సాక్షి, నెల్లూరు: కూటమి సర్కార్ ఆర్బాటంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో ముమ్మాటికీ అక్రమాలు జరిగాయని, గతేడాది క్రీడాకారుల కోటాపై ఇచ్చిన జీవోలు, ఈ ఏడాది వాటిని ఉపసంహరించి, మళ్లీ కొత్త జీవోలు ఇవ్వడమే దీనికి నిదర్శనమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని తాము పదే పదే ప్రశ్నిస్తుంటే అధికారులు ఇచ్చిన ఖండనలోనూ తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకున్నారని కాకాణి ఆక్షేపించారు. అక్రమాలు జరగకపోతే డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించడానికి ఎందుకు భయపడుతున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన ఇంకేమన్నారంటే..
డీఎస్సీపై ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నాం
డీఎస్సీలో జరిగిన అక్రమాలపై మేం కేవలం ఆరోపణలు చేయట్లేదు, ఆధారాలతో సహ మీడియా ముందుకు వస్తున్నాం. మెగా డీఎస్సీలో అంతులేని అక్రమాలు జరిగాయి. ఓ పక్క టీచర్ ఉద్యోగాలపై నిరుద్యోగుల్ని ఊరించి, ఎన్నికలకు ముందు నుంచీ మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి, చివరికి 2025లో నోటిఫికేషన్ ఇచ్చారు. పరీక్ష నిర్వహణపై అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై మేం చేసిన ఆరోపణల మీద అధికారులు ఖండన కూడా ఇచ్చారు. అయితే ఈ ఖండనలో అంతా మీరు చెప్పినవి కరెక్ట్ కాదని చెప్పారు కానీ, తప్పు జరగలేదని పాయింట్ల వారీగా చెప్పలేకపోయారు. నిరుద్యోగులకు డీఎస్సీలో జరిగిన దగాపై వైఎస్ జగన్ పిలుపు మేరకు ఇప్పటికే ఆందోళనలు చేశాం.
జూన్ 1వ తేదీన యువత ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి కూడా చేయబోతున్నాం. మీరు అర్హులుగా ఎంపిక చేసిన అభ్యర్ధుల పేర్లు తుది జాబితాలో ఎందుకు గల్లంతయ్యాయో చెప్పగలరా ? మెరిట్ లిస్ట్ లేదు, సెలక్టెడ్ లిస్ట్ కూడా లేకుండా ఎంపికైన వారికి మెసేజ్ లు మాత్రమే పంపించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా ? ఒక పోస్టుకు ఒక్కరినే పిలిచి, అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు, తిరస్కరించలేదు. అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని హైకోర్టు చెప్పినా, ఆదేశాలు బేఖాతరు చేస్తూ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు.
డీఎస్సీ ఫలితాలు ప్రకటించేటప్పుడే రూల్ ఆఫ్ రిజిస్టర్ రోస్టర్ ప్రకారం అభ్యర్ధులకు ఎన్ని మార్కులు వచ్చాయో మెరిట్ లిస్ట్ విడుదల చేయాల్సి ఉంది. కానీ విడుదల చేశాక దాన్ని డిలీట్ చేయాల్సి అవసరం ఎందుకొచ్చింది ? ఎప్పుడూ లేని విధంగా డీఎస్సీని ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది ? సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చే సరికి మరో కొత్త విధానం అమలు చేశారు. తుది ఎంపిక జాబితాకు వచ్చేటప్పటికి వీటన్నింటినీ పక్కనబెట్టి మరో కొత్త విధానం తెచ్చి, మీ అజెండాను అమలు చేసి అర్హులైన నిరుద్యోగుల కడుపు కొట్టే ప్రయత్నం చేశారు.
నైతిక విలువల్లేని విద్యామంత్రి లోకేష్
ఎప్పుడైనా పరీక్ష రాసిన అభ్యర్ధులకు మెరిట్ లిస్ట్ పరిశీలించుకునే హక్కు ఉంది. మెరిట్ లిస్ట్ లో తాము ఎక్కడ ఉన్నాం, తమకన్నా ముందూ వెనుక ఎవరున్నారనే అంశాల్ని తెలుసుకునే అవకాశం అభ్యర్ధులకు ఇవ్వాలి. మెరిట్ లిస్ట్ తయారు చేశాక పారదర్శకంగా సెలెక్టెడ్ లిస్ట్ ప్రకటిస్తారు. అది చేయలేదు కాబట్టి అక్రమాలు జరిగాయని కచ్చితంగా నమ్ముతున్నాం. అందుకే ఈ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని పదే పదే కోరుతున్నాం.
