పోలీస్‌ రాజ్యంలో పచ్చ మూకల రిగ్గింగ్‌ | Chandrababu Govt TDP Leaders Votes Rigging in Pulivendula ZPTC By Election | Sakshi
Sakshi News home page

పోలీస్‌ రాజ్యంలో పచ్చ మూకల రిగ్గింగ్‌

Aug 13 2025 4:43 AM | Updated on Aug 13 2025 7:06 AM

Chandrababu Govt TDP Leaders Votes Rigging in Pulivendula ZPTC By Election

పులివెందులలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలను మెడ పట్టుకొని నెట్టివేస్తున్న పోలీసులు

బందిపోట్లను తలపిస్తూ నిర్బంధాలు.. 

తాలిబన్లను మరిపిస్తూ బెదిరింపులు

అత్యంత దుర్మార్గంగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌

ఒక్క బూత్‌లో కూడా వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ లేకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించిన పోలీసులు

బయటి ప్రాంతాల నుంచి వచ్చి బూత్‌ల ముందే రౌడీలు తిష్ట వేసినా పట్టించుకోని వైనం

ఓటేయడానికి ముగ్గురు నలుగురుగా కలిసి వస్తున్న వారిని పోలీసులే కొట్టి వెనక్కు పంపిన దుస్థితి.. ఒక్కో బూత్‌ను టీడీపీ పెద్ద లీడర్లు పంచుకుని ఊళ్లకు ఊళ్లపై దండయాత్ర 

పులివెందుల జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమంత్‌ రెడ్డి ఇంటి చుట్టూ 200 మంది టీడీపీ గూండాలు తిష్ట 

ఇంటి ముందు షామీయానా వేసి కాపలా 

ఓటు వేయలేకపోయిన జెడ్పీటీసీ అభ్యర్థి

ప్రతి ఊళ్లో 300–400 మంది గూండాల మోహరింపు.. స్థానికులకు బెదిరింపులు 

పిండారీలు, థగ్గులు, బందిపోట్లు తమ ముందు దిగదుడుపేనని చాటిన టీడీపీ కాలకేయులు 

పోలీసుల పహారాలో పెదబాబు, చినబాబు కుట్ర అమలు 

తెల్లవారుజామునే ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అరెస్టు  

వైఎస్సార్‌సీపీ నేత సతీష్‌రెడ్డితోపాటు కీలక నేతలు గృహ నిర్బంధం 

వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లను బూత్‌లలోకి వెళ్లనివ్వకుండా అడ్డగింత 

స్లిప్పులు లాక్కుని.. టీడీపీ మూకలతో దొంగ ఓట్లు వేయించిన రౌడీలు 

రౌడీ మూకలకు సహకరించిన ఖాకీలు

ఒంటిమిట్టలో మంత్రి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడి  

అధికారమదమెక్కిన ‘పచ్చ’గూండాల సాక్షిగా..  పచ్చనోట్లకు అమ్ముడుపోయిన పోలీసుల సాక్షిగా.. ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. శాంతిభద్రతలు కాపాడాల్సిన ఖాకీలే పౌరులపై జులుం చేస్తుంటే.. ఓటు చోరులకు పెత్తనం ఇస్తుంటే.. ఓటు స్వామ్యం చిన్నబోయింది. 

తెల్లారకముందే.. చిరు చీకట్లు వీడకముందే  ఖాకీ.. ఖద్దరు ద్వయం ఏకమై.. దౌర్జన్యకాండ రాసింది.  గడప దాటొద్దంటూ.. ఏజెంట్లు రాకూడదంటూ..  ఓటర్ల హక్కులను కాలరాసింది. ఎన్నికను ఏకపక్షంగా మార్చడానికి ప్రజాస్వామ్య విలువల్ని నిలువునా పాతరేసింది.   

ఒక ఎన్నిక.. వంద కుట్రలు... గంతలు కట్టిన ‘నిఘా కళ్ల’తో.. గల్లంతైన పోలింగు కేంద్రాలతో..  జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చిన్నబోయాయి..  దొంగ ఓటర్ల వేలిపై పడ్డ సిరా చుక్క సైతం సిగ్గు పడింది. కూటమి నేతల అరాచకాలు.. పరాకాష్టకు చేరిన వేళ..  ‘బ్యాలెట్‌ బాక్స్‌’సైతం మౌనంగా రోదించింది.  

