సాక్షి, విశాఖపట్నం: తాము చేయని పనుల్ని కూడా చేశామంటూ అబద్ధాల ప్రచారాలు చేసుకోవడం కూటమి సర్కార్‌కు అలవాటుగా మారిపోయిందని.. నిన్న అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేసిన ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంటే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ నేత, పరిశ్రమలశాఖ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. గతంలో ఆర్సెలార్ మిట్టల్ వంటి పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకు రావడానికి వైఎస్ జగన్ కృషి చేస్తే.. పరిశ్రమల్ని తరిమేస్తున్నారంటూ దుష్ప్రచారాలు చేసిన కూటమి పార్టీలు.. ఇప్పుడు 24 నెలల్లో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలపై శ్వేతపత్రం ప్రకటించగలరా? అంటూ గుడివాడ అమర్‌నాథ్ సవాల్ విసిరారు. ప్రెస్‌మీట్‌లో ఆయన ఇంకా ఏమన్నారంటే..:
కూటమి ప్రభుత్వం మరో క్రెడిట్ చోరీ:
మనం సాధించలేని ఘనత గురించి మనమే సాధించినట్లు చెప్పుకోవచ్చనే దానికి నిన్న అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ శంఖుస్ధాపనే ఉదాహరణ. చంద్రబాబు, లోకేష్, మంత్రులు పరస్పరం భజన చేసుకున్నారు. ఆర్సెలార్ మిట్టల్ ఈ రాష్ట్రానికి రావడానికి పునాదులు వేసింది 2022లో నాటి సీఎం శ్రీ వైయస్ జగన్ అనేది ఒకసారి వీళ్లంతా గుర్తుచేసుకోవాలి. విశాఖలో ఆర్సెలార్ మిట్టల్ టేకోవర్ చేసుకున్న ఎస్‌ఆర్ ప్లాంట్ విస్తరణ కోసం దావోస్‌లో జగన్‌గారితో లక్ష్మీ మిట్టల్ కుమారుడు ఆదిత్యమిట్టల్ ఒప్పందం చేసుకున్నారు.
దీంతో పాటు కర్నూలులో గ్రీన్ కో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకూ అదే సమయంలో ఒప్పందం జరిగింది. ఆ విద్యుత్ ప్రాజెక్టులో ఆర్సెలార్ భాగస్వామి అయింది. ఈ పెట్టుబడులతో పాటు కొత్త స్టీల్ ప్లాంట్ ఏపీలో ఏర్పాటు చేయాలని జగన్‌గారు కోరడంతో మిట్టల్ సముద్ర తీరం వెంట భూములు కేటాయిస్తే తప్పకుండా ప్లాంట్ పెడతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎస్, నేను కూడా ఉన్నాం. మిట్టల్ సంస్థకు భూమి కేటాయించాలని జగన్ చెబితే.. మేం కాకినాడ, మూలపేట పోర్టు, నక్కపల్లి రూపంలో మూడు ఆప్షన్లు వారికి ఇచ్చాం. ఇందులో కంపెనీ ప్రతినిధులు 2024 ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల మధ్య నక్కపల్లిలో భూమి తమకు అనువుగా ఉంటుందని ఎంచుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారినా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. దీన్ని మేం స్వాగతిస్తున్నాం.
నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ సంగతేంటో చెప్పండి?:
అదే సమయంలో నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని మేం నిర్ణయం తీసుకున్నాం. దీనికి దేశంలోని అన్ని రాష్ట్రాలు పోటీ పడినా.. హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, ఏపీకి మాత్రమే ఈ అవకాశం దక్కింది. దాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం విస్మరిస్తోంది. వారు భూములు కావాలంటే అందుబాటులో ఉన్న భూములు ఇవ్వొచ్చు. కానీ, అలా కాకుండా భూసేకరణ అంటూ వివాదాలు సృష్టించారు. దానివల్లే బల్క్‌డ్రగ్ ముందుకు సాగలేదు.
ఇంకా బల్డ్ డ్రగ్ పార్క్ వల్ల జబ్బులు వస్తాయని కూటమి పార్టీల నాయకులు ఎన్నికల సమయంలో చేసిన దుష్ప్రచారం వల్ల కూడా అది ముందుకు సాగడం లేదు. కేంద్రం, రాష్ట్రాలతో పోరాడి తెచ్చిన ఈ బల్క్ డ్రగ్ పార్క్ రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ముందుకెళ్లకపోవడానికి కూటమి పార్టీలే కారణం. ఇప్పుడు ఆర్సెలార్ మిట్టల్ స్లీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ దీనికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అన్న విషయం గుర్తుంచుకోవాలి.
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఎందుకు శ్రద్ధ లేదు?:
అధికారంలోకి రావడానికి మీరు ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు. ఉపాధి కల్పించలేకపోతే నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి ఇప్పటి వరకు వచ్చిన కంపెనీలు ఎన్ని? అవి కల్పించిన ఉద్యోగాలు ఎన్ని? అన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయండి. మీ పచ్చ మీడియాలో 20 లక్షల కోట్ల పెట్టుబడులంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు.
ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మీరు అధికారంలోకి వచ్చాక 20 నెలల్లోనే 10 వేల మంది ఉపాధి పోయింది. దీనికి సమాధానం చెప్పండి. ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మీకు ఎందుకు శ్రద్ధ లేదు? స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌లు, కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపులు ఎందుకు చేస్తున్నారు? ఎన్నికలకు ముందు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలని చెప్పి, ఇప్పుడు మాత్రం వచ్చే ఐదేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. అప్పటివరకూ మీరు అధికారంలో ఉండాలి కదా..
రాష్ట్రం వదిలి పారిపోతున్న పరిశ్రమలు:
గతంలో రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్లిపోయాయని, అవి ఇప్పుడు తిరిగి వస్తాయని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. అచ్యుతాపురంలో కోకా కోలా కంపెనీ ఈ రాష్ట్రానికి, ప్రజా ప్రతినిధులకు ఓ దండం అని చెప్పి భూమి వెనక్కి ఇచ్చి వెళ్లిపోయింది. ఇలా ఈ 20 నెలల్లో రూ.5,600 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. దీనికి కారణం ఈ ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు పెడుతున్న ఇబ్బందులే. అల్ట్రాటెక్, ఎల్ అండ్ టీ, భారతీ సిమెంట్స్.. ఇలా రాయలసీమలో ఏ సిమెంట్ ఫ్యాక్టరీతో సక్రమంగా పని చేయించుకునే పరిస్ధితి లేదు.

పక్కనే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో యూబీ బీర్ ఫ్యాక్టరీని స్కిట్లు వేసుకునే ఎమ్మెల్యే తనకు కప్పం కడితే తప్ప పని చేయకుండా అడ్డుకుంటున్నారు. జిందాల్ సంస్ధ కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని వస్తే, ఊరూపేరు లేని ఓ సినీ నటిని తీసుకుని వాళ్లను వెళ్లగొట్టారు. మీ పాలనలో మీ భూములు వద్దని వెనక్కి వెళ్లిపోయిన కంపెనీల లిస్ట్ నేను బయటపెడతా, దానిపై సమాధానం చెప్పండి. జగన్‌గారి హయాంలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తే, అది వదిలేసి పారిపోయిన కంపెనీల గురించి చెప్తున్నారు. ఇప్పుడు మీ హయాంలో పారిపోయిన కంపెనీల సంగతేంటో చెప్పండి.
పరిశ్రమలు తెచ్చిన జగన్‌పై దుష్ప్రచారాలు:
విశాఖలో రహేజాతో కలిసి ఇనార్బిట్ మాల్‌కు నాడు జగన్ శంకుస్థాపన చేశారు. దాన్నే నిన్న (సోమవారం) ప్రారంభించారు. అదీ మా కమిట్‌మెంట్. విశాఖకు ఇనార్పిట్ మాల్ ఓ ల్యాండ్ మార్క్. విశాఖలో ఎన్నో పరిశ్రమలు ఉన్నా ఇనార్పిట్ మాల్ ప్రత్యేకత వేరు. దానికి శంకుస్థాపన చేసింది జగన్. ఈ ప్రభుత్వం తరుచూ మా చిన్నప్పటి నుంచి వింటున్న లులూ మాల్‌ను ప్రస్తావిస్తుంది. ఈ లులూ మాల్ ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిపోయిందో ఎవరికీ తెలియదు. మేం చేసిన పనులు చెప్పుకోవడం లేదు అంటే, అదే వారికీ మాకూ తేడా. అందుకే ఇప్పటికైనా నిరుద్యోగ యువతపై ఫోకస్ పెట్టి వారికి ఉద్యోగాలు కల్పించడం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వడమో చేయాలని ప్రభుత్వాన్ని గుడివాడ అమర్‌నాథ్ డిమాండ్ చేశారు.


