హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్ర

GHMC Elections 2020: KCR Says Law And Order Our Utmost Priority - Sakshi

ఎక్కడో మత ఘర్షణలు రాజేసి హైదరాబాద్‌లో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు..

గ్రేటర్‌ ఎన్నికల వాయిదాకు పక్కా ప్రణాళిక రచించారు

అరాచక శక్తుల ప్రయత్నాలపై కచ్చితమైన సమాచారం ఉంది

సంఘ విద్రోహశక్తులను ఉక్కుపాదంతో అణచివేయండి

శాంతిభద్రతలపై సమీక్షలో పోలీసులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్‌ నగరంలో, రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని, వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోలీసు అధికారులను ఆదేశించారు. అరాచక శక్తుల కుట్రలకు సంబంధించి ప్రభుత్వానికి కచ్చితమైన సమాచారం ఉందని సీఎం అన్నారు. హైదరాబాద్‌ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటమే అత్యంత ప్రధానమని, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని, సంఘ విద్రోహశక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పారు.

ఈ విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిస్తుందని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు అంజనీకుమార్, వీసీ సజ్జనార్, మహేశ్‌ భగవత్, అడిషనల్‌ డీజీపీ జితేందర్, ఐజీలు స్టీఫెన్‌ రవీంద్ర, వై.నాగిరెడ్డి, నిజామాబాద్, వరంగల్‌ ఐజీలు శివశంకర్‌రెడ్డి, ప్రమోద్‌కుమార్‌ పాల్గొన్నారు.

మాకు పక్కా సమాచారం ఉంది..
‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా రాజకీయ లబ్ధి పొందడానికి కొందరు అనేక కుట్రలు చేస్తున్నారు. మొదట సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేశారు. మార్ఫింగ్‌ ఫొటోలతో ప్రజలను ఏమార్చాలని చూశారు. తర్వాత మాటలతో కవ్వింపులకు దిగుతున్నారు. సహజంగానే శాంతి కాముకులైన హైదరాబాద్‌ ప్రజలు ఈ అబద్ధపు ప్రచారాన్ని పట్టించుకోలేదు. డబ్బులు పంచి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నాలూ హైదరాబాద్‌లో నడవవని అరాచకశక్తులకు తెలిసింది. దీంతో మరింత దిగజారి రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు.

రాష్ట్రంలోని ఏ కరీంనగర్‌లోనో, వరంగల్‌లోనో, ఖమ్మంలోనో, మరోచోటనో గొడవలు రాజేసి, దాన్ని హైదరాబాద్‌లో విస్తృత ప్రచారం చేయాలని చూస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా ఏదోచోట గొడవ పెట్టుకోవాలని, దానికి మతం రంగు పూయాలని, ప్రార్థన మందిరాల దగ్గర ఏదో ఒక వికృతచేష్ట చేయాలని చూస్తున్నారు. అలాచేసి ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. పెద్దఎత్తున గొడవలతో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి అసలు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా చేయాలని, ఎన్నికలు వాయిదా వేయించాలని పక్కా ప్రణాళిక రచించారు. దీనికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది’అని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ ఉపేక్షించొద్దు..
‘హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రంలో శాంతి సామరస్యాలు యథావిధిగా కొనసాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లో సంఘ విద్రోహ శక్తుల ఆటలు సాగనీయవద్దు. ఎంతో పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. కడుపు, నోరు కట్టుకుని నిబద్ధతతో పనిచేసి రాష్ట్రాన్ని ఓ దరికి తెచ్చాం. శాంతిభద్రతల పరిరిక్షణలో రాజీలేకుండా వ్యవహరిస్తున్నాం. పేకాట క్లబ్బులు, గుడుంబాలాంటి మహమ్మారులను దూరం చేశాం. సంఘ విద్రోహశక్తులు, మాఫియా, విచ్చిన్నకర శక్తులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిందో ప్రజలు చూశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభించింది. శాంతిభద్రతల పరిరక్షణ, సంఘ విద్రోహశక్తుల అణచివేతలో ప్రభుత్వం మొదటి నుంచి రాజీలేని ధోరణి అవలంభిస్తున్నది.

కాబట్టే నేడు హైదరాబాద్‌ నగరం, రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నాయి. ప్రజలు సుఖంగా ఉన్నారు. ఎవరి పని వారు ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌ నగరానికి సేఫ్‌ సిటీ అనే మంచి పేరొచ్చింది. భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. యువకులకు ఉపాధి దొరుకుతున్నది. హైదరాబాద్‌ మహా నగరంలో మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు కోటీ 60 లక్షల జనాభా ఉంది. ఈ నగరాన్ని కాపాడుకోవడం ప్రభుత్వానికున్న ప్రధాన బాధ్యత. ప్రభుత్వానికి ఈ రాష్ట్రం బాగుండటం, హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉండటం, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించటం ముఖ్యం. తెలంగాణకు గుండెకాయలాంటి ప్రశాంత హైదరాబాద్‌ నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, మత ఘర్షణలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌ నగర ప్రశాంతతను ఫణంగా పెట్టి ఎవరినో క్షమించాల్సిన అవసరం లేదు. ఘర్షణలు సృష్టించే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలి. ఎంతటి వారినైనా సరే, వారు అధికార పార్టీ సభ్యులైనా సరే వదలొద్దు. ఎక్కడికక్కడ సమాచారం సేకరించి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి కుట్రలను భగ్నం చేయాలి’అని సీఎం పోలీసులకు స్పష్టం చేశారు.

ప్రజలూ అప్రమత్తంగా ఉండాలి..
ప్రశాంత హైదరాబాద్‌లో మతచిచ్చు పెట్టడానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించే శక్తులపై అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉద్వేగాలు, ఉద్రేకాలు రెచ్చగొట్టే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవద్దని యువకులను కోరారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా పోరాడాలని రాజకీయ పార్టీలను కోరారు. పోలీస్‌ యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉందని, ఎట్టి పరిస్థితుల్లో అరాచక, సంఘ విద్రోహశక్తుల కుట్రలు భగ్నం చేసి తీరుతామని పోలీసు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హామీనిచ్చారు. హైదరాబాద్‌లోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటారని, ఎక్కడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటనా జరగకుండా చూస్తామని తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top