ఈ మాత్రం ఎన్నికల కోసం పోలింగ్‌ కేంద్రం మారింది..  పోలీసు తీరు మారింది..  ఎల్లో గూండాల రాజ్యంలో ఓటు సైతం గల్లంతైంది.. చివరికి ‘దొంగ ఓటే’ బ్యాలెట్టులో నిక్షిప్తమైంది.    

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు.. ఐసిస్, తాలిబన్, హమాస్‌ తీవ్రవాదులు.. పిండారీలు, థగ్గులు వంటి బందిపోట్లు కలగలిసినా తమ ముందు దిగదుడుపేనని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో పెదబాబు, చినబాబు సారథ్యంలోని టీడీపీ కాలకేయులు చాటిచెప్పారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, ప్రలోభాలు మొదలు.. ఎన్ని అడ్డదారులు తొక్కినా ఆ రెండు జెడ్పీటీసీ స్థానాల్లో తమ అభ్యర్థులకు ఘోర పరాజయం తప్పదని తమ అంతర్గత సర్వేల్లో తేలడంతో పెదబాబు, చినబాబు నిస్సిగ్గుగా బరితెగించారు. ఎలాగైనా సరే.. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో గెలిచి తీరాల్సిందేనని తమ కాలకేయ సైన్యానికి దిశా నిర్దేశం చేశారు. అత్యంత క్రూరులైన పచ్చ కాలకేయులకు కొంత మంది పోలీసు అధికారులను పెదబాబు, చినబాబు జత చేశారు. దీంతో మంగళవారం పోలింగ్‌ సందర్భంగా టీడీపీ కాలకేయ సైన్యం ఆకాశమే హద్దుగా చెలరేగింది. విచక్షణ మరచి పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. 

పోలీసులే ముందుండి అరాచకం
స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ప్రశాంత వాతావర­ణాన్ని కల్పించాల్సిన పోలీసులే అరాచకానికి తెరతీశారు. పోలింగ్‌ ప్రారంభానికి 2.30 గంటల ముందే అంటే మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకే వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డిలను పోలీసులు నిర్బంధించారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానం పరిధిలో 15 పోలింగ్‌ బూత్‌లు ఉంటే, ఏ ఒక్క బూత్‌లోకి కూడా వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. 

పోలింగ్‌ బూత్‌కు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న ఓటర్లను పోలీసులే అడ్డుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలని మహిళా ఓటర్లు కాళ్లు పట్టుకున్నా పోలీసులు కనికరించలేదు. తమ కళ్లెదుటే స్లిప్పులను ఓటర్ల నుంచి టీడీపీ గూండాలు లాక్కుని దౌర్జన్యం చేసినా ప్రేక్షక పాత్ర వహించారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, నాయకులపై టీడీపీ గూండాలు అత్యంత పాశవికంగా దాడులు చేస్తున్నా పోలీసులు కనీసం నిలువరించే ప్రయత్నం కూడా చేయలేదు. 

సోమవారం రాత్రికే జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, సరిహద్దు జిల్లాల నుంచి టీడీపీ గూండాలు, రౌడీలు ఒక్కో పోలింగ్‌ బూత్‌ వద్దకు 300 నుంచి 400 మంది వరకు చేరుకుని, అక్కడే తిష్టవేశారు. పోలింగ్‌ బూత్‌లను హైజాక్‌ చేసి.. మంగళవారం ఉదయం 7 గంటలకే ఆ రౌడీలు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకున్నారు.. రిగ్గింగ్‌ చేశారు. చివరకు పులివెందుల జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డి.. అతని జనరల్‌ ఏజెంట్‌ ఎం.బాలరామిరెడ్డిని ఓటు వేయనివ్వకపోగా.. వారి ఓట్లను కూడా దొంగగా వేసుకున్నారంటే టీడీపీ గూండాల దౌర్జన్యం, పోలీసుల అరాచకం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1951 అక్టోబర్‌ 25న తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు.. అంటే 74 ఏళ్ల దేశ ఎన్నికల చరిత్రలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నిక పోలింగ్‌ అంత దుర్మార్గంగా మరో ఎన్నిక జరగలేదని ఎన్నికల నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ రిటైర్డు ఐఏఎస్‌ అధికారి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకే ఈ ఉప ఎన్నిక కళంకంగా నిలిచిపోతుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు 

అత్యంత దుర్మార్గంగా పోలింగ్‌ 
పులివెందుల వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల హేమంతరెడ్డి ఇంటి చుట్టూ మంగళవారం తెల్లవారుజామునే 200 మందికిపైగా జమ్మలమడుగు, కమలాపురం నుంచి వచ్చిన టీడీపీ గూండాలు చేరుకుని సాయంత్రం వరకు అక్కడే తిష్ట వేసి పార్టీ చేసుకున్నారు. హేమంతరెడ్డిని ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకున్నారు. 

⇒ పులివెందుల జెడ్పీటీసీ స్థానం పరిధిలో 15 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించినప్పటికీ.. ఎక్కడా వైఎస్సార్‌సీపీ ఏజెంటు కూర్చునేందుకు భద్రత కల్పించలేదు. టీడీపీ నేతల దౌర్జన్యానికి, వారిపై గ్రామస్తులు తిరుగుబాటు చేయకుండా పోలీసులు పహారా కాశారు. 

⇒ రాగిమానుపల్లె, అచ్చవెళ్లి, ఎర్రిపల్లె, యర్రబల్లె–1, యర్రబల్లె–2, ఈ.కొత్తపల్లె పంచాయతీల పరిధిలో 15 పోలింగ్‌ బూత్‌లు ఉండగా, ఏ ఒక్కచోట కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోలింగ్‌ ఏజెంటును కూర్చో­నివ్వలేదు. హేమంతరెడ్డి సొంతూరు తుమ్మలపల్లి, బాలరామిరెడ్డి సొంతూరు నల్లపురెడ్డిపల్లెలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ గూండాలు వందల మంది పోలింగ్‌ కేంద్రం వద్ద మకాం వేశారు. పోలింగ్‌ బూత్‌కు వెళ్లేందుకు ఆస్కారం లేకుండా అడ్డగించారు. వస్తే దాడి చేస్తామని హెచ్చరికలు పంపారు. పోలీసులను రక్షణ కల్పించాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. 
 


⇒ పోలింగ్‌ బూత్‌లలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లుగా కూర్చునేందుకు పోలీసులు, టీడీపీ గూండాలు అనుమతించలేదని తెలిసి మహిళలు సాహసం చేశారు. తాము పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చుంటా­మని ఎర్రిపల్లెకు చెందిన అన్నారెడ్డి మమత, మునే­శ్వరీ, గంగాభవానీ వెళ్లారు. టీడీపీ రౌడీలు అడ్డగించినా లెక్కచేయకుండా పోలింగ్‌ బూత్‌లోకి వెళ్తుంటే.. పోలీసులు అడ్డుతగిలి బెదరగొట్టి వెనక్కు పంపారు. 

⇒ నల్లగొండువారిపల్లెకు చెందిన సంధ్య నల్లపురెడ్డిపల్లెలో ఏజెంటుగా కూర్చు­నేందుకు వచ్చినా పోలీసులు అదే రీతి­లో బె­దరగొట్టారు. ‘ఎవ్వరూ ఏజెంటుగా లేకపోతే, మీరొ­చ్చి ఏమి చేద్దా­మని? నోరు మూసుకొని పోండి’ అంటూ టీడీపీ రౌడీ మూక బెదిరించింది. విశ్వ ప్రయత్నం చేసినా పోలీసులు సహకరించక పోవడంతో వారు వెనుతిరిగి వెళ్లారు.

రాజ్యమేలిన రౌడీయిజం
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్‌లో టీడీపీ రౌడీయిజం రాజ్యమేలింది. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకే కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఇంటికి పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, సీఐ­లు వెంకటరమణ, ఉలసయ్య, చాంద్‌బాషా నేతృత్వంలో భారీగా పోలీ­సు­లు చేరుకున్నారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసి, కడప వైపు తీసు­కెళా­్లరు. 

