక్క శాతం నిజం ఉన్నా నిరూపించాలని నేను సవాల్ విసురుతున్నా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్‌కి నిఘా వ్యవస్థ ఎలా పని చేస్తుందో కనీస అవగాహన లేదు. నిఘా వ్యవస్థల నిర్వహణపై కనీస పరిజ్ఞానం కూడా లేదు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ అబద్ధాలు, అనుచిత వ్యాఖ్యలు, ప్రకటనలు అన్ని హద్దులు దాటాయి. ఇంత దిగజారుడు ఆరోపణలు, చిల్లర మాటలు, బజారు మాటలు మాట్లాడడం ఆయనకు అలవాటుగా మారింది.
ప్రతిసారి మరింత దిగజారి మాట్లాడుతున్నారు. బాధ్యత కలిగిన కేంద్ర మంత్రిగా పనిచేయడం అంటే ఢిల్లీ బాసుల చెప్పులు మూసినంత ఈజీ కాదని బండి సంజయ్ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. కేవలం తనకు రాజకీయ ప్రాధాన్యత దక్కకపోవడంతోనే, వార్తల్లో నిలవాలని తనకు అలవాటైన చౌకబారు వీధి నాటకాలకు తెరలేపిండు’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.