విశాఖపట్నం: నగర శివారు గ్రామాల్లో వంట గ్యాస్ కోసం సామాన్యుడి పాట్లు వర్ణనాతీతంగా మారాయి. గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రం కావడంతో వినియోగదారులు రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. సోమవారం ఉదయం విశాఖ నుంచి భీమిలి వెళ్లే ప్రధాన రహదారిపై ఖాళీ సిలిండర్లు బారులు తీరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

వంట గదిలో పనులన్నీ పక్కన పెట్టి, గృహిణులు, కూలీలు గ్యాస్ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక గంటల తరబడి రహదారిపైనే నిరీక్షిస్తున్నారు. చేతిలో పని వదిలేసి, పొయ్యి వెలిగించుకోవడానికి సిలిండర్లు పట్టుకుని రోడ్ల వెంట పరుగులు తీయాల్సిన దుస్థితి ఏర్పడింది. శివారు ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం కావడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారులు తక్షణమే స్పందించి గ్యాస్ కొరతను తీర్చాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.