చదువూ, సంధ్యా లేని మొద్దబ్బాయి లోకేష్ ను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా చేయడం ఈ సమాజానికి తీరని ద్రోహం చేయడమే. అందుకే ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై కేసులు పెడతానంటున్నారు తప్ప నా వల్ల పొరబాటు జరిగిందని, కాబట్టి తాను విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పడం లేదు. నైతిక విలువలు లేవు కాబట్టే లోకేష్ ఇలా వ్యవహరిస్తున్నారు. డీఎస్సీలో 16347 పోస్టుల్లో 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో నింపారు. అందులో మీరు నింపిన విధానం చూస్తే ఎంత భయంకరమైన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయో మేం వివరిస్తాం.
స్పోర్ట్ కోటా జీవోల్లో మార్పులతో అక్రమాలు
క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి 2 శాతం రిజర్వేషన్ ఎప్పటి నుంచో అమలు ఉంది. స్పోర్ట్స్ కోటాపై ఉమ్మడి ఏపీలోనే 2012 ఆగస్టు 9న జీవో ఎంఎస్ నంబర్ 74 విడుదల చేసారు. అప్పుడు ఉన్న జీవోలో క్రీడల్లో రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తెచ్చిన వారికి 29 క్రీడల్లో ఈ రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. దీని ప్రకారం పోటీ పరీక్ష రాసిన తర్వాత క్రీడాకారులకు క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. కానీ చంద్రబాబు తన పుట్టినరోజుకు ఒక్క రోజుకు ముందు ఏప్రిల్ 19న జీవో 47, జీవో 4 కూడా తెచ్చారు. 2025 ఏప్రిల్ 19న విడుదల చేసిన జీవో 4లో 2 శాతంగా ఉన్న క్రీడా రిజర్వేషన్లను 3 శాతానికి పెంచారు. కానీ క్రీడల సంఖ్యను 29 నుంచి 65కు పెంచారు.
గతంలో ఉన్న క్రీడల్లో స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు వీల్లేదు కాబట్టి దానికి మార్పులు చేశారు. అందుకే క్యారమ్స్, టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, యోగాసనాలు, బీచ్ వాలీవాల్ వంటి క్రీడల్ని చేర్చారు. జీవోడీ ఇచ్చిన మరో జీవో 47లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు పోటీ పడే వారు అసలు పోటీ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని చెప్పేశారు. అంటే క్రీడా ప్రతిభ ఉన్న వారితో పాటు ఉపాధ్యాయ అర్హత ఉన్న వారికీ ద్రోహం జరిగింది. ఈ నెల 26న తిరిగి పోటీ పరీక్ష రాసిన వారికే డీఎస్సీలో ప్రాధాన్యం ఇవ్వాలని మరో జీవో ఇచ్చారు. అంటే గతంలో అర్హులుగా ఉన్న వారికి అవకాశం లేకుండా చేయడానికి, మీకు అనుకూలంగా ఉన్న వారికి ఉద్యోగాలు ఇప్పించేందుకు ఇలాంటి జీవో ఇచ్చారు. అందుకే మళ్లీ జీవోలో మార్పులు చేశారు.
జీవో మార్పులతో అర్హులకు తీవ్ర అన్యాయం
జీఏడీ ద్వారా గతేడాది ఏప్రిల్ 19న ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ను సవరిస్తూ జీఏడీ ద్వారా రెండు జీవోలు ఇప్పించారు. ఇందులో గతంలో క్రీడాకారులు కూడా పోటీ పరీక్ష రాయాల్సి ఉండగా.. ఈ నిబంధనల్ని మార్చారు. దీంతో భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఈ నెలలో ఆ జీవోల్ని రద్దు చేశారు. గతేడాది ఇచ్చిన జీవోల్లో జాతీయ ఛాంపియన్ షిప్ సాధించిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది, ఆటలో పాల్గొంటున్న వారికి తర్వాత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. దాన్ని మార్చి తాజాగా ఇచ్చిన జీవోలో జాతీయ స్దాయిలో ఆడిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఛాంపియన్ షిప్ వస్తే తర్వాతి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.
