
సాక్షి, హైదరాబాద్: బీజేపీ చేస్తున్న పనులకు సర్దార్ పటేల్ ఆత్మ క్షోభిస్తుంది.. సెప్టెంబర్ 17తో బీజేపీకి ఏం సంబంధం? అని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్రే లేదన్నారు. కవిత ఎపిసోడ్‌పై కూడా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తెలంగాణలో సెప్టెంబర్ 17పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17తో బీజేపీకి ఏం సంబంధం?. రజాకార్లను వ్యతిరేకించిన వారిలో ఒక్క బీజేపీ నేత అయినా ఉన్నాడా?. మహాత్మా గాంధీని చంపిన గాడ్సేపై ప్రేమ చూపించే బీజేపీని చూసి యువత ఏం నేర్చుకోవాలి. నెహ్రు సూచనల మేరకే పటేల్ సైన్యాన్ని పట్టుకొని వచ్చాడు. బీజేపీకి చెప్పుకోవడానికి చరిత్రనే లేదు. స్వాతంత్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదు.. సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర లేదు.
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఎలా అవుతుంది?. బీజేపీ కార్యక్రమం, రాజకీయ కార్యక్రమం ఇది. గుజరాత్‌లోని జునాఘడ్ కూడా సెప్టెంబర్ 17న ఇండియాలో విలీనం అయింది. జునాఘడ్ గురించి ఒక్క మాట మాట్లాడని బీజేపీ హైదరాబాద్ గురించి మాట్లాడడం రాజకీయం కాదా?. మోదీ వచ్చిన తర్వాత జరిగిన అనేక ఘటనలు ఎన్నికల ముందే జరిగాయి. ఎన్నికల ముందు జరిగిన ఘటనలపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఎన్నికలే ముఖ్యం అన్నట్టు బీజేపీ నాయకులు భావిస్తున్నారు. మోదీ ప్రధాని అయ్యాక వచ్చిన ఘటనలపై చర్చ జరిగి నిజాలు నివృత్తి కావాలి. పహల్గాం వద్ద మిలిటరీ ఫోర్స్ ఎందుకు తొలగించారు. పహల్గాం ఘటనలో మోదీ, అమిత్ షా ఫెయిల్యూర్.
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశంపై స్పందిస్తూ.. కోమటిరెడ్డి ఫ్యామిలీ బోల్డ్‌గా మాట్లాడుతారు. రాజగోపాల్ రెడ్డి అంశంపై నాకు కూడా ఫిర్యాదు రాలేదు. క్రమశిక్షణ కమిటీ సుమోటోగా తీసుకుంటుందని అనుకుంటున్నాను. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. ఎవరు పార్టీ పెట్టినా స్వాగతిస్తాం. కవిత ఎప్పుడు పుట్టారు?. కవిత పుట్టిన తేదీ ఎప్పుడు?. కవిత పార్టీ ఎప్పుడు పుట్టింది. జరిగింది విలీనం కాబట్టే కవిత విలీన దినోత్సవం చేస్తోంది. కాంగ్రెస్ లైన్ కరెక్ట్ కాబట్టి ఆ లైన్‌లో కవిత ఉంది’ అని చెప్పుకొచ్చారు.