టీ ఎక్కడ? టిఫిన్ లేకపోతే ఎలా? | 2026 Election Campaigns In Five States Hit By Gas Shortage Due To Iran Conflict, More Details Inside | Sakshi
Sakshi News home page

టీ ఎక్కడ? టిఫిన్ లేకపోతే ఎలా?

Mar 24 2026 3:12 PM | Updated on Mar 24 2026 3:47 PM

Where’s the Tea What About Tiffin Five state elections 2026
  • యుద్ధం వల్ల గ్యాస్ సంక్షోభం
  •  కార్యకర్తలకు టీ ఇవ్వలేకపోతున్నారు

ఎన్నికలంటేనే కొందరికి ఎక్కడాలేని ఉత్సాహం పుట్టుకొస్తుంది. ఏదో ఒక పార్టీని ఎంచుకుని, ప్రచారపర్వంలో వెన్నంటి ఉంటూ.. జై కొడితే చాలు.. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సమయానికి చాయ్, స్నాక్స్, రాత్రవ్వగానే బీరు, బిర్యానీకి ఢోకా ఉండదు. కానీ, ఇప్పుడు భారత్‌లో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారపర్వం పేలవంగా సాగుతోందని చెప్పవచ్చు. అందుకు కారణం.. ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత నెలకొనడం.. చమురు సరఫరా తగ్గడమే..! దానికీ.. ఎన్నికల ప్రచారానికి సంబంధమేంటని ఆశ్చర్యపోతున్నారా?

ఇరాన్ యుద్ధం కారణంగా ఈ సారి ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం భిన్నంగా సాగుతోంది. కొన్ని చోట్ల నామినేషన్ల ఘట్టం ముగిసింది. అయినా.. ప్రచారం హడావుడి కనిపించడం లేదు. అక్కడక్కడా ప్రచారాలు జరుగుతున్నా.. అభ్యర్థులు తమ మద్దతుదారులకు టిఫిన్ పెట్టించడం మాట పక్కనపెడితే.. టీ తాగించే అవకాశం లేకుండా పోతోంది. గ్యాస్ కొరత కారణంగా చిన్నాచితకా హోటళ్లు దాదాపుగా మూతపడ్డాయి. ఛాయ్ కోసం నిరంతరం స్టౌని వెలిగించాల్సి ఉంటుంది. లేదంటే.. ఫ్లాస్క్‌లను వాడాలి. దీంతో.. రోడ్డుపక్కన హోటళ్లు చాలా వరకు పనిచేయడం లేదు. ఒక్కో అభ్యర్థి వెంట కనీసం 200 మంది కార్యకర్తలు, మద్దతుదారులు ఉంటారు. బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్‌లలో ఈ సంఖ్య భారీగా ఉంటుంది. గ్యాస్ సంక్షోభం కారణంగా ఇప్పుడు వీరికి టీ ఇవ్వలేకపోతున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు.

బ్లాకులో గ్యాస్‌ను కొనే స్తోమతలేదు
టీ మాటను అటుంచితే.. మధ్యాహ్న భోజనం, బిర్యానీల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చిన్నాచితకా హోటళ్లు, బడ్జెట్ టిఫిన్ సెంటర్లు బ్లాకులో గ్యాస్‌ను కొనే స్తోమతలేక.. పరిమితంగా ఆహారపదార్థాలను తయారు చేస్తున్నాయి. బడా హోటళ్లలో ధరాఘాతం తప్పదు. పైగా.. కొన్ని హోటళ్లు ఏకంగా గ్యాస్ సెస్‌ని విధిస్తున్నాయి. తమిళనాడులో ఈ నయా సంస్కృతి తీవ్రంగా ఉంది. దీంతో.. కొందరు అభ్యర్థులు వంట మనుషులను నియమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆహార పదార్థాల ముడిసరుకును అందజేస్తే.. వీరు వంటచెరుకుతో భోజనాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

మెనూలోంచి  దోశ, బోండా ఔట్
మరికొన్ని చోట్ల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నాలుగైదు వందల మంది కార్యకర్తలు అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నా.. వారికి భోజనం కాదు కదా.. కనీసం టీ దొరకడం లేదు. ఎక్కువ మంట అవసరం ఉండే పరోటాలు, దోశలు, బోండాలు అస్సలు లభించడం లేదు. కేరళలోని కోళికోడ్‌ పరిధిలో ఉన్న మావూర్ రోడ్‌లోని ఇండియన్ కాఫీ హౌస్ ఏకంగా తన మెనూలోంచి వీటిని తీసివేయడం గమనార్హం..! ఇక తమిళనాడులోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అక్కడ పరోటా, నాన్ వెజ్ కర్రీ దొరుకుతున్నా.. ధరలను విపరీతంగా పెంచారు. ఈస్టర్ సమీపిస్తుండడంతో.. బ్రాయిలర్ కోళ్లు, గుడ్ల ధరలకు కూడా రెక్కలు వస్తున్నాయని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. గ్యాస్ సంక్షోభం కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేస్తామని కేరళ, తమిళనాడు హోటల్స్ అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించింది. ఇరాన్ యుద్ధం మరో రెండుమూడు వారాలు కొనసాగితే.. పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయని ఆయా పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.   - వెబ్‌డెస్క్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement