కాంగ్రెస్‌ను నాశనం చేస్తోంది వారేనా?.. గాంధీభవన్‌లో అసలేం జరుగుతోంది?

Coverts Tension in Telangana Congress Party - Sakshi

తెలంగాణ కాంగ్రెస్‌లో కోవర్టులున్నారా? వారి వల్లే పార్టీ నిర్వీర్యం అవుతోందా? కాంగ్రెస్‌ను నాశనం చేసే లక్ష్యంతోనే కొందరు నాయకులు గాంధీభవన్లో పనిచేస్తున్నారా? టీ.పీసీసీ కమిటీలు వేసినప్పటినుంచీ కాంగ్రెస్‌లో రచ్చ మామూలుగా జరగడంలేదు. అన్ని స్థాయిల్లోనూ కమిటీల పట్ల అసంతృప్తి రగులుకుంటోంది. సీనియర్లంతా కమిటీల తీరుపై మండిపడుతున్నారు. గాంధీభవన్‌లో అసలేం జరుగుతోంది? 

అసహనం, ఆగ్రహం, ఆవేదన 
తెలంగాణ కాంగ్రెస్ కమిటీలు ప్రకటించినప్పటినుంచి పరిస్థితి అదుపు తప్పింది. పీసీసీ, డీసీసీలకు కమిటీలతో పాటు..రాష్ట్ర స్థాయిలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేస్తూ హైకమాండ్ ప్రకటన జారీ చేసింది. ఢిల్లీ నుంచి ప్రకటన వచ్చినప్పటినుంచీ టీ.కాంగ్రెస్లో రచ్చ రచ్చ అవుతోంది. పదవులు రానివారు, వచ్చిన పదవి నచ్చనివారు, తమవారికి అడిగిన పదవులు రానివారు.. ఇలా నానా రకాల నాయకులంతా కమిటీల ఏర్పాటుపై అసహనం, ఆగ్రహం, ఆవేదన వెళ్ళగక్కుతున్నారు. ముఖ్యంగా సీనియర్లంతా కమిటీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీల ఏర్పాటులో తమను అవమానించారని మండిపడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించినవారు.. ఆయన్ను సమర్థించినవారు కూడా కమిటీల విషయంలో భగ్గుమంటున్నారు. 

మమ్మల్ని అవమానిస్తారా?
కాంగ్రెస్లో పై నుంచి కింది వరకు పార్టీ ఎజెండా కంటే పర్సనల్ ఎజెండాకే ప్రాముఖ్యమిస్తారనే విమర్శ ఎంతో కాలం నుంచి ఉంది. అందుకూ చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరుతున్నాయంటూ చాన్నాళ్ళ క్రితమే ఆందోళన మొదలైంది. ఒక వర్గ నాయకులు పథకం ప్రకారం టీ. కాంగ్రెస్ను నిర్వీర్యం చేయడం కోసం పనిచేస్తున్నారని, అందుకే కాంగ్రెస్ గురించి తెలియనివారికి, కాంగ్రెస్ లక్షణాలు లేనివారికి, నిన్నా..మొన్నా వచ్చిన వారికి కీలక పదవులు అప్పగిస్తున్నారని..సీనియర్లకు కనీసం సమాచారం ఇవ్వకుండా కమిటీలు వేశారని మండిపడుతున్నారు. కొండా సురేఖ వంటి సీనియర్ నేతలు తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానించారని ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే కొండా సురేఖ తనకిచ్చిన ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవికి రాజీనామా సమర్పించారు. 

చదవండి: (TS: ముందస్తు ఎన్నికలు?.. వణికిస్తున్న సర్వే రిపోర్టులు!)

ఇజ్జత్ పోయింది.. ఇంకేముంటాం?
ఓరుగల్లులో కొండాతో మొదలైన అసంతృప్త జ్వాలలు..ఖమ్మం మీదుగా...నల్గొండ నుంచి మెదక్ జిల్లా ద్వారా గాంధీభవన్కు వ్యాపించాయి. జిల్లా కమిటీలు వేసేటపుడు సంబంధిత జిల్లాలోని సీనియర్లకు చెప్పే పనిలేదా అంటూ భట్టి విక్రమార్క నిలదీసారు. పార్టీలో పీసీసీకి ఉన్నంత విలువ సీఎల్పీకి కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు. కొత్త కమిటీల్లో సీనియర్లకు ఘోర పరాభవం జరిగిందని మొత్తం మీద కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఏ స్థాయిలోనూ సీనియర్లను లెక్కలోకి తీసుకోలేదని హైకమాండ్ను, పీసీసీ చీఫ్ను దుమ్మెత్తి పోస్తున్నారు. సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్లో కోవర్టిజం రాజ్యమేలుతోందని ఆరోపించారు. పార్టీలోని కొందరు అధికార పార్టీ కోసం పనిచేస్తూ..కాంగ్రెస్ను సర్వ నాశనం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోవర్టుల కోసం కొత్త కమిటీలా?
రెండు రోజులుగా సీనియర్లంతా జట్లు, జట్లుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమకు, తమవారికి జరిగిన అన్యాయం గురించి ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. కోవర్టులను కాపాడేందుకే కొత్త కమిటీలు వేశారని, వారికే ప్రాధాన్యమిచ్చారని విమర్శిస్తున్నారు. పార్టీలోని కోవర్టుల గురించి హైకమాండ్కు ఫిర్యాదు చేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీలో అనర్హులను అందలం ఎక్కిస్తున్నారని అందుకే రోజు రోజుకూ కాంగ్రెస్ పతనం అవుతోందనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు అసంతృప్త నాయకులు. టీ.పీసీసీలో తలెత్తిన ఈ అసంతృప్త జ్వాలలు, ఆగ్రహ జ్వాలల్ని హైకమాండ్ ఎలా అదుపులోనికి తెస్తుందో చూడాలి.

- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top