టీడీపీలో గర్జించిన అసమ్మతి  | Sakshi
Sakshi News home page

టీడీపీలో గర్జించిన అసమ్మతి 

Published Mon, Sep 28 2020 10:00 AM

Dissent Erupted In Vizianagaram District TDP - Sakshi

సాక్షి, విజయనగరం: తెలుగుదేశం పార్టీలో వెన్నుపోటు కొత్తేం కాదు.. నాటి ఎన్టీఆర్‌ నుంచి నేటి వరకు ఆ పార్టీ ముఖ్య నేతలు, సీనియర్లు వెన్నుపోట్లుకు గురవుతూనే ఉన్నారు. తాజాగా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున నియామకంపై టీడీపీలో అసమ్మతిసెగలు భగ్గుమంటున్నాయి. తనను అధ్యక్షుడిగా నియమించకపోవడంపై గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తన కార్యాలయానికి పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యాలయంగా బోర్డుపెట్టి మరీ ఆయన నిరసన తెలిపారు. కార్యకర్తలతో తన కార్యాలయంలో ఆదివారం హుటాహుటిన సమావేశయ్యారు. పార్టీని నమ్ముకున్న తమకు అధిష్టానం అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జూనియర్‌కి అధ్యక్ష పదవి ఇచ్చి సీనియర్లను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు.

టీడీపీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. విజయనగరంలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో విలేకరుల సమావేశం పెట్టి మరీ టీడీపీ అగ్రనాయకత్వాన్ని ఏకిపారేశారు. అప్పటిలో  శ్రీకాకుళం, విజయనగరం ఎమ్మెల్యే స్థానాల బి.ఫారాలు ఎన్టీఆర్‌ తన చేతికే ఇచ్చేవారని, అప్పటి పార్టీకి, ఇప్పటి  పార్టీకి చాలా తేడాలు ఉన్నాయన్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు గద్దె ఉన్నడో లేడో కూడా టీడీపీ నాయకత్వం గుర్తించడం మనేసిందని, ఆత్మ గౌరవం, ఆత్మ సంతృప్తి కోల్పోయి పారీ్టకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.   (అలా మొక్కారు.. ఇలా తొక్కారు!)

అసమ్మతికి చిహ్నంగా మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు తన కార్యాలయానికి ఏర్పాటుచేసిన పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయం బోర్డు 
అశోక్‌కూ తప్పని భంగపాటు...  
తెలుగుదేశం పార్టీ ఆరంభం నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్‌ నాయకుడు పూసపాటి అశోక్‌ గజపతిరాజు గత ఎన్నికల్లో తన కుమార్తెను ఎమ్మెల్యేగా గెలిపించుకోలేక, తను ఎంపీగా గెలవలేక ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అదే ఆయన కుమార్తెకు పదవి రాకుండా చేసింది. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలిగా తన కుమార్తె అధితి గజపతిరాజుని చూడాలని ప్రయత్నించిన అశోక్‌ మళ్లీ భంగపడ్డారు. పార్టీలో నంబర్‌–2గా ఒక వెలుగు వెలిగిన అశోక్‌ గజపతి ప్రాభావం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనడానికి ఇదొక ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి, అశోక్‌కు మధ్య దూరం పూడ్చలేనంతగా పెరిగిపోయింది. తాజాగా తన కుమార్తెకు సైతం పదవి రాకపోవడంపై అశోక్‌ మరింత అసంతృప్తికి గురైనట్టు సమాచారం. పార్టీ నేతలెవరితోనూ మాట్లాడేందుకు సైతం ఇష్టపడడం లేదని ఆ పార్టీ జిల్లా నేతలే చెబుతున్నారు.   (అచ్చెన్నపై యూటర్న్‌)

సంధ్యారాణికి ప్రాధాన్యం...  
ఎన్ని విమర్శలు ఎదురైనా గుమ్మడి సంధ్యారాణికి చంద్రబాబు మరోసారి పదవిని కట్టబెట్టారు. సాలూరులో సీనియర్‌ నేతగా ఉన్న భంజ్‌దేవ్‌కు, సంధ్యారాణికి మధ్య విభేదాలు గత ఎన్నికలలో తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలైన భంజ్‌దేవ్‌ను  కాదని  సంధ్యారాణికి అరకు పార్లమెంట్‌ అధ్యక్ష పదవిని ఇవ్వడంతో భంజ్‌దేవ్‌వర్గం ఆగ్రహంగా ఉంది. ఓ వైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు  వర్గంగా ముద్రపడిన కె.ఎ.నాయుడు, మీసాల గీత వంటి వారిని చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది.

అయితే, వారసత్వ రాజకీయాలకు నేను ప్రాధాన్యం ఇవ్వను అంటూనే మాజీ మంత్రి కుమారుడికి పదవిని ఇవ్వడంపై నేతల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ముందు నిలువలేక చతికిలపడ్డ టీడీపీ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలతో పాటు విజయనగరం, అరకు, విశాఖ పార్లమెంట్‌ స్థానాలు సైతం కోల్పో యింది. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు చెల్లాచెదురైపోయారు. కొత్త నాయకత్వంతో నైనా పారీ్టపైకి లేస్తుందేమోనని భావిస్తున్న వారికి  తాజా పరిణామాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. మొత్తం మీద టీడీపీ కార్యవర్గ  పదవుల కేటాయింపు జిల్లాలో ఆ పార్టీకి మరోసారి  తీవ్ర నష్టాన్ని కలిగించేలా ఉంది.   

Advertisement
Advertisement