ప్రజలకు రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పాలి | Harish Rao Sensational Comments on Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ప్రజలకు రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పాలి

May 10 2024 5:18 AM | Updated on May 10 2024 5:18 AM

Harish Rao Sensational Comments on Rahul Gandhi

ఆరు గ్యారంటీలను మరిచిన కాంగ్రెస్‌

జహీరాబాద్‌ రోడ్‌షోలో మాజీ మంత్రి హరీశ్‌రావు

జహీరాబాద్‌ (సంగారెడ్డి)/సిద్దిపేటజోన్‌: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నేత రాహూల్‌గాంధీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హామీల అమలులో విఫలమైనందుకు రాష్ట్ర ప్రజలకు రాహుల్‌ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారానికి ఏం ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వచ్చారని హరీశ్‌రావు ప్రశ్నించారు. అక్కా చెల్లెళ్లకు రాహూల్‌గాంధీ రూ.8,500 ఇస్తానంటున్నారని, మళ్లీ ఎవరి చెవులో పువ్వు పెడతారని నిలదీశారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో గురువారం బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కు మద్దతుగా రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..కరెంటు కోతలు పెడుతున్న కాంగ్రెస్‌కు పార్లమెంట్‌ ఎన్నికల్లో వాతలు పెట్టాలన్నారు. ఆరు గ్యారంటీ పథకాలు వచ్చిన వారు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, రాని వారంతా బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్లమెంట్‌ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్, ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎం.శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వై.నరోత్తం, బేవరేజస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవిప్రసాద్, బీఆర్‌ఎస్‌ నాయకులు కిజర్‌యాఫై పాల్గొన్నారు.

బీజేపీతో కొట్లాడినందుకే కవితకు జైలు
బీజేపీతో కొట్లాడేది ఒక్క కేసీఆర్, బీఆర్‌ఎస్‌ పార్టీయేనని ఆ పోరాటం ఫలితంగానే ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లాల్సి వచ్చిందని హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన ముస్లిం, మైనార్టీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒక్కటేనని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీతో బీఆర్‌ఎస్‌ కలిసి ఉంటే కవిత అరెస్ట్‌ అయ్యేవారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీతో జత కట్టారని, చాలాసార్లు బహిరంగంగానే ప్రధానిని పొగిడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి, బీజేపీ మిలాఖత్‌ అయి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement