
ఏర్పాట్లపై మాట్లాడుతున్న వాకిటి శ్రీహరి, మహేశ్‌గౌడ్, మల్లు రవి
బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకై జంతర్‌మంతర్‌లో మహాధర్నా
పాల్గొననున్న ఖర్గే, రాహుల్, సీఎం రేవంత్, మంత్రులు
ఇండియా కూటమి పార్టీల ఎంపీలూ హాజరయ్యే అవకాశం
ధర్నాస్థలిని పరిశీలించిన పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్, మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ బుధవారం ఢిల్లీలో మహాధర్నా నిర్వహించనుంది.
జంతర్ మంతర్‌లో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాధర్నాలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, వివేక్, వాకిటి శ్రీహరి, సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుతోపాటు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.
ఈ ధర్నాలో ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీలతో పాటు, ఇండియా కూటమి పారీ్టల ఎంపీలు పాల్గొననున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ధర్నాలో పాల్గొనాలని సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆర్‌జేడీ, వామపక్ష పారీ్టల ఎంపీలకు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి లేఖలు రాశారు. కార్యక్రమ ఏర్పాట్లను మంగళవారం మహేశ్‌కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, విప్ ఆది శ్రీనివాస్ తదితరులు పరిశీలించారు.
200 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేశారు. 1,500 మందికి పైగా కూర్చునేలా కురీ్చలు వేశారు. ఉదయం 10 గంటలకు మొదలయ్యే ధర్నా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్, జంతర్‌మంతర్‌కు వెళ్లే దారిలో ధర్నాకు సంబంధించిన ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు.
మహాధర్నాలో పాల్గొనే దాదాపు వెయ్యి మంది కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలతో సోమవారం హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు మంగళవారం మధ్యాహా్ననికి ఢిల్లీ చేరుకుంది. వీరికి స్థానిక వైఎంసీఏతో పాటు పలు హోటళ్లలో వసతి కల్పించారు. వీరితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు సుమారు 500 మంది వరకు విమానాల్లో ఢిల్లీకి వచ్చారు. వీరందిరికీ ఎంపీల అధికారిక నివాస గృహాలు, వెస్ట్రన్ కోర్ట్‌లో వసతిని ఏర్పాటు చేశారు.