ఇలా ఎందుకు మార్చారో సమాధానం చెప్పగలరా ? ముందుగా ఇచ్చిన జీవో కరెక్ట్ అనుకుంటే, ఆ తర్వాత ఎందుకు ఉపసంహరించారు ? ఈ రెండు పరిణామాల మధ్య నష్టపోయిన వారికి ఎవరు బాధ్య త వహిస్తారు ? డీఎస్సీలో పరీక్ష రాసిన అభ్యర్ధుల పరిస్ధితి ఏంటి ? వీటికి సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించిన వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. అందుకే సీబీఐ దర్యాప్తు జరగాలని కోరుతున్నాం. ఇది లోకేష్ శాఖలో జరిగిన డార్క్ సీక్రెట్ ఆపరేషన్ అంటున్నాం. మీరు ఎంత మందిని అరెస్టు చేసుకుంటారో చేసుకోండి, దగాపడిన నిరుద్యోగులతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, విద్యార్ధి, యువజన విభాగాలు సిద్దంగా ఉన్నాయి. కానీ దయచేసి ప్రతిభ ఉన్న వారికి మాత్రం అన్యాయం చేసి వారి ఉసురుపోసుకోకండి.
డీఎస్సీలో జిల్లా కమిటీల పాత్ర ఉంటే అక్రమాలు సాధ్యం కావు కాబట్టి వీటిని నిర్వీర్యం చేశారు. అందుకే రాష్ట్ర స్దాయిలోనే ఈ పరీక్ష నిర్వహించారు. టెట్, డీఎస్సీకి సంబంధించి ఒకే వ్యక్తికి బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రశ్నాపత్రం తయారు చేసిన వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్ అని మీరే ఒప్పుకుంటున్నారు. అతనే తిరిగి పరీక్ష రాసి కృష్ణాజిల్లాలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే అతని వివరాలు డిలీట్ చేశారు. అతను కోర్టుకు వెళ్తే బెదిరించి కేసు వెనక్కి తీసుకోమంటున్నారు. అందుకే డబ్బులు చేతులు మారాయని మీరు ఇచ్చిన జీవోల ద్వారానే అర్థమవుతోంది. మీరు అక్రమార్కులపై చర్యలు తీసుకునే పరిస్ధితుల్లో లేరు.
ఒకే కేటగిరీలో ముందు ఉన్న వాళ్లకు, తర్వాత ఉన్న వాళ్లకూ ర్యాంకులు వచ్చాయి, కానీ ఆమ్యామ్యాలు సమర్పించకపోవడం వల్ల మధ్యలో ఉన్న వారికి ర్యాంకులు రాలేదు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా ? టెస్ట్ మెసేజ్ ల పేరుతో ఉద్యోగాల జీవితాలతో ఆడుకున్నారు. మూడు పోస్టులకు అర్హత సాధిస్తే ఒకటే పోస్టుకు కాల్ లెటర్ ఇవ్వడం అన్యాయం కాదా ? ఈ మూడు పోస్టుల్లో హయ్యర్ గ్రేడ్ పోస్టు ఇవ్వాలని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని అడుగుతుంటే మా మీద క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మా మీద కాదు అక్రమాలతో యువత భవిష్యత్తును నాశనం చేసిన అధికారులపై ఈ కేసులు పెట్టండి. అలాగే ఎస్సీఈఆర్టీ నుంచే ప్రశ్నాపత్రాల లీక్ జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ ప్రశ్నాపత్రాలు అప్ లోడ్ చేసిన వ్యక్తి పరీక్ష ఎలా రాస్తాడు ? ఫస్ట్ ర్యాంక్ ఎలా తెచ్చుకుంటాడు, అతన్ని మీరు ఎందుకు తొలగించారో బయటపెట్టాలి. ఓపెన్ కేటగిరీలో రావాల్సిన పోస్టును వేరే వ్యక్తికి ఎలా ఇస్తారు ? అడిగితే వేరే వ్యక్తికి ఇచ్చామని చెప్పారని అధికారులు చెప్పినట్లు అభ్యర్ధులు కూడా బయటపెట్టారు. మీరు బేరసారాలు ఆడిన ఆడియోలు బయటికి వచ్చినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? దీని మీద ముఖ్యమంత్రి, విద్యామంత్రి సమాధానం చెప్పాల్సిందే. దీంతో పాటు అక్రమాలకు బాధ్యత వహించి విద్యామంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. దీంతో పాటు సీబీఐ దర్యాప్తు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాల్సిందేనని కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు.


