
మీట్ ది మీడియా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ప్రభుత్వాన్ని పడగొడుతుంటే చూస్తూ ఊరుకుంటమా?
కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టకుండా ఉంటమా?
అందుకే ఓ గేట్ ఓపెన్ చేసిన.. ఎన్నికల నగారా మోగింది కాబట్టి రాజకీయ
పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెట్టిన ఇక ఎన్నికల రూపం చూపిస్తా..
వంద రోజుల ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించామన్న సీఎం
వైబ్రెంట్ తెలంగాణ లక్ష్యమని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ మొదలుకొని కడియం శ్రీహరి వంటి వారి దాకా ఈ ప్రభుత్వం మూడు నెలలు కూడా ఉండదంటూ మాట్లాడుతున్నారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎన్నికల తర్వాత ఆపరేషన్ మొదలుపెడతామని అంటున్నారు. ఇది దేనికి సంకేతం? వందరోజుల్లో ఎక్కడైనా, ఎప్పుడైనా ఫిరాయింపుల జోలికి వెళ్లానా? కానీ ఈ రోజు వాళ్లిద్దరూ ఒకే లైన్‌లో మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు. పడగొడుతుంటే చూస్తూ ఊరుకుంటమా? కుక్క కాటుకు చెప్పుదెబ్బ అంటారు.
కొట్టకుంట ఊర్కుంటమా? కొడతం కదా.. అందుకే వందో రోజు మొదలుపెట్టిన. ఓ గేట్ ఓపెన్ చేసిన. ఈరోజు ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే వచ్చా రు. ఎన్నికల నగారా మోగింది కాబట్టి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కూడా పని మొదలు పెట్టిన. నిన్న కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగా చాలా నిబద్ధతతో ప్రతిరోజూ 18 గంటలు ప్రజల కోసం పనిచేసిన. చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పనిచేసిన.
నిన్న 3 గంటలకు ఎన్నికల ప్రధానాధికారి నగారా ఊదిండు. ఇక ఎన్నికల రూపం చూపిస్తా. నా రాజకీయం ఏంటో చూపిస్తా..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ముఖ్య మంత్రిగా 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన ‘మీట్ ది మీడియా’ కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. వందరోజుల్లో అమలు చేసిన కార్యక్రమాలను వివరించారు. అనంతరం విలేకరుల ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు.
నిజాం నకలునే కేసీఆర్ చూపించారు
‘వారసత్వాన్ని తమపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమైంది. ప్రజలు దానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. కేసీఆర్ కుటుంబాన్ని అధికారం నుంచి దించారు. ప్రజాస్వామ్యంపై ఆయనకు నమ్మకం లేదు. ఏనాడూ ప్రజల స్వేచ్ఛను గౌరవించ లేదు. నిజాం నకలునే కేసీఆర్ చూపించారు. ఖాసిం రజ్వీ ద్వారా నిజాం తన ఆధిపత్యం, అధికారంపై తిరుగుబాటు చేసిన వారిని అణిచివేసే ప్రయత్నం చేసినట్లు,ప్రభాకర్‌రావు ద్వారా కేసీఆర్ చేశారు.
ప్రజల స్వేచ్ఛను హరించాలని భావించారు. అందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు. 2023 డిసెంబర్ 3న స్వేచ్ఛను తెచ్చుకున్నారు. 1948 సెపె్టంబర్ 17న ఎలాగో అలాగే స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు..’ అని రేవంత్ అన్నారు.
ఆరు గ్యారెంటీలతో సంక్షేమ పాలన
‘వంద రోజుల ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించాం. మేము పాలకులం కాదు.. సేవకులం అని తెలిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. ఉద్యమ సమయంలో వాహనాలపై రాసుకున్న ‘టీజీ’ని అమల్లోకి తీసుకొచ్చాం. ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం. తెలంగాణ తల్లి, ప్రభుత్వ చిహ్నాల్లో రాజ దర్పాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. సచివాలయంలోకి అందరికీ ప్రవేశం కల్పించాం.
2004 నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని 26 కోట్ల మంది వినియోగించుకున్నారు. ఇప్పటివరకు 8 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించాం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో మరిన్ని వ్యాధులను చేర్చడమే కాకుండా పరిమితి రూ.10 లక్షలకు పెంచాం. 32 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్ పథకాన్ని అందుకున్నాయి..’ అని సీఎం వివరించారు.
