
ఫోన్ ట్యాపింగ్‌పై బండి సంజయ్
సీబీఐ నేరుగా విచారించే పక్షంలో కేసీఆర్, కేటీఆర్‌లను ఎప్పుడో
జైల్లో వేసేవాళ్లమన్న కేంద్రమంత్రి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహా రంపై సీబీఐతోవిచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జరిపే విచారణపై తమకు నమ్మకం లేదని అన్నారు. సిట్ విచారణ పేరుతో డ్రామాలు ఆపాలని వ్యాఖ్యానించారు. సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాస్తే విచారణకు ఆదేశించేందుకు కేంద్రం సిద్ధం ఉందన్నారు. సీబీఐ నేరుగా విచారణ చేసే అధికారముంటే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లను ఎప్పుడో జైల్లో వేసేవాళ్లమని అన్నారు.
ట్యాపింగ్‌లో భాగంగా కాంట్రాక్టర్లు, ఇతర వర్గాల వారిని బెదిరించి వేలకోట్ల వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చినందున దీని దర్యాప్తును ఈడీకి కూడా అప్పగించాలన్నారు. కేసీఆర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని, అందుకే కేసీఆర్ కుటుంబానికి రేవంత్ క్లీన్‌చిట్ ఇచ్చారన్నారు. ట్యాపింగ్ కేసులో బాధితుడు, ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ కూడా విచారణకు హాజరై స్టేట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం దిల్‌కుశ గెస్ట్‌హౌస్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
అలాంటప్పుడు విచారణ ఎందుకు?
‘గతంలో బీఆర్‌ఎస్ దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోంది. ఫోన్ ట్యాపింగ్ అడ్డుపెట్టుకుని కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు దోచుకుంటే..ఆ సొమ్ములో వాటా కోసం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు కన్పిస్తోంది. ఆ సొమ్మును ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టాలనుకుంటున్నారేమో..అందుకే కేసీఆర్ తానా అంటే రేవంత్‌రెడ్డి తందానా అంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్‌కు రేవంత్ క్లీన్ చిట్ ఇస్తున్నడు. ఆయనను అరెస్ట్ చేయబోమని చెబుతున్నడు. సీఎం ఎవరు ఆ మాట చెప్పడానికి? అట్లాంటప్పుడు ఈ కమిషన్లు, ఈ విచారణలు ఎందుకు?..’ అని సంజయ్ నిలదీశారు.
కేసీఆర్, కేటీఆర్‌లను విచారణకు పిలుస్తారా?
‘అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసును విచారించిన జడ్జి ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్, కేటీఆర్‌లను సిట్ విచారణకు పిలవగలదా? కేసీఆర్, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ మినహా ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్, అప్పటి మంత్రి హరీశ్‌రావు, ఇతర మంత్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతల ఫోన్లు, మావోయిస్ట్‌ల నుంచి ప్రమాదం పేరుతో నా ఫోన్‌తో పాటు అప్పట్లో టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. మొత్తం 6,500 మంది ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసింది. తన కుటుంబసభ్యులు, వ్యక్తిగత సహాయకులు, పనిమనుషుల ఫోన్లు, భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసి విన్నారు..’ అని కేంద్రమంత్రి ఆరోపించారు.
ఎస్‌ఐబీని అడ్డుపెట్టుకుని ట్యాపింగ్‌కు పాల్పడ్డారు..
‘ఎస్‌ఐబీని అడ్డం పెట్టుకుని కేసీఆర్, కేటీఆర్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. రాజకీయ నాయకులతో పాటు వ్యాపారులు, సినిమావాళ్లు, ప్రొఫెసర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. కాంట్రాక్టర్లను, లీడర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఎస్‌ఐబీ అధికారులు ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావు క్షణక్షణం బాధపడేలా శిక్షవేయాలి. కానీ రేవంత్ ప్రభుత్వం వీరిని కాపాడే ప్రయత్నం చేస్తోంది. కాంట్రాక్టర్లు, ఇతర వర్గాల వారిని బెదిరించి వేలకోట్ల వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చినందున దీని దర్యాప్తును ఈడీకి అప్పగించాలి. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే వెంటనే ఈడీ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.
డబ్బులు ఎవరు తిన్నారో తేల్చాలి..
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి దగ్గర రూ.7 కోట్లు పట్టుకున్నారు. మరికొందరు కాంగ్రెస్ వాళ్ల దగ్గర కోట్ల రూపాయలు పట్టుకున్నారు. ఆ పైసలన్నీ ఎటుపోయినయ్? ట్యాపింగ్ గ్యాంగ్ తిన్నారా? ట్విట్టర్ టిల్లు తిన్నాడా? తేల్చాలి..’ అని సంజయ్ అన్నారు. అన్ని ఆధారాలు ఉన్నా కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్టు చేయలేదని దుయ్యబట్టారు.
సిట్ విచారణ సందర్భంగా ట్యాపింగ్‌నకు సంబంధించి తన వద్ద ఉన్న సమాచారం, ఆధారాలు అందజేసినట్లు తెలిపారు. కాగా శుక్రవారం సంజయ్‌తో పాటు ఆయన పీఆర్‌వో పసునూరి మధు, వ్యక్తిగత సహాయకులు బోయినపల్లి ప్రవీణ్‌కుమార్, పోగుల తిరుపతి స్టేట్‌మెంట్లు కూడా పోలీసులు రికార్డ్ చేశారు. కాగా సిట్ విచారణకు వెళ్లే ముందు బంజారాహిల్స్‌లోని తన నివాసం వద్ద కూడా ఆయన మీడియాతో మాట్లాడారు.