
‘రైతన్నలారా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని పేరుతో మళ్లీ భూ సేకరణకు దిగుతోంది. మీకు నష్టం ఖాయం. అందువల్ల ఎవరూ ప్రభుత్వానికి భూములివ్వొద్దు’ పెదపరిమి గ్రామంలో ఒక వ్యక్తి సైకిల్‌పై తిరుగుతూ మైక్ పెట్టుకుని మరీ చేస్తున్న ప్రకటన. రెడ్‌బుక్ పాలన కాబట్టి ఇలాంటి వారిపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగి ఉండాల్సింది. కానీ.. అలాంటిదేమీ జరగలేదు. పైగా అందరూ ఆసక్తిగా వింటున్నారు. తొలివిడత భూసేకరణలో భాగమైన రైతులకు ఇచ్చిన హామీలేవీ నెరవేరకపోవడం వారి మెదళ్లల్లో కదులుతోందేమో!.
రాజధాని అమరావతి పేరుతో ఇప్పటికే 33 వేల ఎకరాల భూమి సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఇంకో 36 వేల ఎకరాలు కావాలంటూ రంగంలోకి దిగింది. ఇది కాస్తా చాలా గ్రామాల్లో తీవ్ర అలజడికి కారణమైంది. తొలి విడతలో సేకరించిన భూమిలో 20 వేల ఎకరాల్లో ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టకపోవడం మళ్లీ భూమి కావాలని అనడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వం కూడా రైతుల ఆందోళనలు, అనుమానాలను తీర్చే ప్రయత్నమేదీ చేయడం లేదు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి వారు కూడా భూములిస్తే రైతులకు నష్టమేనని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.
కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నలభై వేల ఎకరాలు తీసుకున్నా ప్రభుత్వానికి మిగిలేది పదివేల ఎకరాలేనని, ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ల వంటి వాటికి సరిపోగా కొంత భూమిని మాత్రమే అమ్ముకోగలమని చెబుతోంది. విజయవాడ సమీపంలో ఇప్పటికే ఒక విమానాశ్రయం ఉండగా కొత్తగా ఇంకోదాని అవసరమేంటి? కొత్తగా సేకరించే భూముల్లో 2500 ఎకరాలు అదానీ సంస్థకు కట్టబెట్టేందుకూ ప్రయత్నాలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.
నాడా దొరికిందని గుర్రాన్ని కొంటారా?
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. భూములివ్వమని రైతులు సైకిళ్లపై ప్రచారం చేస్తూంటే ప్రభుత్వం మాత్రం అబ్బే అలాంటిదేమీ లేదు.. అందరూ ఒప్పుకున్నట్టుగా ప్రచారం చేస్తోంది. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. కామాంధులకు భూదాహం ఎక్కువంటారు. కానీ, ప్రభుత్వమే భూదాహంతో వ్యవహరిస్తే, కామాంధులాగా మారితే ఏం చేయాలి!. ప్రజావసరాల కోసం ప్రభుత్వం భూమి తీసుకోవడం తప్పుకాదు. కానీ, ఆ అవసరాలు ఎంత అన్నదానిపై స్పష్టత ఉండాలి. అలా కాకుండా ప్రభుత్వాధినేతల ఇష్టాలకు తగ్గట్టుగా భూములు సమీకరించి భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అయిపోతుందని, కోట్ల రూపాయల లాభం వస్తుందని మభ్యపెడితేనే ప్రమాదం. నిజానికి ప్రభుత్వం తనకు అవసరమైన భూములను మంచి ధరకు రైతుల నుంచి ఖరీదు చేసి భవనాలు నిర్మించుకున్నా లక్షల కోట్ల వ్యయం కాదు.
హైదరాబాద్ ఆయా రాజధానులకు ప్రభుత్వాలు ఎంత భూమి సేకరించారన్నది పరిశీలిస్తే ఏపీ ప్రభుత్వం భూదాహం ఎంతన్నది స్పష్టమవుతుంది. వేల ఎకరాల భూమి సేకరించి ఏకమొత్తంగా లక్షల కోట్లు వ్యయం చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల ప్రభుత్వానికి కలిసొచ్చేదేమీ ఉండదు. రాజధానిగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందే క్రమంలో ప్రైవేటు సంస్థలే ఈ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటాయి. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఎనెన్నో గేటెడ్ కమ్యూనిటీలు సొంతంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం లేదు? అలా కాకుండా అన్నీ తామే చేస్తామంటే ఎలా? ఎప్పటికి కావాలి?.
ప్రపంచ బ్యాంక్ షరతు..
అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు ఎప్పుడిస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు. వేల కోట్ల వ్యయమయ్యే మౌలిక సదుపాయాల వృద్ధి ఎప్పటికయ్యేనో తెలియదు. గిరాకీ వస్తే మంచిదేకానీ.. ప్రభుత్వమిచ్చే ప్లాట్లతో రైతులకు పెద్దగా ప్రయోజనం కలగకపోతే? అప్పుడు వారు ఎంత నష్టపోతారో తలచుకుంటేనే బాధ కలుగుతుంది!. ఈ నేపధ్యంలోనే ఒక సాధారణ రైతు.. మైక్ పట్టుకుని భూములు ఇవ్వవద్దని ప్రచారం చేస్తున్నారు. రెడ్‌బుక్ అరాచకం ఈ రైతుపైనా జరుగుతుందేమో తెలియదు. ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.15వేల కోట్ల రుణానికి సంబంధించి పెట్టిన షరతులలో భూముల అమ్మకం కూడా ఒకటి ఉందట. దాని ప్రకారం భూములు ఎప్పటి నుంచి అమ్ముతారని ఆ బ్యాంకు అడుగుతోందని కథనాలు వచ్చాయి. సుమారు వెయ్యి ఎకరాల భూమి ఎకరాకు రూ.25 నుంచి రూ.30 కోట్ల లెక్కన అమ్ముకోవచ్చునని అధికారులు ప్రపంచబ్యాంకుకు తెలిపారట. ఇదసలు సాధ్యమయ్యేదేనా?. ఈ ధరకు కొనగలిగే సంస్థలెన్ని? ఇదే వాస్తవమైతే ఈపాటికి వందల ఎకరాలు అమ్మి ఉండాలి కదా!. ప్రజలను మభ్య పెట్టినట్లు ప్రపంచ బ్యాంకును కూడా మాయ చేయాలని అనుకుంటున్నారా?.
మరో విషయం ఏమిటంటే ప్రభుత్వం ఇచ్చే కౌలు రూ.30వేలు మాత్రమే ఉండడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. కొత్తగా భూములు సమీకరించే చోట గ్రామస్తులు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్టుగా ‘అన్నదాత సుఖీభవ’ కింద రైతులకు రూ.20 వేలు చెల్లిస్తే, ప్రధానమంత్రి కిసన్ యోజన కింద ఇంకో రూ.ఆరు వేలు వస్తాయని వీరంటున్నారు. అంటే.. భూములు తమ వద్దే ఉన్నా రూ.26 వేలు వస్తూండగా.. ప్రభుత్వానికి ఇస్తే వచ్చేది రూ.30 వేలు మాత్రమేనని వివరిస్తున్నారు. కేవలం రూ.4 వేల అదనపు ప్రయోజనం కోసం భూమిపై తమ హక్కులను ఎందుకు కోల్పోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులు, కొనుగోలుదారులు.. బాగా నష్టపోయారు. అందువల్లే ఆయా గ్రామసభలలో రైతులు టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌ను, అధికారులను నిలదీస్తున్నారట. కొన్ని చోట్ల వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. అయినా రైతుల ఆమోదం దొరికినట్లు అధికారులు రాసేసుకుంటున్నారట. భూములు లాక్కుని తమకు బిచ్చగాళ్లగా చేయవద్దని కొందరు మొర పెట్టుకుంటున్నారు.
గతంలో సంప్రదాయేతర ఇంధన వనరుల కోసం అదానీకి భూములు కేటాయిస్తే.. ఏపీని రాసిచ్చేస్తున్నారని నోరు పారేసుకున్న టీడీపీ మీడియా ఇప్పుడు అదానీ స్పోర్ట్స్ సిటీ గురించి మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. పైగా ఆయా సంస్థలకు ఎంత మొత్తానికి భూములు కేటాయిస్తున్నది కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు ఎకరాకు రూ.20 కోట్లకుపైగా వెచ్చించడానికి సిద్దపడకపోతే ఏం చేస్తారో తెలియదు. అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు నాలుగింటికి రెండున్నర ఎకరాల చొప్పున ఇస్తారట.
అంతర్జాతీయ స్థాయిలో నిజంగా ఆ సెంటర్లు ఏర్పాటైతే ఈ స్థలం సరిపోతుందా? ప్రస్తుతం భూదాహంతో తహతహలాడిపోతున్న ప్రభుత్వ పెద్దలు లేచింది లేడికి ప్రయాణం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాజధాని ప్రాంతమంటే తమ సొంత జాగీరన్నట్లుగా భావిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వేల కోట్ల అప్పులు సమీకరించిన ప్రభుత్వ నేతలకు ఇప్పుడు సలహాలు ఇచ్చినా వినే పరిస్థితిలో లేరన్న అభిప్రాయం ఉంది. అమరావతి ప్రజలకు, ముఖ్యంగా రైతులకు న్యాయం జరగాలని కోరుకోవడం తప్ప ఏమి చేయగలం! కొసమెరుపు ఏమిటంటే ఈ అదనపు భూమి సమీకరణపై మంత్రివర్గంలో తర్జనభర్జనపడి నిర్ణయం వాయిదా వేయడం!.
-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.