కేంద్రం, గవర్నర్‌తో సామరస్యంగా ముందుకు..
‘కేంద్ర ప్రభుత్వంతో, తెలంగాణ గవర్నర్ తమిళిసైతో సామరస్య పూర్వకంగా ముందుకెళ్తున్నాం. వైబ్రంట్ తెలంగాణ మా లక్ష్యం. తెలంగాణ విజన్ –2050 ద్వారా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. మా ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండడం ఖాయం. ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు ఉంటాం. కానీ అభివృద్ధిని 2050 లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
సామాజిక న్యాయానికి మారు పేరుగా
‘వందరోజుల్లో సామాజిక న్యాయానికి మారుపేరుగా పాలన సాగించాం. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, నలుగురు ప్రభుత్వ విప్‌లను నియమిస్తే అన్ని వర్గాలకు అవకాశం కల్పించాం. మంత్రుల్లో కూడా అన్ని వర్గాల వాళ్లు ఉన్నారు. – త్వరలోనే సమాచార హక్కు కమిషనర్లను నియమిస్తా. గతంలో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారిపై మేం చర్యలు తీసుకుంటున్నాం. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సామాజిక స్పృహ కలిగిన మంచి మిత్రుడు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ పదవి ఆయనకే ఇద్దామనుకుంటే తిరస్కరించారు. బీఆర్‌ఎస్‌తో కలిసేంత తప్పు చేయరు. కలిస్తే ఆయనే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.
అనర్హులకు రైతుభరోసా ఇవ్వం
రైతుబంధు పథకాన్ని 5 ఎకరాల లోపు 62 లక్షల రైతులకు అందించాం. రైతుభరోసాను పకడ్బందీగా అమలు చేస్తాం. కొండలు, గుట్టలు, రోడ్లకు, కోటీశ్వరులకు, అనర్హులకు ఇవ్వం. అధికారులపై వ్యక్తిగత కక్ష సాధింపులు ఉండవు. హైదరాబాద్‌లోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో చర్చించి జర్నలిస్టులందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార నిర్ణయంతో వస్తే సంతకం చేస్తా..’ అని రేవంత్ చెప్పారు.
టీయూడబ్లు్యజే ప్రధానకార్యదర్శి విరాహత్ అలీ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎం సీపీఆర్‌వో బోరెడ్డి అయోధ్యరెడ్డి పాల్గొన్నారు.
తన్నీరు.. నువ్వు పన్నీరు కాదు
‘200 యూనిట్ల ఉచిత కరెంటును అమలు చేస్తుంటే కొన్ని గంజాయి మొక్కలు మళ్లీ తమ పరిమళాలను వెదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఉచిత కరెంటుకు సబ్సిడీని ముందు చెల్లించిన తరువాతే వినియోగదారులకు జీరో బిల్లులు జారీ చేయాలని ఈఆర్‌సీ ఆదేశించింది. ఇంటి పేరులో తన్నీరు (తన్నీరు రంగారావు) ఉన్నంత మాత్రాన ఆయన పన్నీరు కాదు. ఈ గంజాయి మొక్కను కూడా పీకుతం. ఎక్కువ రోజులు ఆ కుర్చీలో ఉండవు. విద్యుత్ సరఫరా విషయంలో కొన్నిచోట్ల కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి వందల కోట్లు కాదు, వేల కోట్లకు చేరింది. అవినీతిపై రాజ్యాంగబద్ధంగా విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం. బతుకమ్మను కొందరు ప్లాస్టిక్ బతుకమ్మను చేశారు. ఎవరు ఉన్నా లేకున్నా బతుకమ్మ, బోనాల పండుగలు ఘనంగా జరుగుతాయి. ప్రైవేట్ చేతిలో ఉన్న ధరణిని ప్రభుత్వ సంస్థకు అప్పగించాం. ధరణి పోర్టల్‌ను ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే తప్ప అవినీతి జరిగిందా లేదా అనే విషయం బయటపడదు. తప్పులకు కారణమైన వారిని ఉపేక్షించం..’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.