
కర్ణాటక సీఎం మార్పు అంశంపై గత కొన్ని రోజులుగా జోరుగా చర్చ నడుస్తోంది. సీఎం సిద్ధరామయ్యను మార్చే అవకాశం ఉందని, ఆ స్థానంలో డీకే శివకుమార్‌కు అవకాశం కల్పించడానికి రంగం సిద్ధమైందంటూ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై సిద్ధరామయ్య కానీ, డీకే శివ కుమార్ కానీ ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు.
అయితే నిన్న (శనివారం, జూలై 19వ తేదీన) మైసూర్ జిల్లాలో జరిగిన పార్టీ ఈవెంట్‌లో ప్రభుత్వంలో నెలకొన్న అసంతృప్తిని సీఎం సిద్ధరామయ్య బహిరంగంగానే వెళ్లగక్కారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ పేరును పేర్కొనాలనే సూచనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను కీర్తించే క్రమంలో కొత్త ప్రాజెక్టులను ప్రకటించడంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘సాధన సమావేశం’లో సీఎం సిద్ధరామయ్య ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరయ్యారు,. అయితే అత్యవసరంగా ఆయన బెంగళూరు బయల్దేరాల్సి ఉండటంతో వేదిక పైనుంచి ఉన్నపళంగా వెళ్లిపోయారు.
అయితే సిద్ధరామయ్య ప్రసంగానికి సిద్ధమైన క్రమంలో పార్టీ ముఖ్యులను పరిచయం చేసే క్రమంలో డీకే పేరు ప్రస్తావించలేదు. అయితే డీకే, డీకే, డీకే అంటూ సభకు వచ్చిన జనం నుంచి స్పందన వచ్చింది. దీనిపై సిద్ధరామయ్యలో కోపం కట్టలు తెంచుకుంది.
అదే సమయంలో డీకే పేరును మరిచిపోయారనే ఉద్దేశంతో కాంగ్రెస్‌కు చెందిన ఒక న్యాయవాది.. ఆ విషయాన్ని ఆయనకు తెలియజేసే ప్రయత్నం చేశారు. దీంతో సిద్ధరామయ్యకు కోపం మరింత ఎక్కువవైంది. ‘ డీకే శివకుమార్ ఇక్కడ లేరు.. అవునా.. కాదా.. దయచేసి మీరు వెళ్లి కూర్చోండి. మీరు ఏ తరహా న్యాయవాది’ అంటూ కాస్త స్వరం పెంచి మరీ సిద్ధరామయ్య అనడంతో ఇది పార్టీలోని, ప్రభుత్వంలో అంతర్గత లుకలుకల్ని బయటపెట్టింది.