నేరుగా సమాధానం చెప్పలేరా వీళ్లు! | Kommineni Comments On Chandrababu, Nara Lokesh And Pawan Kalyan Over Coalition Governance, More Details Inside | Sakshi
Sakshi News home page

నేరుగా సమాధానం చెప్పలేరా వీళ్లు!

May 26 2026 10:29 AM | Updated on May 26 2026 11:27 AM

Kommineni Comments On Chandrababu Nara Lokesh And Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ ఎంత మొత్తుకున్నా ఏం లాభం? జవాబు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ పవన్‌, కీలక మంత్రి లోకేశ్‌లు ఎప్పటికప్పుడు ఆవు కథ వల్లెవేస్తూ ప్రజలను పదే పదే మభ్యపెట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్‌ లేవనెత్తిన అంశాలపై ఈ కూటమి నిర్దిష్ట, నిర్దుష్ట సమాధానం చెప్పలేకపోతోంది.

రాజధాని పేరుతో అమరావతిలో జరగుతున్న ధన దోపిడీపై జగన్‌ కొన్ని రోజుల క్రితం విస్పష్టమైన సమాచారం, గణాంకాలతో వివరించారు. ఇదే సందర్భంలో హత్యా రాజకీయాలు ఎవరివో బాబు అండ్‌ కో స్పష్టం చేయాలని ప్రశ్నించారు కూడా. పెట్రోలు, డీజిల్‌ ధరలపై వీరు గతంలో ఇచ్చిన హామీలు.. ప్రస్తుత పరిస్థితులను పోల్చి విమర్శించారు. ‘‘బోత్‌ ఆర్‌ నాట్‌ ద సేమ్‌’’ అంటూ లోకేశ్‌ చేసిన వ్యాఖ్యకు సమాధానమిస్తూ.. తమ ప్రభుత్వం, పాలన ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి అస్సలు పొంతనే లేదని స్పష్టం చేశారు... ‘‘అవును.. బోత్‌ కేన్‌ నెవ్వర్‌ బీ ద సేమ్‌’’ అంటూ జగన్‌ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్‌మీడియాలో హైలైట్‌గా నిలుస్తోంది.

జగన్‌ అన్ని రకాల ఆధారాలతో చేసిన ఆరోపణలకు లోకేశ్‌, మంత్రి అచ్చెన్నాయుళ్లు ఇచ్చిన సమాధానం ఏమిటి? వ్యక్తిగతంగా జగన్‌ను విమర్శించడం. దూషణలకు దిగడం. తమ భుజాలు తామే చరచుకుని ‘‘శెభాష్‌’’ అనుకోవడం. అబద్ధాలకు రెక్కలు తొడిగి ప్రజల్లోకి తీసుకెళ్లడమే పనిగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్న జగన్‌ మాట అక్షరసత్యమవుతోంది. లోకేశ్‌ ఈ మధ్య తన ప్రసంగాల్లో జగన్‌పై కొన్ని విమర్శలు చేశారు.

‘‘బోత్ ఆర్ నాట్ సేమ్, అర్థమైందా రాజా...’’ అంటూ సినిమా డైలాగు ఒకటి వదిలారు. చేసిన విమర్శలకు ఆధారాలు చూపిస్తే ఓకే కానీ... 99 శాతం అర్ధ సత్యాలుతో వాగడమే సమస్య. అచ్చం తన తండ్రి చంద్రబాబు మాదిరిగానే జగన్‌ అడిగిన వాటికి సూటిగా జవాబివ్వకుండా ఊకదంపుడు ఉపన్యాసాలకు పరిమితమవుతున్నారు. హుందా రాజకీయాలు చేయడం, నిర్మాణాత్మక విమర్శలు చేయడం, ప్రతిపక్షం చేసే ఆరోపణలకు బాధ్యతాయుతంగా జవాబు ఇస్తే గౌరవం కానీ... గొడ్డలి పార్టీ అని, మరొకటి అని నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసి, చుట్టుపక్కల ఉన్న వారితో ఆహా.. ఓహో అనిపించుకుని మురిసిపోతే ఆయనకే నష్టం.

లోకేశ్‌ వ్యాఖ్యలకు జగన్ దీటుగా ఇచ్చిన సమాధానంతో ఎవరి తీరు ఏమిటన్నది స్పష్టమైపోయింది. వెన్నుపోటు ద్వారా అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు... ప్రజాబలంతో గద్దెనెక్కిన తామూ....‘నెవ్వర్‌ కేన్‌ బీ ద సేమ్‌’’ అని స్పష్టం చేశారు. అలాగే.. ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ ఎలా ఎగవేసింది.. తాము ఎలా నూటికి నూరుశాతం అమలు చేసింది ప్రస్తావించి లోకేశ్‌ వ్యాఖ్యను పూర్వపక్షం చేశారు. 

2014లో చంద్రబాబు రైతు రుణ మాఫీతోపాటు అనేకానేక ఇతర వాగ్ధానాలిచ్చిన అధికారంలోకి రావడం.. ఆ తరువాత కొంత కాలానికి ఎన్నికల మేనిఫెస్టోను తెలుగుదేశం వెబ్‌సైట్‌ నుంచి తొలగించడం తెలిసిందే. 2024లో సూపర్ సిక్స్ పేరుతో అలవికాని హామీలిచ్చి చాలావాటిని అమలు చేయకుండానే చేసేసినట్లు ప్రచారం చేసి టీడీపీ నేతలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారు. అదే జగన్ తన మానిఫెస్టోని సచివాలయాల్లో ప్రదర్శనకు పెట్టి అంతా దానిని ఫాలో అవ్వాలని ఆదేశించి కొత్త ట్రెండ్ సృష్టించారు. దీనిని చంద్రబాబు, లోకేశ్‌లు కాదనగలరా? దీనిపై వారు సమాధానం చెబితే బాగుంటుంది కదా! అందుకే బోత్ కెన్ నెవ్వర్ సేమ్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్య అర్థవంతం అవుతుంది.

అమరావతి రోడ్లు, భవనాల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని  జగన్ అంకెలతో సహా కడిగి పారేశారు. దీనికి లోకేశ్‌ సమాధానం ఇవ్వలేకపోయారు. కాని మంత్రి అచ్చెన్నాయుడుతో మాత్రం... ‘‘ఆవును అమరావతిలో అయ్యే ఖర్చు వేరు..ఇతర ప్రాంతాలలో అయ్యే ఖర్చు వేరు రెండిటిని ఎలా పోల్చుతారు’’ అంటూ చిత్రమైన సమాధానం ఇచ్చారు. కానీ ఏ కారణాల వల్ల చదరపు అడుగుకు రూ.ఇరవై వేలకు  పైగా వ్యయం అవుతోందన్నది వివరించలేకపోయారు. జగనేమో నిర్మాణాలలో ఏ కాంపొనెంట్‌కు ఎంత ఖర్చు చేస్తున్నది వివరిస్తూ  వివరంగా మాట్లాడారు.

చంద్రబాబు, లోకేశ్‌ తదితరులు వైసీపీని తరచు గొడ్డలి పార్టీ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనివల్ల తమకు ఏదో  పరపతి పెరుగుతుందని, వైసీపీని ప్రజల్లో విలన్ మాదిరి చేసి చూపించవచ్చని తాపత్రయపడుతున్నారు. అయితే నిత్యం ఈ అబద్ధపు ప్రచారమే చేస్తూండటం సంస్కారయుతంగా అనిపించదు. అందుకే జగన్ దానికి బదులు ఇస్తూ టీడీపీపైన, చంద్రబాబు  పైన వచ్చిన హత్యారాజకీయాల ఆరోపణల చిట్టాను చదివారు. వాటిలో  ఒక్కోదానికి జవాబివ్వకుండా జగన్ తాతగారు రాజారెడ్డి హత్య తర్వాత నిందితులు హత్యకు గురయ్యారని, ఇళ్లు  కూల్చారని ఏవేవో ఆరోపణలు చేశారు. వాటిలో నిజం ఉందా?

చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి హత్య జరిగింది. హత్య చేసింది టీడీపీ వారు కాదని ఎన్నడైనా చంద్రబాబు చెప్పగలిగారా? రాజారెడ్డి హత్య జరగడం చంద్రబాబు  ప్రభుత్వ వైఫల్యం అయితే ఎదురు  ఆరోపణలు చేయడం టీడీపీ ప్రత్యేకత. ఆ తర్వాత ఏమైనా అల్లర్లు జరిగి ఉంటే  వాటిని నియంత్రించలేకపోవడం చంద్రబాబు  ప్రభుత్వ అసమర్థతే అవుతుంది కదా? ఈ విషయాన్ని కప్పిపుచ్చి విమర్శలు చేస్తే ఏమి ప్రయోజనం? చంద్రబాబు గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన  పుస్తకం గురించి జగన్  ప్రస్తావించారు. అందులో చంద్రబాబువి ఎలాంటి హింసా రాజకీయాలో వెల్లడించారు.

దానికి ఇన్నేళ్లకు  కూడా చంద్రబాబు ఎందుకు  జవాబు ఇవ్వలేదన్నది ప్రశ్న. అలాగే  మాజీ ఎమ్మెల్యే, కాపు నేత వంగవీటి రంగా హత్యకు సంబంధించి మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన పుస్తకంలో చంద్రబాబు పాత్రపై రాసిన అంశంపై జగన్ నిలదీస్తే  దాని గురించి నోరెత్తరు. కూటమి ప్రభుత్వం వచ్చాక వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త హత్యతో పలు అంశాలను జగన్ లేవనెత్తారు. అలాగే  ప్రశ్నించే వారిపై, సోషల్ మీడియాపై కత్తికట్టి చంద్రబాబు సర్కార్ పెడుతున్న అక్రమ కేసులపై కూడా జగన్ గట్టిగా మాట్లాడారు.

వాటన్నిటికి టీడీపీ నుంచి వచ్చే జవాబు ఒకే మాట గొడ్డలి పార్టీ, వివేక హత్య కేసు, తల్లి, చెల్లి.. వివేక హత్య కేసులో జగన్ పై ఎలాంటి ఆరోపణలు లేవని సీబీఐ తేల్చినా వీరు మాత్రం తమ ఇష్టం వచ్చిన  ప్రచారం చేస్తుంటారు. ఆ హత్యలో పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి తరఫున టీడీపీ కేసులు ఎక్కువగా వాదించే సిద్ధార్థ లూధ్రా ఎలా న్యాయవాది అయ్యారన్న జగన్ ప్రశ్నకు సమాధానం ఇవ్వరు.

తమిళనాడులో విజయ్ గెలుపులో తన పాత్ర  ఏమి ఉంటుందని చాలా హుందాగా జగన్ జవాబు  ఇచ్చారు. విజయ్ ఒకచోట జగన్ ఫోటో పట్టుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. అమిత్ షాతో పవన్, నాదెండ్ల ల భేటీలో వచ్చిన అంశాలపై జగన్ వ్యూహాత్మకంగా జవాబిచ్చారు.అది జరిగిందా? లేదా? అన్నదాని జోలికి వెళ్లకుండా జగన్ గురించి జగన్  పాలన గురించి చంద్రబాబు గురించి, చంద్రబాబు పాలన గురించి, వ్యత్యాసం గురించి అమిత్ షాకు బాగానే తెలుసు అని వ్యాఖ్యానించి టీడీపీ, జనసేనలను డిఫెన్స్‌లో పడేసినట్లు అనిపించింది. జగన్  అప్పుడప్పుడో లేక నెలకోసారి ప్రెస్‌మీట్ పెట్టి వరసబెట్టి పలు అంశాలపై మాట్లాడి కూటమికి గుక్క తిప్పుకోనివ్వకుండా చేయగలుగుతున్నారన్నది మాత్రం నిజం.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement
 
Advertisement
Advertisement