‘పోలీసులకు సహకరిస్తాం, హౌస్‌ అరెస్టు చేసుకోండి, ఎక్కడికీ వెళ్లను, పైగా జ్వరం వస్తోంది’ అని చెప్పినా పోలీసులు అత్యంత కిరాతకంగా లాక్కువెళ్లి వాహనంలోకి బలవంతంగా తోశారు. ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయడం.. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌­రెడ్డితోపాటు కీలక నేతలను పో­లీç­Üులు గృహ నిర్బంధం చేయడంతో పెదబాబు, చిన­బా­బు పన్నిన కుట్ర అమలుకు మార్గం సుగమమైంది. పోలీసుల ఏకపక్ష చర్యల కారణంగా కేడర్‌ పోలింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్ల­లే­కపోయింది. మరింతగా రెచ్చిపోయి టీడీపీ నేతలు ఏక­పక్షంగా పోలింగ్‌ నిర్వహించుకున్నారు.

ఎక్కడికక్కడ ఓటర్ల అడ్డగింత
స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించాల్సిన పోలీసులే అరాచకానికి తెగబడ్డారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన ఓటర్లను పోలీసుల పహారాలో టీడీపీ రౌడీమూకలు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఓటర్ల నుంచి ఓటరు స్లిప్పులు లాక్కుని వారిని వెనక్కి పంపించేశారు.

అవే ఓటరు స్లిప్పులను ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ రౌడీలకు ఇచ్చి దొంగ ఓట్లు వేయించారు. టీడీపీ వర్గీయులైన వారిని మాత్రమే ఓటు వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ముందస్తు పథకం ప్రకారం క్యూలైన్లలో టీడీపీ గూండాలను బారులు తీరేలా చేసి.. పూర్తిగా ఏకపక్షంగా సైక్లింగ్‌ చేసుకుంటూ.. దొంగ ఓట్లు వేసుకున్నారు.. రిగ్గింగ్‌ చేసుకున్నారు.

పోలింగ్‌ బూత్‌ల వద్దనున్న బీఎల్‌ఓల నుంచి ఓటర్ల వివరాలు తీసుకుని.. కడప పార్లమెంట్‌ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ భూపేష్‌రెడ్డి పీఏ సుదర్శన్‌రెడ్డి దగ్గరుండి స్లిప్‌లు రాయిస్తూ దొంగ ఓట్లను ప్రోత్సహించారు. ఎర్రిబల్లిలో టీడీపీ నేత పుత్తా లక్ష్మిరెడ్డి, కమలాపురం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాఘవరెడ్డి, జమ్మలమడుగు జంబాపురం రమ­ణారెడ్డి, మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున, సర్పంచ్‌ పుల్లారెడ్డి, గూడెంచెరువు శివారెడ్డి, చిన్నదండ్లూరు రామచంద్రయ్య, కల్వ­టాల రాజన్న, కంబాలదిన్నె కుళాయి, బీమగుండం రాజగోపాల్, నవాబుపేల మర్రి ప్రకాశం, రామ­స్వామిరెడ్డి, ద్వారకచర్ల జనార్ధన్‌రెడ్డి.. కమ­లాపు­రం, పులివెందుల, జమ్మలమడుగు నియో­జకవ­ర్గాలకు చెందిన టీడీపీ వర్గీయులంతా 15 పోలింగ్‌ బూత్‌ల్లో ఇష్టారాజ్యంగా దొంగ ఓట్లు వేశారు.

ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ గూండాలు మీడియానూ వదలలేదు. ఏకపక్ష పోలింగ్‌పై ఎలాంటి  కవరేజ్‌ లేకుండా జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలో ‘రికార్డు చేయవద్దని చెబుతుంటే అర్థం కాలేదా..’ అని గద్దిస్తూ కర్నూలు నుంచి వచ్చిన ఎన్టీవీ ప్రతినిధి కెమెరాను యర్రబల్లెలో ధ్వంసం చేశారు. ‘సాక్షి’ ప్రతినిధులకు అడుగడుగునా ఆటంకం కలిగిస్తూ.. భౌతిక దాడులు చేసేందుకు యత్నించారు. పచ్చ మూకల రౌడీయిజంతో మంగళవారం పులివెందుల మండలం అట్టుడికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement