బాబూ...! 'ఓటుకు నోటు' కేసు మరిచిపోయావా? | KSR's Comments On Chandrababu Naidu Election Money Vote Buying AP Politics | Sakshi
Sakshi News home page

బాబూ...! 'ఓటుకు నోటు' కేసు మరిచిపోయావా?

Aug 20 2026 11:11 AM | Updated on Aug 20 2026 11:42 AM

KSR's Comments On Chandrababu Naidu Election Money Vote Buying AP Politics

ఎన్నికలలో డబ్బులు తీసుకోవడం మానేయలేమా? ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వచ్చిన ఒక పెద్ద సందేహం!కొందరు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం అయిన సందర్భంలో ఆయన ఈ ప్రశ్న వేశారు. నిజానికి చంద్రబాబు ప్రశ్న వేసుకోవలసింది తనకే కదా అని ఎవరికైనా డౌటు రావచ్చు. అసలు చంద్రబాబు చెప్పవలసిన మాటేమిటి? ఇకపై వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో సహా ఏ ఎన్నికలోను తాము పార్టీపరంగా ఓటర్లకు డబ్బు పంచబోమని, అలాగే ఏ పార్టీని పంచబోనివ్వబోమని కదా! నిజంగా ఈ మాట అని ఉంటే ఆయనకు మంచి పేరు వచ్చేది.

ఇంతకాలం జరిగిన విషయాల సంగతెలా ఉన్నా ఇకపై ఎన్నికలలో డబ్బు ప్రభావం తగ్గించడానికి చంద్రబాబు ఇప్పటికైనా పూనుకోవడం మంచి పరిణామం కదా అని అంతా అనుకునేవారు. వాస్తవంగా అలా జరుగుతుందా? లేదా? అన్నది పక్కనబెడితే, కనీసం మాటవరసకైనా అన్నారులే అని భావించవచ్చు. ఇప్పుడు ఆ మాట చెప్పకపోవడంతో ఆయన చిత్తశుద్దిని శంకించే పరిస్థితి ఏర్పడుతుంది కదా! పైగా మహిళలే డబ్బు తీసుకుంటున్నట్లు మాట్లాడడంపై మాజీ మంత్రి రోజా వంటి వారు అభ్యంతరం చెప్పారు. ఇది మహిళలను అవమానించడమేనని ఆమె అభిప్రాయపడ్డారు.

సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు అయితే ఘాటు వ్యాఖ్య చేస్తూ రాజకీయాన్ని వ్యాపారమయం చేసిందే చంద్రబాబు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరపాలని ఈసీకి లేఖ కూడా రాశారు. నాయకులు రెండువేలు ఇస్తే, రెండు లక్షలు సంపాదించుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రెండు లక్షలేమి ఖర్మ.. రెండు కోట్లు అయినా కావచ్చు. అదేమి రహస్యం కాదు. మాకు నీతి ఉంది.. డబ్బులు తీసుకోబోమని చెప్పండి అని ఆయన అన్నారు. నేతలు డబ్బు ఇస్తుంటే తమకు నీతి ఉందని చెప్పండని, డబ్బు తీసుకోకుండా ఓటేయండి అని ఆయన అన్నారు. ఇది మంచిమాటే.

ఎన్నికలలో డబ్బు ఇచ్చేవారిది తప్పుకాదా! తీసుకునేవారిదే అవుతుందా? ఒకప్పుడు ఈ డబ్బు ప్రభావం పెద్దగా ఉండేది కాదు. టీడీపీ ఆవిర్భావం తర్వాత, అది చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చాకే ఇది బాగా అధికం అయిందని వివిధ రాజకీయ పక్షాల నేతలు విమర్శిస్తుంటారు. అందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ డబ్బు ఖర్చు పెడుతోందా? లేదా? ఓట్ల కొనుగోలుకు డబ్బు వ్యయం చేయడం లేదని చంద్రబాబు గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చేముందు ఆయా అభ్యర్దులను వారి పరిస్థితిని బట్టి 25 కోట్ల నుంచి ఏభై కోట్ల వరకు ఖర్చు చేయగలరా? లేదా? అని అడుగుతున్నారా? లేదా? కొందరి నుంచి కోట్ల రూపాయలు టిక్కెట్ కోసం వసూలు చేస్తున్నారా? లేదా? ఇతర పార్టీలు చేయడం లేదా?అని అడగవచ్చు.

ఒకరిని బట్టి మరొకరు చేసే పరిస్థితి ఎలా వచ్చింది? చంద్రబాబు ఈ సుభాషితాలు చెప్పగానే అనేక పాత విషయాలు గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో వీడియో సహిత వ్యాఖ్యలు వచ్చాయి. ముఖ్యంగా ఓటుకు నోటు కేసును పలువురు ప్రస్తావించారు. 2015లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికిగాను ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి టీడీపీ ప్రయత్నించిందన్న ఆరోపణ వచ్చింది. ఆనాటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏభై లక్షల రూపాయలు తీసుకువెళ్లి ఏసీబీకి పట్టుబడిన వైనం, ఆ తర్వాత ఆ నామినేటెడ్ ఎమ్మెల్యేతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి భరోసా ఇవ్వడం వంటి సన్నివేశాలు మరోసారి తెరపైకి వచ్చాయి.

ఆ క్రమంలో అప్పటి సీఎం అయిన కేసీఆర్‌తో రాజీలో భాగంగానే అప్పటికప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదలుకుని చంద్రబాబు విజయవాడ వెళ్లిపోయిన ఘట్టాన్ని గుర్తు చేస్తున్నారు. 1995లో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి కోట్లు వెచ్చించారని చంద్రబాబుపై స్వయంగా ఆయన మామ ఎన్‌టీ.రామారావు ఆరోపించారు. ఆ రోజుల్లో అత్తిలి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే ఓటుకు 500 రూపాయలు చొప్పున టీడీపీ పక్షాన పంచామని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి ఒక టీవీ షోలో ఓపెన్‌గానే కొన్నేళ్ల క్రితం చెప్పారు. అప్పటి నుంచి ఓటు రేటు పెరుగుతూ రెండువేలకు చేరుకుందని అంటారు.

ఇక 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేసింది అందరికి తెలుసు. ఒక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తనకు ఏడు కోట్లు టీడీపీ నాయకత్వం ఇచ్చిందని ఆ రోజుల్లో బహిరంగంగానే వెల్లడించారు. మరో ఎమ్మెల్యే తనకు బెంగుళూరులో డబ్బు అందచేశారని అంటే, ఇంకొకరు తన అప్పు మొత్తం తీరిపోయిందని, అందుకే వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించానని ఆంతరంగికంగా చెప్పేవారు. నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నది చంద్రబాబు అభిప్రాయం.

కొద్ది రోజుల క్రితం కూడా ఆయన ఒక ఉపన్యాసంలో ఈ ప్రస్తావన చేశారు. ఇతర విషయాల సంగతేమో కాని, ఎన్నికల విషయంలో ఆయన డబ్బు వ్యయంలో రాజీపడరని కొందరు సీనియర్ టీడీపీ నేతలు చెబుతుంటారు. అవసరమైతే అప్పు చేయడానికి వెనుకాడరు. అలా అప్పులు ఇచ్చినవారిలో కొందరు ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారని ప్రచారం జరిగేది.

తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ కొత్తగా రాజకీయాలలోకి వచ్చి ఓటర్లకు డబ్బు ఇవ్వకుండా విజయం సాధించారని చెబుతారు. ఆయన మాదిరి ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు అదేబాటలో నడుస్తానని చెప్పి ఉండాల్సింది కదా! ఉచిత బస్ స్కీమ్ వల్ల మహిళల ఆత్మగౌరవం పెరిగిందట. అది ఎలా ఉందో కాని, బస్‌లలో జరుగుతున్న గొడవలపై పలుచోట్ల ప్రజలు చికాకు పడుతున్నారు. ఒకప్పుడు ఏదీ ఉచితం కాదని చెప్పిన చంద్రబాబు తాను ఉచిత బస్ వంటి స్కీమ్ అమలు చేస్తే మాత్రం గొప్ప సంగతి అని చెప్పుకుంటారు. అది ఆయన ప్రత్యేకత.

ఈ సందర్భంలో ఒక మహిళ తాను ఫ్రీబస్ ఉందని హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నానని, విజయనగరం నుంచి రోజూ ఉచిత ప్రయాణం వల్ల 3500 రూపాయలు సేవ్ అవుతున్నాయని అన్నారు. తీరా చూస్తే ఆమె ఏదో చీరల వ్యాపారం చేస్తున్నారని, రీల్స్ చేస్తుంటారని సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో ఈ ఉదంతం నవ్వులపాలైనట్లయింది. పైగా హైదరాబాద్‌లో కూడా ఫ్రీబస్ స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది కదా అని కొందరు పేర్కొంటున్నారు.

మహిళలకు ఇచ్చిన ఇతర హామీల గురించి ప్రస్తావించకుండా చంద్రబాబు జాగ్రత్తపడుతుంటారు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల ఇస్తానన్న ఆడబిడ్డ నిధి గురించి మాత్రం మాట్లాడలేదు. ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ డబ్బు ఇస్తామని, వేలంపాట మాదిరి ఎన్నికల ప్రచారంలో చెప్పేవారు. దాని గురించి ఏమనుకుంటున్నారని చంద్రబాబు మహిళలను అడగలేదు. ఒక్కో కుటుంబానికి నాలుగు పథకాలు వస్తున్నాయని ఆయనే అంటారు. చేపలు ఇవ్వడం కాదు. చేపలు పట్టడం నేర్పాలి.. అని ఆయనే చెబుతారు. దేనిని నమ్మాలి!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement