కాలకేయ ముఠాలా మారారు: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Fires On BRS Leaders | Sakshi
Sakshi News home page

కాలకేయ ముఠాలా మారారు: సీఎం రేవంత్‌

Oct 6 2024 3:54 AM | Updated on Oct 6 2024 3:54 AM

CM Revanth Reddy Fires On BRS Leaders

రాష్ట్ర ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేపట్టినా అడ్డుపడుతున్నారు 

బీఆర్‌ఎస్‌ నేతలపై సీఎం రేవంత్‌ మండిపాటు

వారి ఫామ్‌హౌస్‌ల కోసం మూసీ వాసులను కవచంగా వాడుకుంటున్నారు.. ప్రజల ఆస్తి తగ్గుతుంటే.. మీ ఆస్తులెలా పెరిగాయి? 

మూసీ నిర్వాసితులను అనాథలను చేయం.. అండగా ఉంటాం..వారికి అంబర్‌పేట పోలీస్‌ అకాడమీ, మలక్‌పేట రేస్‌కోర్స్‌ స్థలాల్లో ఇళ్లు కట్టిస్తాం

గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్‌): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేసేందుకు ఏ కార్యక్రమం చేపట్టినా కొం­ద­రు కాలకేయ ముఠాలా అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వాళ్లు గత పదేళ్ల­లో వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకుంటే.. నిరుపేద ప్రజలు మాత్రం మురుగునీరు, కలుషి­త వాతావరణంలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. 

ప్రభుత్వం మూసీ నిర్వాసితులకు అన్నివిధాలు­గా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రభు­త్వం ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి (కాకా) 95వ జయంతి వేడుకలను నిర్వహించారు. సీఎం రేవంత్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘ప్రజాప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుందే తప్ప అన్యాయం చేయబోదు. కొందరు వ్యక్తులు తమ ఫామ్‌హౌజ్‌లను రక్షించుకోవడం కోసం మూసీ నిర్వాసితులను ఒక రక్షణ కవచంలా వాడుకుంటున్నారు. వారి కుట్రలను అర్థం చేసుకోవాలి. మూసీ నిర్వాసితులను ప్రభుత్వం అనాథలను చేయదు. వారికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిదే. మూసీ రివర్, బఫర్‌ జోన్లలో ఉన్న నిరుపేదలను ప్రభుత్వం ఆదుకుంటుంది. 

పేదలకు మేలు చేసే విషయంలో విపక్ష నేతలతో సహా ఒక కమిటీ వేస్తాం. పేదలకు మేలు జరిగేలా తగు సూచనలు చేయాలి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సచివాలయానికి రావాలి. వారితోపాటు నేను, డిప్యూటీ సీఎం, అధికారులు కూర్చుందాం. మూసీ ప్రణాళికలపై చర్చిద్దాం. ప్రజలకు ఇళ్లు ఇస్తే మేలు జరుగుతుందా? లేక డబ్బులిస్తే మేలు జరుగుతుందా అనే విషయాలపై ఆలోచిద్దాం. 

మూసీని కాపాడుకోవాలి.. 
మూసీ నది, చెరువులు, కుంటలు చివరకు నాలాలను సైతం ఆక్రమించారు. ఇలాగే వదిలేస్తూ.. మూసీ నదిని మూసేద్దామా? 1908లో వరదలు వచ్చినప్పుడు జరిగిన విపత్తు వంటివి పునరావృతం కావొద్దంటే మూసీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. గుజరాత్‌లో సబర్మతి నదిని నరేంద్ర మోదీ ప్రక్షాళన చేస్తే చప్పట్లు కొట్టిన బీజేపీ నాయకులు.. మూసీ ప్రక్షాళన అంటే మాత్రం ఎందుకు సహకరించడం లేదు? 

ఆస్తుల లెక్కలు చూద్దామా? 
తెలంగాణ ప్రజల ఆస్తులు తగ్గుతుంటే.. గత ప్రభుత్వంలోని వారి ఆస్తులు ఎలా పెరిగాయి? 2004లో కేసీఆర్, 2005లో హరీశ్‌రావుల ఎన్నికల అఫిడవిట్ల నుంచి.. ఇప్పటి వాళ్ల ఆస్తుల వివరాలను చూద్దామా. కొందరు సోషల్‌ మీడియాతో అధికారంలోకి రావాలని కలలు కంటున్నారు. కానీ సోషల్‌ మీడియాతో అధికారంలోకి రావడం ఏమోగానీ.. చర్లపల్లి జైలుకు వెళ్లడం మాత్రం ఖాయం. 

నిర్వాసితులకు మలక్‌పేట, అంబర్‌పేటల్లో ఇళ్లు 
మూసీ నిర్వాసితులకు మంచి జీవితాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మలక్‌పేట్‌లో ఉన్న రేస్‌కోర్స్, అంబర్‌పేటలో ఉన్న పోలీస్‌ అకాడమీలను హైదరాబాద్‌ శివార్లకు తరలిస్తాం. ఈ ప్రాంతాల్లో మూసీ నిర్వాసితులకు ఇళ్లు కట్టిద్దాం. కేటీఆర్, హరీశ్‌రావులకు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే.. వారికి ఉన్న వందల ఎకరాల ఫామ్‌హౌజ్‌ల నుంచి కొన్ని ఎకరాలను నిరుపేదలకు పంచి ఇవ్వాలి. 

బీఆర్‌ఎస్‌ పార్టీ ఖాతాలో రూ.1,500 కోట్లు ఉన్నాయి. అందులో నుంచి రూ.500 కోట్లు పేదలకు ఇవ్వొచ్చుకదా! బీఆర్‌ఎస్‌ హయాంలో కేవలం రూ.17 వేలకోట్లు రుణమాఫీ చేస్తే మేం నెల రోజుల్లోనే రూ.18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం. రైతులెవరూ రోడ్ల మీదికి రావొద్దు. ఏవైనా సమస్యలుంటే కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే సమస్య తీరిపోతుంది..’’అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 

‘కాకా’ఆశయాలను కొనసాగిస్తాం 
తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్ది మందిలో కాకా వెంకటస్వామి ఒకరని సీఎం రేవంత్‌ కొనియాడారు. కాకా పేదల మనిషని, 80 వేల మందికిపైగా నిరుపేదలకు ఇళ్లు ఇప్పించిన, సింగరేణి సంస్థను కాపాడి కార్మికులకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి ఆయన అని చెప్పారు. గత ప్రభుత్వం కాకా జయంతిని అధికారికంగా జరపకుండా విస్మరించిందని విమర్శించారు. తాము కాకా ఆశయాలను కొనసాగిస్తామన్నారు. 

బలమైన లక్ష్యాలు ఉంటే పేదరికం, కులం అడ్డంకులు కావని కాకా నిరూపించారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అనంతరం జి.వెంకటస్వామిపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు వివేక్‌ వెంకటస్వామి, గడ్డం వినోద్, నాగరాజు, ఎమ్మెల్సీ కోదండరామ్, ఎంపీలు అనిల్‌కుమార్‌ యాదవ్, మల్లురవి, గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement