ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో మరో ట్విస్ట్! | Telangana Defection Case: Speaker Issues Notices to MLAs | Sakshi
Sakshi News home page

ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో మరో ట్విస్ట్!

Sep 19 2025 8:35 AM | Updated on Sep 19 2025 11:22 AM

Another Twist in Telangana Defected MLAs Episode

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారణ జరిపేందుకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో.. మరిన్ని ఆధారాలు సమర్పించాలంటూ బీఆర్‌ఎస్‌ ఫిర్యాదుదారులకూ నోటీసులు జారీ కావడం గమనార్హం. ​

ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(గద్వాల), సంజయ్‌(జగిత్యాల), గూడెం మహిపాల్‌రెడ్డి(పటాన్‌చెరు), పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్సువాడ), కాలె యాదయ్య(చేవెళ్ల), తెల్లం వెంకట్రావు(భద్రాచలం)లకు తాజాగా నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఫిరాయింపుల అభియోగాలకు సంబంధించి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదుదారులకూ స్పీకర్‌ నోటీసులు పంపించారు. 

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి.. కాంగ్రెస్‌లో చేరారని, వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సర్వోన్నత న్యాయస్థానం సూచించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. స్పీకర్‌ వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీచేయగా.. 10 మంది ఎమ్మెల్యేల్లో.. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(గద్వాల), అరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), సంజయ్‌(జగిత్యాల), గూడెం మహిపాల్‌రెడ్డి(పటాన్‌చెరు), పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్సువాడ) ప్రకాశ్‌గౌడ్‌(రాజేంద్రనగర్‌), కాలె యాదయ్య(చేవెళ్ల), తెల్లం వెంకట్రావు(భద్రాచలం) స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు. . తాము పార్టీ మారలేదని, బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామని వివరణ ఇచ్చారు. దీంతో వీళ్ల వివరణపై అభ్యంతరాలుంటే చెప్పాలని ఈ నెల 11న స్పీకర్‌ కార్యాలయం ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు వేర్వేరుగా లేఖలు పంపించింది. అయితే.. 

వీరితోపాటు నోటీసులు స్వీకరించిన శాసనసభ్యులు కడియం శ్రీహరి(స్టేషన్‌ ఘన్‌పూర్‌), దానం నాగేందర్‌(ఖైరతాబాద్‌) మాత్రం ఇంకా సమాధానాలివ్వలేదని తెలుస్తోంది. ఇప్పుడు.. నోటీసులపై సమాధానాలిచ్చిన 8 మంది ఎమ్మెల్యేల వివరణలపై తమ అభ్యంతరాలను అఫిడవిట్‌ రూపంలో అందజేయాలని.. ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు గురువారం శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు పేరిట లేఖలు వెళ్లాయి. 

స్పీకర్‌ వద్ద విచారణలో భాగంగా.. నోటీసులు స్వీకరించిన ఎమ్మెల్యేలు, ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వాదనలుంటాయి. కాబట్టి.. తదుపరి విచారణ కోసం లీగల్‌ ఫార్మాట్‌లో అభ్యంతరాలను ఇవ్వాలని ఆ లేఖల్లో పేర్కొన్నారు. లేఖ అందిన మూడు రోజుల్లోగా అందించాలని గడువు విధించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement