East Godavari: ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు

Dominant Struggle Between TDP Leaders In East Godavari - Sakshi

బాబు రాజీ‘డ్రామా’తో ఇటీవలే అలకపాన్పు దిగిన బుచ్చయ్య

ఇంతలోనే కాకినాడ రూరల్‌పై సిగపట్లు

ఇన్‌చార్జ్‌ సత్తిబాబుపై చంద్రబాబుకు వైరివర్గం ఫిర్యాదు

పాతిక పేజీలతో ఫిర్యాదుల చిట్టా

తెరవెనుక రాజప్ప ఉన్నారని సత్తిబాబు వర్గం ఆరోపణ 

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ప్రజా వ్యతిరేకతతో ప్రతిపక్షానికే పరిమితమైన తెలుగుదేశం పార్టీ జిల్లాలో పిల్లిమొగ్గలు వేస్తోంది. అధికారం కోల్పోయినా ఆధిపత్య పోరులో మాత్రం తెలుగు తమ్ముళ్లు ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఇటీవలే టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారం రోజుల పాటు అలకపాన్పు ఎక్కినట్టే ఎక్కి ఒక్కసారే కిందకు దిగిపోయారు.

అధినేత చంద్రబాబు నుంచి అవమానాలు, సీనియర్‌ అయిన తనను పట్టించుకోకపోవడం, అనుచరులకు పదవులు ఇవ్వకపోవడం, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గం రాజమహేంద్రవరం సిటీలో జోక్యం చేసుకోనివ్వడం లేదనే కారణాలతో ఎమ్మెల్యేతో పాటు, పార్టీ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నట్టు లీకుల మీద లీకులు ఇచ్చారు. చివరకు ఎప్పటి మాదిరిగానే చంద్రబాబు రాజీ‘డ్రామా’తో వెనక్కు తగ్గారు. బుచ్చయ్య కోరికలు ఏ మేరకు నెరవేరాయో ఆయనకు, పార్టీ పెద్దలకే తెలియాలి. రాజమహేంద్రవరం రూరల్‌లో పరిస్థితి సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో కాకినాడ రూరల్‌లో తిరిగి మొదలైన ఆధిపత్య పోరు ఆ పార్టీకి తలనొప్పిగా మారింది.

చాలాకాలంగానే వివాదం 
వాస్తవానికి కాకినాడ రూరల్‌ టీడీపీలో వివాదం ఈనాటిది కానే కాదు. రూరల్‌ ఇన్‌చార్జి పిల్లి అనంతలక్ష్మి, వీర వెంకట సత్యనారాయణ(సత్తిబాబు)ను మార్చాలనే డిమాండ్‌ చాలా కాలంగానే ఉంది. గత సార్వత్రిక ఎన్నికల తరువాత మొక్కుబడిగా ఉంటున్న ఇన్‌చార్జిని మార్చేయాలని వైరిపక్షం ఏడాది క్రితం గట్టి పట్టే పట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సానుభూతిపరులు పోటీ చేస్తానన్నా గాలికొదిలేశారని పలువురు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే ఇదంతా మొదటి నుంచీ తనను వ్యతిరేకించే పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆడిస్తున్న ఆట అంటూ సత్తిబాబు, ఆయన వర్గీయులు విమర్శలకు దిగారు.

వచ్చే ఎన్నికల్లో కాకినాడ రూరల్‌ నుంచి రాజప్ప బరిలోకి దిగే ఎత్తుగడతోనే తనపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని సత్తిబాబు వర్గం ఆరోపించింది. ఈ క్రమంలోనే రూరల్‌ బాధ్యతలకు రాజీనామా చేసి సామాన్య కార్యకర్తగా కొనసాగుతానంటూ సత్తిబాబు దంపతులు అప్పట్లో ప్రకటించారు. వారిని సత్తిబాబుకు రాజకీయ గురువైన మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ బుజ్జగించారు. కొంత కాలం కొనసాగేలా ఒప్పించి ఆ వివాదానికి అప్పట్లో తెర దించారు.

టీడీపీ కాకినాడ రూరల్‌ ఇన్‌చార్జిని మార్చాలంటూ ఇటీవల చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తున్న
మాజీ జెడ్పీటీసీ కాకరపల్లి సత్యవతి, చలపతి, విత్తనాల గోపాల్‌ తదితరులు   

సత్తిబాబుపై చంద్రబాబుకు ద్వితీయ శ్రేణి నేతల ఫిర్యాదు
కాకినాడ రూరల్‌ టీడీపీ ఇన్‌చార్జిగా సత్తిబాబును తప్పించాలనే డిమాండ్‌ ఇటీవల తిరిగి తెర పైకి వచ్చింది. ఇది యాధృచ్ఛికం కాదని, భాస్కర రామారావు మృతి, రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా కొత్తపేటకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం నియామకం వంటి పరిణామాల నేపథ్యంలో సత్తిబాబును తప్పించాలనే డిమాండ్‌ను ఆయన వైరిపక్షం భుజాన వేసుకున్నట్టు కనిపిస్తోంది. చినరాజప్ప వంటి వారు బయట పడకుండా సత్తిబాబు సొంత సామాజికవర్గ నేతలను ఇందుకు ఉసిగొల్పుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంత కాలం ఇన్‌చార్జి విషయంలో పెదవి విప్పని ద్వితీయ శ్రేణి నేతలు ఎకాఎకిన పార్టీ అధినేత చంద్రబాబునే కలవడం ఇందుకు బలం చేకూరుస్తోంది.

సత్తిబాబును మార్చేసి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే డిమాండుతో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు కాకరపల్లి సత్యవతి, ఆమె భర్త చలపతి, నాయకులు సీతయ్యదొర, విత్తనాల గోపాల్‌ తదితర పాతిక మంది ఇటీవల చంద్రబాబును కలిశారు. సత్తిబాబును ఇన్‌చార్జిగా కొనసాగిస్తే నియోజకవర్గంలో కొద్దోగొప్పో ఉన్న ఓటు బ్యాంక్‌ కూడా అడ్రస్‌ లేకుండా పోతుందంటూ ఫిర్యాదు చేశారని అంటున్నారు.

పాతిక పేజీలతో కూడిన ఫిర్యాదుల చిట్టాను చంద్రబాబుకు అందజేయడం వెనుక ఆ వర్గం ప్రమేయం ఉందని చెబుతున్నారు. భాస్కర రామారావు వంటి బలమైన నాయకుడు లేరనే ధైర్యంతోనే తమపై బురద చల్లి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని సత్తిబాబు వర్గం పేర్కొంటోంది. రూరల్‌ నియోజకవర్గ టీడీపీలో బలమైన బీసీ సామాజికవర్గం ఆధిపత్యం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే రాజప్ప వర్గం ఈ తరహా కుట్రలకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది. ఈ వివాదం ఏ తీరానికి చేరుతుందోనని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.

ఇవీ చదవండి:
Andhra Pradesh: పోలవరం.. శరవేగం   
మూడు రాష్ట్రాలకు మణిహారం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top