
సాక్షి,శ్రీకాకుళం: రాష్ట్రంలో సీఎం చంద్రబాబుతో అవినీతిలో ఆయన కేబినెట్‌లోని మంత్రులు కూడా పోటీ పడుతున్నారని మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రుల అవినీతిని తట్టుకోలేక పారిపోతున్న అధికారులను వెంటాడి మరీ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడి అవినీతికి సహకరించలేదనే కారణంతోనే ఆగ్రోస్ జీఎం రాజమోహన్‌ని ఈ ప్రభుత్వం బదిలీ చేసి, ఆయన స్థానంలో అవినీతి కేసులున్న జూనియర్ అధికారిని నియమించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే...
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిజాయితీగా పనిచేసే అధికారులకు కనీస గౌరవం లేకుండా పోతోంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తన అవినీతికి సహకరించలేదనే కారణంతో సీనియర్ అధికారి ఏపీ ఆగ్రోస్ జీఎం రాజమోహన్‌ను బదిలీ చేసి, ఆ స్థానంలో అర్హత లేని చిన్న స్థాయి ఉద్యోగిని తెచ్చిపెట్టుకున్నారంటే నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రయారిటీ ఏంటో అర్థమైపోతుంది.
వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం నెరిపి తనకు మేలు జరిగేలా చేయాలని మంత్రి పేషీ నుంచి ఆగ్రోస్ జీఎం రాజమోహన్ కి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. కానీ దానికి ఆయన అంగీకరించకుండా సెలవుపై వెళ్లిపోవడంతో ఆయన స్థానంలో అవినీతి ఆరోపణలు, పెండింగ్ కేసులన్న జూనియర్ అధికారిని తీసుకొచ్చి నియమించడం చూస్తుంటే అవినీతికి ఈ ప్రభుత్వం ఏవిధంగా పెద్దపీట వేస్తుందో చెప్పకనే చెప్పింది. వ్యవసాయాధారిత రాష్ట్రంగా ఉన్న ఏపీలో రైతులకు ఏవిధంగా మేలు చేయాలో ఆలోచించాల్సిందిపోయి కమీషన్ల ద్వారా జేబులు ఎలా నింపుకోవాలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్కెచ్ వేసుకోవడం సిగ్గుచేటు.
ఆగ్రోస్ జీఎం రాజమోహన్ బదిలీ వెనుక ఏం కారణాలున్నాయో స్పష్టం చేయాల్సిన బాధ్యత అచ్చెన్నాయుడిపై ఉంది. మంత్రి అచ్చెన్నాయుడు ఎంతగా వేధించి ఉండకపోతే సీఎస్‌కి లేఖ రాసి మరీ ఆయన వెళ్లిపోతారు? సమర్థవంతమైన నిజాయితీగల అధికారులకు ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? ప్రజలకు మేలు చేయాలనుకున్న అధికారులను వేధించి ట్రాన్సఫర్లతో సన్మానిస్తారా? జరగని లిక్కర్ కుంభకోణాన్ని సృష్టించి వైయస్సార్సీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్న ఈ ప్రభుత్వం, అవినీతికి ప్రేరేపిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడిపై ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలి.
ఉచిత పంటల బీమాను ఎత్తేశారు:
వైఎస్సార్‌సీపీ హయాంలో అమలు చేసిన ఉచిత పంటల బీమాను కూటమి ప్రభుత్వం వచ్చాక ఎత్తివేసింది. గత వైఎస్ జగన్ పాలనలో ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు పంట నష్టపోతే ప్రభుత్వం చెల్లించిన బీమా వల్ల వారికి పెద్దగా నష్టం లేకపోయేది. కానీ కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. వరి, అరటి, మామిడి, మిర్చి, పొగాకు రైతులు తాము కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోయారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతుల్ని ఈ ప్రభుత్వం వంచించింది. కేంద్రం అందించే సాయంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు చెల్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక కేంద్ర సాయంతో కలిపి రూ. 20 వేలు ఇస్తామని మాట మార్చారు. అధికారంలోకి వచ్చిన 14 నెలలుగా రైతులను ఈ ప్రభుత్వం దగా చేస్తూ వస్తోంది. కూటమి నాయకుల అవినీతి వ్యవహారాలను వైఎస్సార్‌సీపీ ప్రస్తావించినప్పుడు వాటికి సమాధానం చెప్పుకోలేక గత ప్రభుత్వం అంటూ ఏడాదిగా మాపై బురదజల్లుతూనే ఉన్నారు. పొద్దస్తమానం వైఎస్ జగన్ పేరు తల్చుకోకుండా కూటమి నాయకులకు రోజు కూడా గడవడం లేదు.