2034 వరకు మేమే: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Fires On BJP, BRS About Jubilee Hills by election | Sakshi
Sakshi News home page

2034 వరకు మేమే: సీఎం రేవంత్‌

Nov 10 2025 1:58 AM | Updated on Nov 10 2025 1:58 AM

CM Revanth Reddy Fires On BJP, BRS About Jubilee Hills by election

ప్రజలు మాకు కూడా పదేళ్లు పాలించే అవకాశం ఇస్తారు: సీఎం రేవంత్‌

2028 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు రావు.. 2029 జూన్‌లో జమిలి ఎన్నికలు 

పదేళ్లలో వందేళ్ల అభివృద్ధి ప్రణాళికలు రచించి ముందుకు తీసుకెళ్తాం 

కాలేజీల్లో అన్నీ సవ్యంగా ఉన్నట్లు తేలితే అదే రోజు 100% ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తా 

కేటీఆర్‌ అరెస్ట్‌కు అనుమతి కోరితే 3 నెలలైనా గవర్నర్‌ స్పందించలేదు 

‘జూబ్లీహిల్స్‌’లో గెలుస్తాం.. బీఆర్‌ఎస్‌ పనైపోయింది.. బీజేపీకి డిపాజిట్టూ రాదు 

ఎవరిది అగ్రికల్చర్‌.. ఎవరిది డ్రగ్స్‌ కల్చరో ప్రజలే నిర్ణయించుకోవాలి 

ఉమ్మడి ఏపీలో పదేళ్ల కాంగ్రెస్‌ పాలనను,బీఆర్‌ఎస్‌ పాలనను పోల్చుకొని ఓట్లేయాలి 

‘మీట్‌ ద ప్రెస్‌’లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ‘నేను చెబుతున్నది గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీ ఎన్నికలు 2028 డిసెంబర్‌లో రావు. 2029 జూన్‌లో జమిలి ఎన్నికలు వస్తాయి. ఆ తర్వాత ఐదేళ్లకు ఎన్నికలు జరుగుతాయి. 2034 జూన్‌ వరకు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటుంది. పదేళ్లు టీడీపీ, పదేళ్లు కాంగ్రెస్, పదేళ్లు కేసీఆర్‌కు ప్రజలు అవకాశమిచ్చారు. మాకు కూడా పదేళ్లు అధికారమిస్తారు. ఈ పదేళ్లలో 100 ఏళ్లకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను రచించి ముందుకు తీసుకెళ్తాం. 2004–14 వరకు జరిగి ఆ తర్వాత ఆగిపోయిన అభివృద్ధిని 2024–34 మధ్య కొనసాగిస్తాం. ఇప్పటికి రెండేళ్లయింది. 

ఇంకో ఎనిమిదేళ్లలో అన్నీ పూర్తి చేస్తాం’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఓ హోటల్‌లో నిర్వహించిన ‘మీట్‌ ద ప్రెస్‌’కార్యక్రమంలో సీఎం రేవంత్‌ మాట్లాడారు. రెండేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తెలంగాణ రైజింగ్‌ డాక్యుమెంట్‌–2047ను వచ్చే నెలలో ఆవిష్కరిస్తామన్నారు. ఆ తర్వాత విలేకరుల ప్రశ్నలకు సీఎం బదులిచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...  

‘కాళేశ్వరం’పై సీబీఐ దర్యాప్తులో ముందడుగేదీ?
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు బాధ్యులెవరో నిగ్గుతేల్చేందుకు ఘోష్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తే బీఆర్‌ఎస్‌ నేతలు మాపై ఆరోపణలు చేశారు. అందుకే దీనిపై అసెంబ్లీలో చర్చించి ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాం. కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లోనే నిందితులను జైల్లో పెడతామని కిషన్‌రెడ్డి అన్నారు. కానీ ఇప్పటికి 3 నెలలైనా విచారణ ఇంకా మొదలుకాలేదు. సీబీఐ కాళ్లకు బంధం వేస్తున్నదెవరో మీరే (మీడియా) తేల్చాలి. 

కాలేజీల బంద్‌తో ‘ఫీజు’సమస్య పరిష్కారం కాదు... 
నేను ఇవ్వాల్సింది ప్రతి విద్యార్థికి రూ. 35 వేలే. కానీ కాలేజీలు రూ. లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. యాజమాన్యాల కోరికలు తీర్చలేదనే పగతో కళాశాలలు బంద్‌ చేస్తామంటున్నారు. బంద్‌ చేస్తే పిల్లలు నష్టపోయే విద్యాసంవత్సరాన్ని ఎవరు తెచ్చిస్తారు? బంద్‌ బందూకుల వల్ల సమస్య పరిష్కారం కాదు. రూల్‌ బుక్‌ ప్రకారం ఏం చేస్తున్నారో చూద్దాం. మీడియా, విజిలెన్స్, కళాశాలల యాజమాన్యాలతో నిజనిర్ధారణ చేద్దాం. 100 శాతం కరెక్టుగా ఉందని ఈ కమిటీ నిర్ధారిస్తే ఆ కళాశాల కోసం తల తాకట్టు పెట్టయినా ఆ రోజే 100 శాతం రీయింబర్స్‌మెంట్‌ ఇస్తా. 

బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కేసీఆర్‌ కోరలేదేం? 
బీఆర్‌ఎస్‌ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల మద్దతు అడిగితే బాగుండేది. కానీ ఆ పార్టీ నాయకుడే శాసనసభకు రాడు. టీఆర్‌ఎస్‌ పుట్టుక నుంచి మరణశయ్యపైకి చేరుకొనే సమయంలో ఆ పార్టీకి ఎప్పుడైనా సున్నా సీట్లు వచ్చాయా? కేసీఆర్‌ బతికి ఉన్నప్పుడే, కేటీఆర్‌ నాయకత్వంలో గుండుసున్నా వచ్చాక ఎవరి కోసం ఈ బుకాయింపులు? వాళ్ల పనైపోయింది. 

