మూడు రాష్ట్రాలకు మణిహారం

All Set For Visakhapatnam-Raipur Economic Corridor construction - Sakshi

రాయ్‌పూర్‌– విశాఖ ఎకనామిక్‌కారిడార్‌కు మార్గం సుగమం

పర్యావరణ అనుమతులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: మూడు రాష్ట్రాల్లో ఆర్థికాభివృద్ధికి మణిహారం లాంటి విశాఖపట్నం–రాయ్‌పూర్‌ ఎకనామిక్‌ కారిడార్‌ నిర్మాణానికి మార్గం సుగమమైంది. తూర్పు తీరం నుంచి అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర స్థాయి కార్గో రవాణాకు విశాఖ ప్రధాన కేంద్రం కానుంది. విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌ను అనుసంధానిస్తూ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణాన్ని చేపట్టనున్నారు. భారత్‌మాల ప్రాజెక్టు మొదటి దశ కింద మొత్తం 464 కి.మీ. మేర ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) సన్నాహాలు వేగవంతం చేసింది. 

రాష్ట్రంలో రూ.3,200 కోట్లతో 100 కి.మీ.
కార్గో రవాణాకు కీలకమైన రాయ్‌పూర్‌ – విశాఖపట్నం ఎకనామిక్‌ కారిడార్‌కు ఎన్‌హెచ్‌ఏఐ ప్రణాళిక రూపొందించింది. దాదాపు రూ.20 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును ఆమోదించింది. రాయ్‌పూర్‌ నుంచి ఒడిశా మీదుగా విశాఖలోని సబ్బవరం వరకు 464 కి.మీ. మేర గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను నిర్మిస్తారు.  ఛత్తీస్‌గఢ్‌లో 124 కి.మీ, ఒడిశాలో 240 కి.మీ, ఆంధ్రప్రదేశ్‌లో 100 కి.మీ. మేర నిర్మాణం చేపడతారు. అత్యంత కీలకమైన గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే కోసం ఒడిశాలో అటవీ భూముల సేకరణకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు కూడా జారీ చేసింది.

మూడు ప్యాకేజీల కింద ఈ రహదారి పనులను చేపట్టాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లను రూపొందించేందుకు టెండర్లు పిలిచి కన్సల్టెన్సీలను ఖరారు చేసింది. రాష్ట్రంలో విజయనగరం జిల్లా సాలూరు నుంచి విశాఖ జిల్లా సబ్బవరం వరకు ఈ రహదారిని నిర్మిస్తారు. ఏపీలో ఆరు లేన్ల రహదారికి రూ.3,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక ఖరారైంది. దాదాపు 2 వేల ఎకరాలను సేకరించాలని అంచనా వేశారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో దాదాపు 1,300 ఎకరాలను సేకరించాల్సి ఉంది. కీలకమైన ఈ ప్రాజెక్టు భూసేకరణకు విజయనగరం, విశాఖ జిల్లా యంత్రాంగాలు సన్నాహాలు వేగవంతం చేశాయి.

పారిశ్రామికాభివృద్ధికి చుక్కాని..
రాయ్‌పూర్‌– విశాఖ ఎకనామిక్‌ కారిడార్‌ పారిశ్రామికాభివృద్ధికి చుక్కానిలా నిలవనుంది. కార్గో రవాణాకు కీలకంగా మారనుంది. విశాఖపట్నం, గంగవరం పోర్టుల నుంచి రాష్ట్రంతోపాటు ఒడిశా,  ఛత్తీస్‌గఢ్‌లకు కార్గో రవాణాకు ఈ రహదారే రాచబాట కానుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్, భిలాయి స్టీల్‌ప్లాంట్‌  (ఛత్తీస్‌గఢ్‌), బైలదిల్లాలోని నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఛత్తీస్‌గఢ్‌), దామంజోడిలోని నేషనల్‌ అల్యూమినియం కార్పొరేషన్‌(ఒడిశా), సునాబెడలోని హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(ఒడిశా) లాంటి కీలక పారిశ్రామిక కేంద్రాలను ఈ రహదారి అనుసంధానించనుంది.

కార్గో రవాణా, పారిశ్రామిక అనుబంధ పరిశ్రమల వృద్ధి ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంత కీలకమైన ప్రాజెక్టు కావడంతో వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఈ రహదారి గురించి కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు. 2024 నాటికి రాయ్‌పూర్‌ – విశాఖ ఎకనామిక్‌ కారిడార్‌ను పూర్తి చేస్తామని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆయనకు తెలియజేశారు. ఈ రహదారి నిర్మాణ పనులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top