
సాక్షి, హైదరాబాద్: ఎట్టిపనికైనా, మట్టిపనికైనా తెలంగాణ ప్రజల ఏకైక గొంతుక బీఆర్ ఎస్ పార్టీ మాత్రమేనని.. ఆ గొంతుకను కాంగ్రెస్, బీజేపీ కలసి ఖతం చే యాలని చూస్తున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్, మాజీ మంత్రి కె.తారకరామారావు ఆరోపించారు. బీఆర్‌ఎస్ ‘కారు’ వెళ్లింది స ర్వీసింగ్‌కేనని, మళ్లీ రెట్టింపు వేగంతో పరు గెడుతుందని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు ఆన్‌లైన్‌లో రేషన్‌కార్డులు మంజూరు చేశామని, ఈ విషయం కార్యకర్తలకు కూడా తెలియదని చెప్పారు. పార్టీ కమిటీలను పూర్తిస్థాయిలో వేయకపోవడం వల్ల నష్టం జరిగిందన్నారు.
గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగబోవని.. మూడు నెలలకోసారి పార్టీ కమిటీల సమావేశాలు నిర్వహించుకుందా మని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ ఎస్ లోక్‌సభ నియోజకవర్గాల వారీ సమీక్ష ల్లో భాగంగా ఆదివారం తెలంగాణభవన్ లో మల్కాజ్‌గిరి స్థానంపై సమావేశం జరి గింది. దాదాపు ఏడుగంటలకుపైగా జరిగిన ఈ భేటీలో భాగంగా.. రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్‌ఎస్ కన్నా అదనంగా వచ్చింది నాలుగు లక్షల ఓట్లు మాత్రమే. 14 అసెంబ్లీ స్థానాలను స్వల్ప తేడాతో కోల్పోయాం. బీఆర్‌ఎస్ మరో ఏడెనిమిది చోట్ల గెలిచి ఉంటే హంగ్ వచ్చేది. కాంగ్రెస్ ఎన్నికల్లో దొంగమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆ పార్టీ తప్పించుకుంటున్న తీరును ప్రజాకోర్టులోనే ఎండగట్టాలి. ఇందుకోసం సమాచార హక్కు చట్టాన్ని కూడా కార్యకర్తలు సమర్థంగా వినియోగించుకోవాలి. హామీల అమలు కోసం కాంగ్రెస్ సర్కారుపై ఇప్పటినుంచే ఒత్తిడి తేవాలి.
ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి
తెలంగాణ ప్రజల ఏకైక గొంతుక అయిన బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్, బీజేపీ కలసి ఖతం చేయాలని కుట్ర చేస్తున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ కలసిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ను ఖతం చేసేందుకు సహకరిస్తానని ప్రధాని మోదీ చెప్పారనే వార్తలు వస్తున్నాయి. బీజేపీకి బీఆర్‌ఎస్ బీటీం కాదు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఢిల్లీలో తెలంగాణ గొంతుక వినబడాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి.
నిజాలు మాట్లాడితే తప్పుపడతారా?
నిరుద్యోగ భృతిపై ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై మాట మార్చింది. 200 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులను జనవరి నెల నుంచి కట్టవద్దని గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా చెప్పారు. వారి మాటలనే నేను గుర్తుచేశా. నేను నిజాలు మాట్లాడితే విధ్వంసకర మన స్తత్వం అంటారా? సోనియాగాంధీనే కరెంటు బిల్లు కడతారని కాంగ్రెస్ నేతలు చెప్పి నందున.. ఆ బిల్లులను సోనియాగాంధీకి పంపేలా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతి నిధులు, కార్యకర్తలు ప్రజలను సమాయ త్తం చేయాలి.
బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తల పై తప్పుడు కేసులు పెడుతున్నారు. వారికి పార్టీ లీగల్‌సెల్ అండగా ఉంటుంది. మోదీ కి, రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ భయపడదు..’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాల సందర్భంగా బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తామని.. ఆ విప్‌ను ఉల్లంఘించిన వారి సభ్యత్వాలను రద్దు చేయిస్తామని హెచ్చరించారు. గతంలో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానాన్ని అతి తక్కువ ఓట్ల తేడాతో కోల్పోయామని, ఈసారి కష్టపడి విజయం చేజిక్కించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మళ్లీ వచ్చేది మన సర్కారే: హరీశ్‌రావు
బీఆర్‌ఎస్‌కు విజయాలతోపాటు అపజయా లు కూడా ఉన్నాయని, వాటికి కేసీఆర్ కుంగిపోయి ఉంటే తెలంగాణ వచ్చేదా అని మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని చెప్పారు. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఇచ్చి అభాసుపాలైన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలోనూ అదే పరిస్థితి వస్తుందని విమర్శించారు. ఎన్నికల కోడ్ బూచిని చూపి హామీల అమలును వాయిదా వేయాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చేలోపే కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారంటీలను అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
బీఆర్‌ఎస్‌ను బొందపెట్టే మొనగాడు పుట్టలేదు
సీఎం రేవంత్ విదేశాల్లో తెలంగాణ పరువు తీశారని, రేవంత్ గుంపు మేస్త్రీ పనితనం ఏంటో తేలిపోయిందని మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్‌ను బొందపెట్టే మొనగాడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ మంత్రులు కోతుల గుంపుగా ప్రవరిస్తున్నారని.. అభివృద్ధి చేయనందుకు బీఆర్‌ఎస్ ఓడిపోలేదని, కొందరు పిచ్చివాళ్లు ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు ప్రజల్లో ఆదరణ చెక్కుచెదరలేదని స్పష్టం చేశారు. ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని, రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ పాలనే దిక్కు అని వ్యాఖ్యానించారు. – మాజీ మంత్రులు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి
విద్యుత్ బిల్లులను సోనియాకు పంపిస్తాం: కేటీఆర్ ట్వీట్
‘‘మంత్రి భట్టి విక్రమార్క గారూ.. ఎన్నికల సమయంలో మీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ప్రకటనలను మాత్రమే మీకు గుర్తు చేస్తున్నాను. 2023 నవంబర్, డిసెంబర్ నెల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని ఆ ఇద్దరు నేతలు తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దీంతోపాటు బిల్లుల చెల్లింపు బాధ్యతను సోనియాగాంధీ తీసుకుంటారని కూడా సీఎం రేవంత్ స్పష్టంగా చెప్పారు. కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా ప్రజల నుంచి బిల్లులు వసూలు చేయవద్దని మీ శాఖను ఆదేశించండి. లేదంటే ఆ విద్యుత్ బిల్లులను ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసం 10 జనపథ్‌కు పంపిస్తాం’’ – ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్