బీఆర్‌ఎస్‌ కాలగర్భంలో కలవబోతోంది. ఆ బాధతోనే కేసీఆర్‌ బయటకు రావట్లేదు. ఇప్పటివరకు ఆయన బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరలేదు. ఇది దేనికి సంకేతం? కేసీఆర్‌ను సానుభూతితో చూడాల్సిన పరిస్థితులే వచ్చాయి తప్ప ప్రత్యర్థిగా చూడాల్సిన పరిస్థితుల్లేవు. ఫార్ములా–ఈ రేసులో అవకతవకలపై నమోదైన కేసులో కేటీఆర్‌ను అరెస్ట్‌ చేసేందుకు అనుమతి కోరుతూ 3 నెలల క్రితమే గవర్నర్‌కు లేఖ రాసినా ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. 

నేను కాంగ్రెస్‌ కార్యకర్తను.. 
నాది కార్యకర్త మనస్తత్వం. పార్టీ ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా నేను ఇంట్లో కూర్చోను. నా మనసు ఒప్పుకోదు. హుజూరాబాద్, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఎన్నికల్లోనూ ఇలాగే తిరిగా. నేను కాంగ్రెస్‌ కార్యకర్తను.. ఆ తర్వాత ఎమ్మెల్యేను.. ఆ తర్వాతే ముఖ్యమంత్రిని. సెక్యూరిటీ వాళ్లు అనుమతిస్తే గడపగడపకూ ప్రచారం చేసేవాడిని.  

పంచాయతీ ఎన్నికలపై... 
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసమే పంచాయతీ ఎన్నికలు కొంత ఆలస్యమయ్యాయి. ఆ మేరకు రిజర్వేషన్లు కలి్పంచి త్వరలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. మాకు ఆర్థికంగా సమస్యలున్నాయి కానీ మా ఆలోచనలు, ప్రణాళికల్లో లోపం లేదు.  

కేంద్ర సాయానికి కిషన్‌రెడ్డే అడ్డంకి.. 
కేంద్రంతో విభేదాలు, తగాదాలు మేం పెట్టుకోదల్చుకోలేదు. గతంతో పోలిస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరిగాయి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చామో ప్రజలకు వివరిస్తా. బీజేపీలోనూ కిషన్‌రెడ్డితో తప్ప మిగిలిన వారితో ఇబ్బంది లేదు. హైదరాబాద్‌ సమస్యల పరిష్కారంలో కేంద్ర సాయానికి కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నాడు. కేటీఆర్, కిషన్‌రెడ్డి ఇద్దరూ బ్యాడ్‌ బ్రదర్స్‌. బ్యాడ్‌ మైండ్‌సెట్‌లో ఉన్నారు. 

వైఎస్, కేసీఆర్‌ పాలనను ప్రజలు పోల్చి చూడాలి.. 
ఎవరిది అగ్రికల్చర్‌.. ఎవరిది డ్రగ్స్‌ కల్చర్‌ ప్రజలే నిర్ణయించుకోవాలి. కంటోన్మెంట్‌లో కాంగ్రెస్‌ గెలిస్తే అక్కడి సమస్యలను పరిష్కరించగలిగాం. ఈ నిబద్ధత మీద తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా. వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో 2004–09 మధ్య, ఆ తర్వాత 2009–14 మధ్య రెండుసార్లు ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వంతో 2014–23 మధ్య కేసీఆర్‌ ఆధ్వర్యంలో రెండుసార్లు ఏర్పాటైన ప్రభుత్వాన్ని ప్రజలు పోల్చి చూడాలి. నాడు కాంగ్రెస్‌ రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్, రూ. 69 వేల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అప్పగిస్తే ఆ తర్వాత పదేళ్లు పాలించిన కేసీఆర్‌ మాకు రూ. 8.11 లక్షల కోట్ల అప్పుతో అప్పగించాడు. రెండు పార్టీల పాలనలను పోల్చుకొని ప్రజలు ఓటేయాలని అడుగుతున్నా. 

మైనారిటీలంతా మావైపే...  
మైనారిటీల మద్దతుతోనే మేం అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లోనూ ముస్లింలు సహా మైనారిటీలంతా మా వైపే ఉంటారు’అని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ రవికాంత్‌రెడ్డి ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా వ్యవహరించగా, మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్‌ వరికుప్పల తదితరులు పాల్గొన్నారు.  

‘జూబ్లీహిల్స్‌’లో గెలుపు కాంగ్రెస్‌దే.. 
ఉపఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుంది. బీఆర్‌ఎస్‌ ఓడిపోతుంది. కిషన్‌రెడ్డికి చెబుతున్నా... మీకు డిపాజిట్‌ రాదు. మీ దోస్తు ఈ ఎన్నికల్లో ఓడిపోతాడు. మీరు ఎన్ని గూడుపుఠాణీలు చేసినా 14న సాయంత్రం ఇదే ఫలితం వస్తుంది. పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు,పన్నెండో సంవత్సరం అధికారంలో కొనసాగుతున్న వారు ఇద్దరూ ఏకమై మాపై ముప్పేట దాడి చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఒకవేళ గెలిస్తే దేశంలోనే కాదు.. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లోనూ ఆ పార్టీ గెలిచినట్టే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement