
కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం తీవ్ర వ్యాఖ్యలు
చేతనైతే రాజీవ్ విగ్రహం మీద చెయ్యి పెట్టండి.. చెప్పు తెగకపోతే చూస్తా
నీకు ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తుకొచి్చందా? ఇన్నిరోజులు గాడిదలేమైనా కాసినవా?
త్వరలోనే రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం
డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత తీసుకుంటాం: సీఎం
సాక్షి, హైదరాబాద్: ‘దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్‌గాంధీ తన ప్రాణాలను సైతం త్యాగం చేశారు. ఆయన సతీమణి సోనియాగాందీతోనే 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర కల సాకారమయింది. రాజీవ్ విగ్రహాన్ని సచివాలయం ముందు పెడతామని మేం చెపితే ఒక సన్నాసి అధికారంలోకి రాగానే తొలగిస్తాం అంటున్నాడు. నీ అయ్య విగ్రహం కోసం దేశం కోసం ప్రాణమిచ్చిన రాజీవ్‌గాంధీ విగ్రహం తీసేస్తావా? నీకు మళ్లీ అధికారమనేది కలలో మాట. రాజీవ్‌గాంధీ విగ్రహం తీస్తా అని మాట్లాడుతావా? చింతమడకకు పోతవు బిడ్డా.. రాజీవ్ విగ్రహం దగ్గరకు పోతే వీపు చింతపండు అయితది.
రాజీవ్‌గాంధీ విగ్రహం తీయడానికి నువ్వు ఎప్పుడొస్తవో తారీఖు చెప్పు. మా జగ్గన్నకు చెప్తా.. ఆయన వచ్చి అక్కడ ఉంటడు. అప్పుడు తెలుస్తది బిడ్డా నీకు రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమయితదో? ఎవడైనా చేతనైతే రాజీవ్‌గాంధీ విగ్రహం మీద చెయ్యి పెట్టండి బిడ్డా.. చెప్పు తెగకపోతే చూస్తా నేను..’ అని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుని, వేల కోట్ల రూపాయలు సంపాదించుకుని, ఫామ్‌హౌస్‌లు కట్టుకున్న సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందు పెడితే ఇప్పటి పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారని ప్రశ్నించారు.
పొద్దున్నుంచి రాత్రి వరకు తాగి ఫామ్‌హౌస్‌లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం సచివాలయం ముందు ఉండాలా? దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్‌గాంధీ విగ్రహం ఉండాలా? అనేది తెలంగాణ సమాజం ఆలోచించాలని అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 80వ జయంతి సందర్భంగా సోమాజిగూడలోని ఆయన విగ్రహానికి రేవంత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎంపీ వి.హనుమంతరావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు పరుష పదజాలంతో కౌంటర్ ఇచ్చారు.
వాళ్లయ్య పొయ్యేదెప్పుడు? వీడు పెట్టేదెప్పుడు?
‘దేశానికి స్వాతంత్య్రం తెచ్చి, దేశం కోసం ప్రాణాలిచ్చి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబానికి చెందిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు అమరవీరుల స్తూపం పక్కన ఏర్పాటు చేయడమే సముచితం. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయని సన్నాసులకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. అధికారం పోయినా వారికి బలుపు తగ్గలేదు. ఆ బలుపు అణగదీసే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారు. రాజీవ్‌గాంధీ విగ్రహం తీసేస్తానన్న సన్నాసి బాధ ఏంటో కనుక్కుంటే.. అక్కడ వాళ్ల అయ్య విగ్రహం పెడదామని అనుకున్నాడని తెలిసింది. వాళ్లయ్య పొయ్యేదెప్పుడు? వీడు పెట్టేదెప్పుడు?..’ అంటూ సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్‌గాందీ.
‘నీకు ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తుకొచ్చిందా? ఇన్నిరోజులు గాడిదలేమైనా కాసినవా? సచివాలయం బయట కాదు.. 2024 డిసెంబర్ 9 నాడు సచివాలయం లోపలే ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేం తీసుకుంటాం. అధికారం కోల్పోయి విచక్షణా రహితంగా, అసహనంతో అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ నుంచి సామాజిక బహిష్కరణ చేయాల్సి వస్తుంది.
రాష్ట్రాన్ని దోచుకున్న దొంగ విగ్రహం పెడితే తెలంగాణ వాళ్లందరూ దొంగలుగా తయారవుతారు. సచివాలయం ముందు దొంగలు, తాగుబోతులకు స్థానం లేదు. దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్‌గాంధీ. దేశంలో సాంకేతిక విప్లవం తెచ్చిందీ, మహిళలకు రాజకీయ సాధికారత కల్పించి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసిందీ రాజీవ్‌గాందీయే. త్వరలోనే పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఆయన విగ్రహాన్ని సచివాలయం ముందు ఏర్పాటు చేస్తాం..’ అని రేవంత్ చెప్పారు.
మాజీ ఐటీ మంత్రికి ఆ మాత్రం తెలియదా?: భట్టి
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఐటీ రంగానికి పునాది వేసింది రాజీవ్‌గాం«దీయేనని అన్నారు. హైదరాబాద్‌లో ఐటీ విస్తరణకు ఎవరు కృషి చేశారో.. విదేశాల్లో చదువుకున్నామని చెప్పుకునే వారికి, ఐటీ మినిస్టర్‌గా పనిచేశానని చెప్పుకునే వ్యక్తికి తెలియదా? అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణే‹Ù, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం: సీఎం
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిలతో కలిసి.. సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు.
భవన ప్రధాన ద్వారం ముందు విగ్రహం ఏర్పాటు, స్థలం, డిజైన్ ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9న ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించామని తెలిపారు. ఇందులో భాగంగానే సచివాలయ ఆవరణను పరిశీలించామన్నారు.