రాజాసింగ్‌ను బీజేపీ పూర్తిగా వదిలేసిందా?

Has BJP Completely Abandoned Raja Singh - Sakshi

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీజేపీ పూర్తిగా వదిలేసిందా? మహ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్‌ చేసింది. అదే సమయంలో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. మొదట బెయిల్‌ వచ్చినా, రెండోసారి మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కాని బీజేపీ నేతలు ఎవరూ స్పందించలేదు. ఎందుకని? 

హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివాదాస్పదంగా మారి భారతీయ జనతా పార్టీ వేటుకు గురయ్యారు. మరోవైపు మొదటిసారి జరిగిన పొరపాటును సరిచేసుకుని పీడీ యాక్ట్‌ పెట్టి మరీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బెయిల్‌ తీసుకుని ఇంట్లోనే ఉంటున్న రాజాసింగ్‌ను ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయనపై గతంలోనే ఉన్న రౌడీ షీట్‌ ఆధారంగా బెయిల్‌ రాకుండా పీడీ యాక్ట్‌ను ప్రయోగించారు. ఇంత జరుగుతున్నా బీజేపీ నాయకుల నుంచి పెద్దగా స్పందన కానరావడంలేదు. 

ప్రవక్త మీద వివాదాస్పద కామెంట్స్‌ చేసిన జాతీయ అధికార ప్రతినిధి నుపూర్‌ శర్మను కూడా పార్టీ సస్పెండ్ చేశారు కమలనాథులు. ఇప్పుడు మునావర్ కామెడీ షో తో రాజాసింగ్‌ వ్యవహారం కూడా వివాదాస్పదమైంది. దీంతో అన్ని వైపుల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారు రాజాసింగ్‌ను పార్టీ సస్పెండ్ చేసింది. సాధారణంగా ఏవైనా ఆందోళనలు చేసినపుడు అరెస్టులు జరిగితే పార్టీ నేతలు వెంటనే రంగ ప్రవేశం చేసి ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తారు. అయితే రాజాసింగ్‌ విషయంలో మాత్రం బీజేపీ ఆయన్ను పూర్తిగా వదిలించుకున్నట్లుగా కనిపిస్తోంది. తొలినుంచీ పార్టీ నాయకులతో విభేదిస్తూ.. పార్టీ విధానాలకు భిన్నంగా నడుచుకునే రాజాసింగ్‌ అంటే పలువురు నేతలు కోపంగానే ఉంటారనేది అందరికీ తెలిసిందే.

రాజాసింగ్‌ వ్యవహారంతో పార్టీకి నష్టం జరుగుతుందన్న ఆలోచనతోనే ఆయన్ను సస్పెండ్ చేశారు. ఢిల్లీ పెద్దలు ఎమ్మెల్యే మీద ఆగ్రహంతో ఉన్నపుడు మనకెందుకులే అనుకున్న రాష్ట్ర నాయకులు కూడా రాజాసింగ్‌ను లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన్ను దూరంగా ఉంచితేనే ప్రస్తుతానికి పార్టీకి మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. కాని తనకు పార్టీ కంటే ధర్మమే ముఖ్యమంటున్నారాయన. పార్టీ అధిష్టానానికి తాను సంపూర్ణంగా వివరిస్తూ త్వరలో లేఖ రాస్తానని చెప్పుకుంటున్నారు రాజాసింగ్‌.

కాగా,  బీజేపీ క్రమశిక్షణ కమిటీకి రాజాసింగ్‌ భార్య మెయిల్‌ చేశారు.  రేపటితో(సెప్టెంబర్‌2) రాజాసింగ్‌కు పార్టీ ఇచ్చిన గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌ భార్య..  బీజేపీ క్రమశిక్షణ కమిటీకి మెయిల్‌ చేశారు. రాజాసింగ్‌ జైలు ఉండటంతో మరికొంత సమయం ఇవ్వాలని మెయిల్‌లో పార్టీ క్రమశిక్షణా కమిటీని కోరినట్లు తెలుస్తోంది.  రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సస్పెండ్‌ చేసిన బీజేపీ.. ఎందుకు సస్పెండ్‌ చేయకూడదో 10 రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top